తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమీక్ష: యుద్ధం-కష్టం, అబద్ధం-నిజం.. ఓ వైకుంఠపురం - trivikram, allu arjun

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అల వైకుంఠపురములో'. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

Ala vaikuntapuramulo
అల్లు

By

Published : Jan 12, 2020, 2:50 PM IST

Updated : Jan 12, 2020, 5:20 PM IST

ఏ సినిమా విజయానికైనా సగం బలం పాటలే. అలాంటి బలాన్ని 'సామజవరగమన' రూపంలో కూడగట్టుకుని ప్రేక్షకుల ముందుకొచ్చిన మాటల మాంత్రికుడి చిత్రం "అల వైకుంఠపురములో". జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్​తో మూడో చిత్రంగా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాలో ఏముంది. ఏడాది గ్యాప్ ఇచ్చిన బన్నీ... తెరపై దాన్ని ఎలా పూరించాడు, వైకుంఠపురం ఇంటికి, అల్లు అర్జున్​కు ఉన్న సంబంధం ఏంటో ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

ఇదీ కథ

రామచంద్ర(జయరాం), వాల్మీకి(మురళీశర్మ) ఏఆర్​కే కంపెనీలో ఒకేసారి ఉద్యోగులుగా చేరతారు. కానీ రామచంద్ర ఆ కంపెనీ యజమాని కూతురుని పెళ్లి చేసుకుని పెద్దవాడవుతాడు. వాల్మీకి మాత్రం ఆ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా ఉంటాడు. ఇద్దరికీ ఒకే ఆస్పత్రిలో మగబిడ్డలు పుడతారు. అయితే రామచంద్ర బిడ్డ పురిటిలోనే చనిపోయాడని భావించి వాల్మీకి తన బిడ్డను యజమానికి ఇచ్చేస్తాడు. నర్సు సాయంతో బిడ్డను మార్చేస్తారు. చనిపోయాడకున్న బిడ్డ బతుకుతాడు. అయితే తనలా పేదరికంలో తన కొడుకు బతకకూడదని యజమాని కొడుకును తీసుకెళ్లి బంటు(అల్లు అర్జున్) అని పేరు పెట్టి పెంచుతాడు. వాల్మీకి కొడుకు రామచంద్రం ఇంట్లో రాజు(సుశాంత్) పేరుతో పెరుగుతాడు. 20 ఏళ్లు గడుస్తాయి. బంటు సాధారణ యువకుడిలా పెరిగితే.. రాజు రాజభోగాల మధ్య పెరుగుతాడు. ఈ క్రమంలో బంటుకు నర్సు ద్వారా అసలు నిజం తెలుస్తుంది. నిజం తెలుసుకున్న బంటు.. తన తల్లిదండ్రులను ఎలా కలుసుకున్నాడు? పెంపుడు తండ్రి వాల్మీకిని ఏం చేశాడు?. మధ్యలో అమూల్య(పూజా హెగ్డే) ఎలా పరిచయమైంది? అప్పలనాయుడు(సముద్రఖని)తో బంటు ఎందుకు గొడవపడ్డాడు? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే

ఇదొక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్​టైనర్. కథ పరంగా రాజు -పేద, ఇంటిగుట్టు లాంటి చిత్రాలను గుర్తుచేసినా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాయచేసి తనదైన కథను తెరపై రక్తికట్టించాడు. ధనవంతుడి పిల్లవాడు పేదవాడి ఇంటికి, పేదవాడి పిల్లాడు ధనవంతుడి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందన్న నేపథ్యాన్ని తీసుకుని "స్థానం మారినా.. స్థాయి మారదు" అనే విషయాన్ని సినిమాగా మలిచాడు. అత్యాశతో బిడ్డలను మార్చవచ్చు కానీ వాళ్ల తలరాతను మార్చడం కష్టమనే విషయాన్ని సవివరంగా చూపించాడు.

ఫస్టాప్

ఆస్పత్రిలో బిడ్డలను మార్చడం వల్ల మొదలయ్యే అల వైకుంఠపురములో... వాల్మీకి ఇంట్లో బంటు పెరిగి పెద్దవాడవుతాడు. రామచంద్రంపై అసూయతో వాల్మీకి బంటును చాలా ధీనంగా పెంచుతాడు. అరకొర వసతుల మధ్య చదువు పూర్తి చేసిన బంటు.. అమూల్య టూరిస్ట్ కంపెనీలో గైడ్​గా ఉద్యోగం చేస్తుంటాడు. టూరిస్ట్ కంపెనీ అభివృద్ధి కోసం బ్యాంక్​ లోను కోసం ప్రయత్నిస్తుండగా అమూల్య, బంటులను చూస్తాడు రామచంద్రం. రామచంద్రం కంపెనీలో వాటాలు కావాలని అప్పలనాయుడు కొడుకు పైడితల్లి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నానికి నో చెప్పమని రామచంద్రం తన కొడుకు రాజ్​ను పంపిస్తాడు. కానీ పైడితల్లికి నో చెప్పే ధైర్యం రాజ్​కు ఉండదు. తన చేయి విరిగినంత పనైపోతుందని భావించిన రామచంద్రం.. తన తండ్రి సలహా మేరకు అమూల్యను రాజ్​కు ఇచ్చి నిశ్చితార్థం చేసుకుంటాడు. కానీ అమూల్య, బంటులు అప్పటికే ప్రేమలో ఉంటారు. ఈ నిజాన్ని రామచంద్రానికి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చెద్దామని వచ్చేటప్పటికి అప్పలనాయుడు రామచంద్రంపై హత్యాయత్నం చేస్తాడు. గమనించిన బంటు, అమూల్య రామచంద్రాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తారు. అక్కడ రామచంద్రం, బంటు, వాల్మీకిలను చూసిన నర్సు.. అసలు నిజాన్ని బంటుకు చెప్పడం వల్ల ఫస్టాప్​ను ముగించాడు దర్శకుడు త్రివిక్రమ్. అయితే ఫస్టాప్​లో మురళీశర్మ, అల్లు అర్జున్​ల మధ్య మధ్యతరగతి తండ్రీ కొడుకులుగా కావల్సినంత వినోదాన్ని, ఎమోషన్స్​ను పండించారు. అలాగే పూజా హెగ్డేతో బన్నీ సామజవరగమన రొమాన్స్ ఆకట్టుకుంటుంది. ఓ మై డాడీ, సామజవరగమన, బుట్టబొమ్మ పాటలు ఫస్టాఫ్​లో కథను స్మూత్​గా తీసుకెళ్లగా.. చెల్లెలు చున్నీ కోసం బన్నీ చేసే ఫైట్ కొత్తగా అనిపిస్తుంది.

సెకండాఫ్

నర్సు నుంచి అసలు నిజాన్ని తెలుసుకున్న బంటు.. వాల్మీకికి క్లాస్ తీసుకుంటాడు. అబద్దాలు చెప్పి స్వేచ్ఛ లేకుండా పెంచిన తండ్రి తీరుపై అసహ్యం పెంచుకుంటాడు. స్వేచ్ఛగా బతకాలనుకుంటాడు. పాతికేళ్లుగా వైకుంఠపురం ఇంటికి దూరంగా పెరిగిన బంటి.. ఆ ఇంట్లోకి అడుగుపెడతాడు. జయరాం కుమారుడనే విషయాన్ని తెలియకుండా ఆ కుటుంబానికి ఎదురైన సమస్యలను పరిష్కరిస్తుంటాడు. తల్లిదండ్రుల మధ్య మాటలు లేవని గ్రహించి వారిద్దరిని మళ్లీ ఒక్కటి చేస్తాడు. కంపెనీలో వాటాల కోసం కుట్ర పన్నుతున్న అప్పలనాయుడు, అతని కుమారుడు పైడితల్లిని చితక్కొడుతాడు. బంటు ఎవరి కొడుకో తెలుసుకున్న రామచంద్రం తండ్రి సచిన్ ఖేడ్కర్.. ఆ విషయాన్ని రామచంద్రానికి వివరిస్తాడు. వాల్మీకి చేసిన తప్పుపై నిప్పులు చెరుగుతాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పేందుకు వెళ్తుండటగా బంటు అడ్డుపడతాడు. ఓ తండ్రి చేసిన పొరపాటు పాతికేళ్లు ఓ తల్లికి తన కొడుకునూ దూరం చేస్తే మళ్లీ పాతికేళ్ల తర్వాత అదే పొరపాటు మరో తండ్రి చేయకూడదని, ఈ గుట్టు ఇంటివరకే ఉండాలని కోరుతాడు. బంటు కోరిక మేరకు తల్లి(టబు) వద్ద ఈ విషయాన్ని దాచిపెట్టిన రామచంద్రం, అతని తండ్రి.. రాజ్​ను కూడా కింది నుంచి పైకి రావాలని వాల్మీకి దగ్గరకు పంపించడంతో వైకుంఠపురము కథను కంచికి చేర్చాడు త్రివిక్రమ్. సెకండాఫ్ లో బన్నీ పడే వేదనతోపాటు తల్లిదండ్రుల మధ్య ప్రేమను సెల్యులాయిడ్​పై తన మాటలతో చక్కగా చూపించాడు. రాములో రాములో పాటతోపాటు అల వైకుంఠపురం టైటిల్ సాంగ్, అలాగే క్లైమాక్స్ లో వచ్చే పైట్ సాంగ్ వైకుంఠపురానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే బోర్డు మీటింగ్​లో బన్నీ చేసే సందడి సెకండాఫ్​లో నవ్వులు పూయిస్తుంది.

