Alitho Saradaga Brahmanandam: తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ హాస్యబ్రహ్మగా మారిన నటుడు.. బ్రహ్మానందం. ఆయన ఇటీవల ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశారు. రెండు భాగాలుగా జరిగిన ఇంటర్వ్యూలో తొలి భాగం గతవారం ప్రసారం కాగా.. కొనసాగింపుగా జరిగిన ఇంటర్వ్యూ రెండో భాగంలో ఆయన పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..
ఇంతలా నవ్వించే మీరు.. ఎప్పుడైనా నవ్వులపాలయ్యారా?
బ్రహ్మానందం: ఎవరికైనా నవ్వులపాలవడం సాధారణ విషయమే. ఎవరైనా తాను నవ్వులపాలు కాలేదు అంటే అది అబద్దం. దుర్యోధనుడంతటి వాడే నవ్వులపాలయ్యాడు మనమెంత..?
సమాజానికి ఇంత చేస్తున్నాం.. అయినా మన మీద బురదజల్లుతున్నారు అని ఎప్పుడైనా బాధ పడ్డారా?
బ్రహ్మానందం: సమాజానికి మనం ఏమీ చేయట్లేదు. మన కోసం మనం చేస్తున్నాం. అయితే, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఒకరికి బురదజల్లడం లక్షణమైతే.. బురదజల్లించుకునే స్థితికి రావడం ఇంకొకరి లక్షణం. ఓ పది, పదిహేను మంది ఉన్న చోట ఇవన్నీ మామూలే.
కల్యాణ మండపం కట్టించారు.. అది సమాజం కోసం కట్టించలేదా?
బ్రహ్మానందం: కాదు. నేను ఇది చేశాను.. అని చెప్పుకోవడం నాకు మొదటి నుంచి నచ్చదు. నేను చేశాను అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ.. చేయించుకున్నవాడికి 'నేను వాడి చేత చేయించుకున్నాను' అని చెప్పుకోవాల్సి స్థితి కలగకూడదు. అదే నమ్ముతాను. అందుకే చెప్పుకోవడం ఇష్టం లేదు.
ఒకప్పుడు విడుదలయ్యే ప్రతి సినిమాలో మీరు కనిపించేవారు. ఈ మధ్య కాలంలో మీ జోరు ఎందుకు తగ్గింది?
బ్రహ్మానందం: బ్రహ్మానందం ఎందుకులే అని వారు(దర్శకులను ఉద్దేశించి) అనుకోవచ్చు. లేదా ఎందుకులే అని నేనే అనుకొని ఉండొచ్చు. మరో విషయం ఏంటంటే.. రెండేళ్ల కిందట నాకు హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో ఇంట్లోవాళ్లు 'కష్టపడింది చాలు.. ఇక సినిమాలు చేయొద్దు' అని చెప్పారు. ప్రస్తుతం ఐదారు సినిమాలు చేస్తున్నా. 'భీమ్లా నాయక్', 'రంగమార్తాండ', 'కలవారి కోడళ్లు', నితిన్ సినిమాలో నటిస్తున్నా. జోరు తగ్గడం.. పెరగడం అనేది మన చేతుల్లో ఉండదు. 'ఈ మధ్య బ్రహ్మానందంతో మాట్లాడుతుంటే కామెడీ ఉండట్లేదు.. అంతా వేదాంతం చెప్పేస్తున్నాడు' అని అంటుంటారు. కామెడీ, వేదాంతం, నిజం వేర్వేరు కాదు.. అంతా ఒక్కటే.
బ్రహ్మానందంతో పెట్టుకుంటే సమయానికి రాడు.. ఆయన అనుకున్న సమయానికే వస్తాడు. సాయంత్రం 5గంటలకే వెళ్లిపోతాడు అని అంటుంటారు. వాళ్లకు మీ సమాధానం?
బ్రహ్మానందం: వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, నేను ఒక్కటే చెప్తున్నా. నేను పడ్డంత శ్రమ ఎవరూ పడలేదు. 38ఏళ్లలో 1,254 సినిమాలు చేశా. నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఓ వేదికపై శ్యామ్ బెనగల్ గారితో ‘నేను ఇప్పటికి 800 సినిమాల్లో నటించాను’ అని అంటే.. రాత్రీపగలు పనిచేశారా అని అడిగారు. మేం అప్పుడు రోజుకు 18గంటలు చేశాం. ఇప్పుడున్న కమెడియన్లు చేసి ఉండరు. ఊహ తెలిసినప్పటి నుంచి, ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కష్టపడి పనిచేస్తూనే ఉన్నా. నా కెరీర్ చివర్లో అయినా కాస్త సుఖపడాలనుకుంటున్నాను. నాకంటూ కొంత టైం కేటాయించుకోవాలి. ఉదయాన్నే హడావుడి చేయడానికి వయసు సహకరించాలి కదా! ఈ మధ్య ఓ వీడియో బైట్ ఇచ్చా ‘తెలంగాణ దేవుడు’ సినిమా చూడండని చెప్పడానికి. అయితే, అదే సమయంలో ‘రంగమార్తాండ’ సినిమాలో ఒక పాత్ర కోసం గడ్డం పెంచుకున్నా. అది చూసి చాలా మంది నాకు ఆరోగ్యం బాగోలేదనుకొని ఆరా తీస్తూ కామెంట్లు పెట్టారు. ఇవాళ్టికీ నన్ను ప్రేక్షకదేవుళ్లు అభిమానిస్తూ.. ఆదరిస్తున్నారు కాబట్టి ఇంకా సినిమాలు చేస్తాను.. కానీ నాక్కూడా కొంచెం విశ్రాంతి ఇవ్వండని కోరుకుంటున్నా అంతే.
వయసులో ఉన్నప్పుడు రాత్రి.. పగలు కష్టపడ్డాం. సమయం, పని అందరికి దొరకదు. నువ్వు(అలీని ఉద్దేశించి), నేను గొప్పవాళ్లమని కాదు.. మనకంటే గొప్పవాళ్లు కృష్ణానగర్, గణపతి కాంప్లెక్స్‌లో చాలా మంది ఉన్నారు. వాళ్లందరికి అవకాశాలు రాలేదు.. పనులు దొరకలేదు. పని దొరకలేదని చాలా మంది బాధపడుతున్నారు. పని దొరికినప్పుడు దాన్ని గౌరవంగా చేసుకోవాలి. ఒక వయసుకు వచ్చాక.. పిల్లల కోసం కష్టపడాలి గానీ.. మన కోసం మనం కష్టపడకూడదు.
ప్రపంచమంతా మిమ్మల్ని చూస్తే నవ్వుతుంది.. మరి నిన్ను నవ్వించేవాళ్లు ఎవరు?
బ్రహ్మానందం: నా మనవడు పార్థ. వాడు మాములోడు కాదు. 'తాత.. నీకు తెలియదు నువ్వు ఊరుకో' అంటూ విసుక్కుంటుంటే నవ్వొస్తుంది. కరెక్టుగా నాకు మనవడితో ఆడుకునే వయసు రాగానే పుట్టాడు.
గౌతమ్ ఉదయం మీ వద్దకు వచ్చి 'నాన్న.. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను' అని చెప్పగానే.. సాయంత్రం ఇంటికొచ్చి ఒకే.. పది రోజుల్లో పెళ్లి చేసేద్దాం అని చెప్పారట. అంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ఏంటి?
బ్రహ్మానందం: అందరూ అదే అడుగుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. 'నాన్న.. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను' అన్నాడు. అదేదో ‘మర్డర్ చేశాను నాన్న.. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్’అని అడుగుతున్నాడా? ప్రేమించాను అంటే తప్పేలా అవుతుంది. పైగా టీనేజీ కుర్రాడు కాదు.. బాగా చదువుకున్నాడు. అమ్మాయిని చూశాడు.. ప్రేమించాను అన్నాడు. ప్రేమించాను అంటే.. ఐదారేళ్లు ఆలోచించాలా? ఏం అక్కర్లేదు. వాడికి అమ్మాయి ఇష్టం. అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఒప్పుకోవడం తండ్రి కనీస బాధ్యత. ఈ మధ్య కాలంలో ప్రేమించడం.. అమ్మాయిల్ని ప్రేమించలేదని చంపేయడం ఇలాంటివి టీవీల్లో చూస్తున్నాం. ప్రేమ అనేది చావు లేనిది. కుదరకపోతే వదిలేయాలి. కానీ.. దానికి కక్ష పెంచుకోవడం సరికాదు.
ఒక సమయంలో బ్రహ్మానందం చేసిన పాత్రలన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఒకేలా చేస్తున్నారు అన్న మాటలు వినిపించినప్పుడు ఏమనిపించింది?
బ్రహ్మానందం: నేను దర్శకత్వం వహించట్లేదు.. సినిమా తీయట్లేదు.. పాత్రలు సృష్టించట్లేదు. ఈ మూడు పనులు ముగ్గురు వేర్వేరు వ్యక్తులు చేస్తున్నారు. ఓ నిర్మాత ఒక సినిమా చేస్తున్నాడు అనుకుందాం.. దర్శకుడు తనకు బ్రహ్మానందం కావాలంటారు.. బ్రహ్మానందం పాత్రను రచయితతో రాయిస్తారు. నేను ఆ పాత్ర గతంలోనే చేశా.. ఇప్పుడు నేను చేయను అంటే.. అవకాశాలే ఉండవు. కాబట్టి.. మన దగ్గర నుంచి వాళ్లు ఏం కావాలనుకుంటున్నారో అది ఇవ్వాలి. కామెడీ ఒకే టైపులో ఉంది అంటే ఎలా? రెండో టైపు కామెడీ చేయగలమని మనం నిరూపించుకోవాలి. ‘మనీ’ సినిమాలో నా పాత్ర గతంలో నేను చేసిన కామెడీకి భిన్నంగా ఉంటుంది. 'ఖాన్ దాదా'గా ఆహార్యం, నడక, మాట పూర్తిగా వేరు. నాలో ఆ కోణాన్ని శివనాగేశ్వరరావు చూడగలిగారు. రామ్ గోపాల్ వర్మ, శివనాగేశ్వరరావు కలిసి నేను ఇలా బాగుంటానని ఆలోచించి చేశారు. ఆ టైపు పాత్రలను ఎవరైనా చూసి చేయగలితే బాగుంటుంది. తాజాగా రంగమార్తాండ సినిమాలో నాది తెల్ల గడ్డంతో స్టేజ్ ఆర్టిస్ట్ పాత్ర.. ప్రకాశ్‌రాజ్‌కు స్నేహితుడిగా చేస్తున్నా. అది చేస్తున్నప్పుడు ఈ పాత్ర చేస్తానని దర్శకుడు ఎలా అనుకున్నారు అని అనడానికి లేదు. వాళ్లు ఏది ఇచ్చి చేయమంటే అది చేస్తాం.
ఒక ఆర్టిస్టు డైలాగు చెప్పగలడు.. కమెడియన్లు కామెడీ చేస్తారు. కానీ.. మంత్రాలు చదవడం చాలా కష్టం. మీకెలా వచ్చింది?