Alitho Saradaga Actors Srikanth and Poorna: కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా.. ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. ఈ మధ్య బాలయ్య 'అఖండ' సినిమాలో కరడుగట్టిన విలన్ పాత్రను పోషించి ప్రేక్షకుల్ని భయపెట్టేశారు. మరోవైపు కేరళ 'సీమటపాకాయ్' పూర్ణ.. హీరోయిన్‌గా, సహాయనటిగా విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరిద్దరూ కలిసి ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వారు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
ఆలీ: ఫ్యామిలీమ్యాన్.. మంచి భర్త, అన్న, కొడుకు, బాబాయ్.. ఇలా అన్ని పాత్రల్లో శ్రీకాంత్‌ను చూశాం. కానీ.. ‘అఖండ’ చిత్రంలో వరదరాజులు పాత్రలో మిమ్మల్ని ఊహించలేదు.
పూర్ణ: నేను కూడా శ్రీకాంత్ గారి నుంచి అలాంటి పాత్ర ఊహించలేదు. భావనతో ఆయన సినిమా (మహాత్మ) చేసినప్పుడు చాలా అందంగా కనిపించారు. 'అఖండ' షూటింగ్ తొలి రోజు అలాంటి శ్రీకాంత్ కోసం నేను ఎదురుచూస్తుంటే చిరాకుపుట్టించే ముఖంతో ఒకరు వచ్చారు. ఆ తర్వాత తెలిసింది ఆయనే శ్రీకాంత్ గారు అని. ఆ పాత్ర కోసం ఆయన అంతలా మారిపోవడం గొప్ప విషయం.
శ్రీకాంత్ మీరు ఎన్ని సినిమాల్లో నటించారు?
శ్రీకాంత్: 140 సినిమాలు.
పూర్ణ: నాకు 'అఖండ'లో అవకాశం 'ఈటీవీ' ద్వారానే వచ్చింది. నా నంబర్ తెలియకపోతే ఈటీవీ ద్వారా కనుక్కున్నారు. అందుకే 'ఈటీవీ'కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పదేళ్ల కిందటే నేను బోయపాటి శ్రీను గారితో సినిమా చేయాల్సింది. కానీ కుదర్లేదు. దీంతో 'అఖండ'లో ఒక కీలక పాత్ర ఉంది చేస్తారా?' అని బోయపాటి అడిగారు. 'మీతో, బాలకృష్ణ గారితో పనిచేయడం నా అదృష్టం. ఎంత ముఖ్యమైన పాత్ర అయితే తప్ప నన్ను పిలవరు. తప్పకుండా చేస్తా' అని చెప్పా. పద్మావతి పాత్ర ఏడిస్తే.. ప్రేక్షకులు కూడా బాధపడాలి. అలాంటి బలమైన పాత్రను పోషించినందుకు సంతోషంగా ఉంది.
మీరు ఎన్ని సినిమాలు చేశారు?
పూర్ణ: అన్ని భాషల్లో కలిపి 35. తొలిసారి 2004లో ఫ్రెండ్ పాత్రలో నటించా. రోలర్‌స్కేటింగ్ భరతనాట్యంలో నేను గోల్డ్ మెడలిస్ట్‌ని. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే పిచ్చి. మా అమ్మకు నన్ను సినిమాల్లో చూడాలని కోరిక. కానీ, ముస్లిం అమ్మాయిని కాబట్టి.. చాలా ఆంక్షలున్నాయి. అలాంటిది క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం చాలా కొత్తగా ఉండేది. 8వ తరగతి చదువుతున్న సమయంలో మలయాళ దర్శకుడు కమల్ సినిమాలో ఫ్రెండ్ పాత్ర చేశాను. షూటింగ్ సమయంలో నన్ను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నటించొద్దు అనుకున్నాను. అయితే, మా అమ్మ నన్ను వారించింది. కెరీర్ మొదట్లో అందరికీ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని, ఈ సినిమా వరకు ప్రయత్నించి చూద్దామని చెప్పింది. ఆ సినిమా తర్వాత విరామం తీసుకొని చదువుపై దృష్టి పెట్టా.
ఆ తర్వాత నటుడు దిలీప్‌కు సోదరి పాత్ర చేశాను. అప్పుడే ఇకపై ఫ్రెండ్, సోదరి పాత్రలు చేయకూడదని నటి గోపిక సూచించారు. దీంతో హీరోయిన్‌గా నటించాలని నిర్ణయించుకున్నా. అలా 2008లో తిరుమురుగన్ దర్శకత్వంలో వచ్చిన 'మునియండి విలంగైల్ మూన్రమండు' చిత్రంలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించా. అందులో భరత్ హీరో. అయితే, అప్పుడప్పుడు సినిమాలు మానేద్దామని ప్రయత్నిస్తుంటా. కానీ, అది అవ్వట్లేదు. ఐదేళ్ల కిందట నాకు డ్యాన్స్‌తోపాటు సినిమా కూడా ముఖ్యమని అనిపించింది. అందుకే సినిమాలు చేస్తున్నా.
