మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానమో హీరో శ్రీకాంత్ వెల్లడించారు. ఆయనను ఏదైనా అంటే కొట్టేసేవాడినని చెప్పారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోకు గతంలో వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పారు. వీటితోపాటు పలు ఆసక్తికర సంగతుల్ని పంచుకున్నారు.
చదువుతున్నప్పుడే చిరంజీవి సినిమాలు అంటే పిచ్చి ఉండేదని, ఆయనను చూస్తూనే ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన వచ్చిందని శ్రీకాంత్ అన్నారు. అలానే ఆమె సినిమా చేస్తున్న సమయంలో తన భార్య ఉహా(అసలు పేరు ఉమా మహేశ్వరి) పరిచయమైందని, అలా కొన్నేళ్లపాటు సాగిన తమ ప్రయాణం పెళ్లి వరకు చేరిందని శ్రీకాంత్ చెప్పారు.
'ఏవండోయ్ శ్రీవారు' సినిమా విషయంలో నిర్మాత చేతులెత్తేసరికి, తానే స్వయంగా డబ్బు పెట్టి చిత్రాన్ని పూర్తిచేసి విడుదల చేసిన విషయాన్ని శ్రీకాంత్ వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్లో తన తలపై కూజా పడి అపస్మారమ స్థితిలోకి వెళ్లిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.
తన కెరీర్ను మలుపు తిప్పిన 'పెళ్లిసందడి' సినిమాకు అసలు కొరియోగ్రాఫర్ లేరని శ్రీకాంత్ చెప్పారు. దర్శకుడు రాఘవేంద్రరావు తనకు చేతులతో సన్నివేశాన్ని చెబితే సొంతంగా డ్యాన్స్ వేసేశానని అన్నారు. అలానే 'ఖడ్గం' చిత్ర నిర్మాత తనను వద్దన్నప్పటికీ, డైరెక్టర్ కృష్ణవంశీ బలంగా నిలబడి ఆయనను ఒప్పించినట్లు పేర్కొన్నారు. 'ఆపరేషన్ దుర్యోధన' షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు తనను ఎవరూ గుర్తుపట్టలేదని, దాంతో చెలరేగిపోయి నటించానని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి: