Alitho Saradaga Latest Promo: 'శేఖర్'తో ఓ కొత్త రాజశేఖర్‌ను చూస్తారని నటి జీవిత అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి జీవితా రాజశేఖర్ దంపతులు విచ్చేసి అనేక విషయాలను పంచుకున్నారు. సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఇద్దరూ వేర్వేరుగా ప్రివ్యూ షోలకు వెళ్లి వస్తుంటే తొలిసారి చూసుకున్నామని జీవిత తెలిపారు. ఇక త్వరలో విడుదల కానున్న 'శేఖర్' కథతో తాను చాలా కనెక్ట్ అయ్యాయని, సినిమా షూటింగ్ చేద్దామనుకునే సమయానికి రాజశేఖర్ కొవిడ్ బారినపడ్డారని వివరించారు. అప్పుడు ఎంత సీరియస్ అయిందో అందరికీ తెలిసిందేనని, నెల రోజుల పాటు ఐసీయూలో ఉన్నారని చెప్పుకొచ్చారు.
రెండు, మూడు రోజుల్లో చనిపోతాననుకున్నా: రాజశేఖర్
Alitho Saradaga Latest Promo: తనకు కరోనా వచ్చినప్పుడు చనిపోతానేమో అని అనుకున్నట్లు చెప్పారు సీనియర్ హీరో రాజశేఖర్. 'అలీతో సరదాగా' షోకు వచ్చిన సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే?
"నాకు సీరియస్ అయినప్పుడు చనిపోతానని అనుకున్నా. రెండు, మూడురోజుల్లో నా శవాన్ని తీసుకెళ్లి చితికి నిప్పు పెడతారని అనుకుంటూ ఉండేవాడిని. అప్పటికి నా మైండ్ అలా ఉంది" అని రాజశేఖర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక 'నట వారసులు ఉంటే బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా' అని ఆలీ అడగ్గా "నాకు చాలాసార్లు అనిపించింది. కానీ, కుదరలేదు" అని రాజశేఖర్ చెప్పేసరికి నవ్వులు వెల్లి విరిశాయి. రాజశేఖర్ తనని కుట్టి అని ముద్దుగా పిలుస్తారని ఈ సందర్భంగా జీవిత చెప్పుకొచ్చారు. "మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా విభేదాలు వచ్చాయా" అని ఆలీ అడిగిన ప్రశ్నకు, "ఎలాంటి భార్య లభిస్తుందన్నది దేవుడిచ్చిన వరం" అంటూ రాజశేఖర్ సమాధానం ఇచ్చారు.