రెండున్నరేళ్ల కిందట నా షోకి వచ్చారు. ఆ సమయంలో బాలకృష్ణ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారా అని అడిగితే. 'లేదు.. అదంతా పుకారు' అన్నారు. ఇప్పుడు అదే నిజమైంది కదా?
శ్రీకాంత్: అప్పుడు అది పుకారే. బోయపాటితో 'సరైనోడు'లో నటించా. అందులో నాది చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న బాబాయ్ పాత్ర. రెగ్యులర్‌గా చేసే పాత్రలాగే ఉందని అందరూ అనుకున్నారు. దీంతో 'మిమ్మల్ని విలన్ చేస్తాను. చిన్న చిన్న సినిమాలు చేయొద్దు'అని బోయపాటి నాతో చెప్పారు. ఆ తర్వాత నేను సినిమాల్లో హీరోగా.. వెబ్‌సిరీస్‌లు చేసుకుంటూ ఉన్నా. ఓరోజు బోయపాటి నన్ను రమ్మన్నారు. వెళ్లి కలిస్తే బాలకృష్ణ గారి సినిమాలో వరదరాజు పాత్ర గురించి చెప్పారు. నేను అది ఊహించలేదు. బాలకృష్ణ గారి చిత్రంలో విలన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలియదు. చేస్తానని చెప్పినా లోపల కొంత భయం. ఓ సందర్భంలో ఈ పాత్ర ప్రేక్షకులకు నచ్చకపోతే నా కెరీర్ అంతమైపోతుందేమోనని ఆలోచించా. పాత్ర చేయొద్దని అనుకున్నాను. కానీ, బోయపాటి గారు విలన్ లుక్ ఎలా ఉంటుందో ఫొటో చూపించారు. దాని ప్రకారం గెటప్ వేసుకున్న తర్వాత నాకు నమ్మకం కలిగింది.
ఇంట్లోవాళ్లు సినిమా చూశారా?
శ్రీకాంత్: చూసి చాలా భయపడ్డారు. ఏదైనా భిన్నమైన గెటప్ ఉంటే దాంతోనే ఇంటికి వెళ్లిపోతా. ఇంట్లో వాళ్లు చూసి ఎవరో వచ్చారనుకుంటారు. సినిమా చూశాక అద్భుతంగా ఉందన్నారు. బాలకృష్ణ గారి నటన గురించి చెప్పక్కర్లేదు.
సెకెండ్ హాఫ్‌లో ఆ రేప్ సీన్ చూసి ఏమన్నారు?
శ్రీకాంత్: నేను అది అడగలేదు. కానీ, ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చేయాలి. ఆ సీన్ చేసేటప్పుడు కొంత కంగారుపడ్డా. కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కానీ, నాకున్న ఫ్యామిలీమ్యాన్ ఇమేజ్‌కు ఇలాంటి ఇబ్బందికర సీన్లు ఉంటే బాగోదని తీసేశారు. తర్వాత సింపుల్‌గా షూట్ చేశారు. ఎందుకంటే ఆ పాత్ర అలా తప్పక చేయాల్సిందే. అదేం పెద్ద ఇబ్బందిపడే విధంగా లేదు.
మీరు హీరోగా ఉన్నప్పుడు చాలా మంది విలన్లను కొట్టారు కదా? ఇప్పుడు తెలిసిందా.. ఒక విలన్ బాధ ఎంత ఉంటుందో?
శ్రీకాంత్: నేనూ మొదట విలన్‌నే కదా..! మొదట దెబ్బలు తినే వచ్చాను. తర్వాత కొట్టాను. ఇప్పుడు మళ్లీ దెబ్బలు తింటున్నా. నాకు ఆ సమస్య లేదు.
ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?
శ్రీకాంత్: హీరోగా చేసినప్పుడు కూడా అన్ని ఫోన్లు రాలేదు. 'వరదరాజులు గారు.. గుడ్ మార్నింగ్' అంటూ ఫోన్లు వస్తున్నాయి. శ్రీకాంత్‌ను మర్చిపోయి నన్ను వరదరాజులుని చేస్తారేమో.. సాధారణంగా కనిపించే నేను.. ఆ పాత్ర చేసేసరికి ఇప్పటికీ నేనేనా అనిపిస్తుంటుంది.
చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణతో కలిసి నటించారు. బాలయ్యగారితో పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంది?