ఎవరెలా చేశారంటే

సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని చేశాడు అల్లు అర్జున్. తొలిసారి ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేసి తన స్టైల్​లో కనిపిస్తూనే పంచ్​లు కామెడీ సన్నివేశాలతో అదరగొట్టాడు. త్రివిక్రమ్ డైలాగులు కూడా తోడవడటం వల్ల బన్నీ కనిపించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుంది. మధ్య తరగతి యువకుడిగా, వైకుంఠపురమంలోకి వెళ్లన తర్వాత... రెండు స్టైల్​లో కనిపించి బన్నీలోని కొత్త కోణాన్ని ఫ్యాన్స్​కు చూపించాడు. డ్యాన్స్​ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామజవరగమన, రాములో రాములో పాటలతోపాటు క్లైమాక్స్​లో వచ్చే ఫైట్​లోనూ అల్లు అర్జున్ సత్తా ఏంటో తెలిసిపోతుంది. ఇక డీజే తర్వాత బన్నీతో మరోసారి జతకట్టిన పూజా హెగ్డే.. తెరపై తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మరో కథానాయిక నివేదా పేతురాజు పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. సుశాంత్ పాత్ర కీలకమే అయినా పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే టబు, జయరాం, సచిన్ ఖేడ్కర్ , రాజేంద్రప్రసాద్ పాత్రలు పరిధి మేర ఫర్వాలేదనిపిస్తాయి. ఇక మురళీశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆద్యంతం తన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. విలన్​గా నటించిన సముద్రఖని కూడా ముక్కు అదిరిస్తున్న మేనరిజంతో కొత్త విలన్​గా కనిపించాడు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అరవింద సమేత తర్వాత తనదైన స్టైల్​లో కథను అల్లుకున్న త్రివిక్రమ్... మాటలతో తన పాత్రలకు ప్రాణం పోశాడు. చిన్న కథే అయినా బలమైన కథగా మలిచాడు. పాత కథే అయినా కొత్తదనాన్ని అద్దాడు. కామెడీ, పంచ్ డైలాగుల్లో తనదైన మార్క్ చూపించాడు. ఎప్పుడు పిల్లలు బాగుండాలని అమ్మానాన్న అనుకోవాలా... అమ్మానాన్న కూడా బాగుండాలని పిల్లలు అనుకోరా! లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. పాటల పరంగా తమన్ ఏంటో ఇప్పటికే రుజువైంది. తెరపై పాటలన్నీ అంతే అందంగా కనిపించాయి. నేపథ్య సంగీతం అదరగొట్టాడు. సాంకేతికంగా, నిర్మాణ పరంగా ఉన్నతంగా సినిమా కనిపిస్తుంది.

బలం

అల్లు అర్జున్, హాస్యం, పాటలు, యాక్షన్ సన్నివేశాలు

బలహీనతలు

ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

చివరగా:పక్కా ఫ్యామిలీ సినిమా

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ఇవీ చూడండి.. అదిరిపోయే లుక్‌తో మాస్‌ మహారాజా

Last Updated : Jan 12, 2020, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details