తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పొంగల్ పోరు.. బన్నీ జోరుగా.. మహేశ్​ మెల్లగా.. - mahesh babu

మహేశ్​​ బాబు, అల్లు అర్జున్ వచ్చే సంక్రాంతి బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిద్దరి సినిమాలు ఒకేరోజు విడుదలవుతున్నాయి. రెండింటిపైనా భారీ అంచనాలున్నాయి. కానీ ప్రమోషన్లలో మాత్రం బన్నీ హవా కొనసాగుతుండగా.. మహేశ్ వెనకంజలో ఉన్నాడు.

బన్నీ

By

Published : Nov 15, 2019, 5:20 AM IST

మహేష్‌బాబు - అల్లు అర్జున్‌ సంక్రాంతి బరిలో పందెం కోళ్లలా పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. మహేశ్​ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' చిత్రాలతో జనవరి 12న థియేటర్లలోకి రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ఈ రెండూ మరో యాభై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ప్రచార పర్వంలో బన్నీతో పోల్చితే మహేశ్​ చాలా వెనకంజలో ఉన్నాడు.

నిజానికి 'అల.. వైకుంఠపురములో'తో పోల్చితే 'సరిలేరు నీకెవ్వరు'నే తొలి ప్రచార చిత్రాన్ని ముందుగా ప్రేక్షకులకు చూపించింది. సెట్స్‌పైకి వెళ్లిన రోజే విడుదల ముహూర్తాన్నీ ప్రకటించింది. అంతేకాదు చిత్ర టైటిల్‌ గీతాన్ని ముందుగా వినిపించింది కూడా మహేశ్​ బృందమే. ఇక ఆ తర్వాత చిన్న చిన్న పోస్టర్లు మినహా చిత్ర బృందం పెద్దగా ప్రచార హడావుడి ఏమీ చేయలేదు. 'సరిలేరు..'తో పోల్చితే ఆలస్యంగానే ప్రచార పర్వాన్ని షురూ చేసిన 'వైకుంఠపురం' బృందం మాత్రం ఇప్పుడు జోరు మీద సాగిపోతుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'సామజవరగమన', 'రాములో రాములా' గీతాలతో సినీప్రియుల దృష్టిని ఆకర్షించిన బన్నీ బృందం.. తాజాగా మూడో గీతాన్ని కూడా విడుదల చేసేసింది. ఇప్పటికే బయటకొచ్చిన ఈ పాటలకు నెట్టింట మంచి ఆదరణ లభిస్తుండగా.. మహేశ్​ విడుదల చేసిన టైటిల్‌ గీతానికి అంతగా ఆదరణ దక్కలేదు. అయితే 'సరిలేరు..' బృందం మాత్రం అన్నీ పక్కాగా సిద్ధం చేసుకున్నాకే ప్రచార బరిలోకి దిగాలని ఆలోచన చేస్తోందట. కానీ, మహేశ్​ అభిమానులు మాత్రం అనిల్‌ రావిపూడిపై కాస్త గుర్రుగానే ఉన్నారట. ఓవైపు మెగా అభిమానులంతా వరుస ట్రీట్లతో సందడి చేస్తుంటే.. అనిల్‌ మాత్రం చిన్న సర్‌ప్రైజ్‌ను కూడా రుచి చూపించలేకపోతున్నాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి.. పిల్లలుంటే ఇలా చేయండని చెబుతోన్న నాని

ABOUT THE AUTHOR

...view details