శ్రీకాంత్: మొదట్లో నేను విలన్ పాత్రలు చేస్తున్నప్పుడు వెంకటేశ్, నాగార్జున గారితో సినిమాలు చేశాను. హీరోగా చేస్తూనే చిరంజీవితో చేశాను. రామ్‌చరణ్, బన్నీతోనూ నటించా. హీరోగా చేస్తూనే మంచి పాత్ర అడిగితే చేస్తున్నాను. అలాగే బాలకృష్ణ గారి 'శ్రీరామరాజ్యం'లో లక్ష్మణుడి పాత్ర చేశా. అది మంచి పాత్రే. నా స్వభావానికి దగ్గరగా ఉండేది. కానీ, 'అఖండ'లో బాలకృష్ణ పక్కన నాది రావణాసురుడి పాత్ర.
బాలకృష్ణ గారితో నేను ‘శ్రీరామరాజ్యం’ చేశాను కాబట్టి మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆయన సెట్లో చాలా సరదాగా ఉంటారు. సెట్‌లోకి రాగానే ఆయన గురించి.. పాత రోజుల గురించి చెబుతుంటారు. రోజంతా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. సీన్స్ చేసేటప్పుడు మామధ్య పోటీతత్వం ఉండేది. నాగార్జున, వెంకటేశ్ గారితో చేసేటప్పుడు స్నేహపూర్వక.. చిరంజీవి, బాలకృష్ణ గారితో గౌరవప్రదమైన వాతావరణం ఉంటుంది.
పూర్ణ.. మీరు స్కూల్‌లో కిటికీ పక్కన కూర్చుంటే మీకు సైట్ కొట్టారంట.. ఆ అబ్బాయి ఎవరు?
పూర్ణ: ఇప్పుడు చెప్పి.. ఆ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టడం బాగోదు. నేను గర్ల్స్ స్కూల్‌లో చదువుకున్నాను.. మా స్కూల్‌కి అరకిలోమీటర్ దూరంలో బాయ్స్ స్కూల్ ఉంది. మా స్కూల్‌లో ఉన్న అమ్మాయిలకు ఆ స్కూల్‌కి చెందిన బాయ్‌ఫ్రెండ్స్ ఉండేవారు. నాకూ ఉండాలి కదా! నేను 8వ తరగతి ఉన్నప్పుడు నాకు +1 చదువుకునే బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. దీంతో నేను కిటికీ పక్కన కూర్చుంటే.. అతడు దూరంగా నిలబడి ఒకరినొకరం చూసుకునేవాళ్లం. స్పెషల్ క్లాస్ పేరుతో స్కూల్ బస్సులో వెళ్లకుండా బస్టాండ్‌లో మాట్లాడుకునేవాళ్లం.
పూర్ణ అద్భుతమైన డాన్సర్. తెలుగు బాగా మాట్లాడతారు.. మంచి నటి. కానీ, రావాల్సినంత గుర్తింపు ఎందుకు రాలేదు?
పూర్ణ: బహుశా.. నేను సినిమాలపై అంతగా దృష్టి పెట్టలేదేమో. నాకు డాన్స్ అంటే పిచ్చి. స్టేజ్‌పై డాన్స్ వేస్తున్నా అంటే నా వేషధారణపై ఐదు రోజుల ముందు నుంచే దృష్టి పెడతా. డాన్స్‌పై చూపినంత అంకితభావం.. సినిమాలపై చూపించలేదు. ఆ పాత్ర కావాలి.. ఈ సినిమా చేయాలి.. టాప్‌లో ఉండాలని అనుకోలేదు. చేసే పాత్ర నాకు సౌకర్యంగా ఉంటే చాలు. కాస్త ఇబ్బంది పడ్డా సినిమా మొత్తం మూడ్‌ఆఫ్‌లోనే ఉంటా. చిత్రబృందాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అందుకే, చాలా సినిమాలను నిరాకరించాను. నాకు నచ్చిన సినిమాలు చేస్తూ సంతోషంగా ఉన్నా.
తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు?
పూర్ణ: మా తండ్రి వ్యాపారవేత్త. రొయ్యలు ఎగుమతి చేస్తుంటారు. అమ్మ గృహిణి. నేను ఇక్కడ కూర్చోవడానికి మా అమ్మే కారణం. మూడున్నరేళ్ల వయసులో నేను చేసిన తొలి ప్రదర్శన నుంచి ఇప్పటివరకు నా వెంటే ఉన్నారు. అదే పెద్ద ఉద్యోగం. పెద్ద అక్క దుబాయ్‌లో, రెండో అక్క ముంబయిలో ఉన్నారు. అన్న సౌదీలో, చెల్లి కొచ్చిలో ఉన్నారు.