ఒకప్పుడు అగ్ర కథానాయకులు ఏడాదికి ఆరేడు సినిమాలు పట్టాలెక్కించే వారని చెప్తే.. అమ్మో అనుకునే వాళ్లం. సూపర్‌స్టార్ కృష్ణ అయితే ఒక సంవత్సరంలో ఏకంగా పదికి పైగా చిత్రాలు సెట్స్‌పైకి తీసుకెళ్లిన రికార్డునూ ఖాతాలో వేసుకున్నారు. మరి ప్రస్తుతానికొస్తే ఈస్థాయిలో చిత్రాలను పట్టాలెక్కిస్తున్న వారు కనిపించే పరిస్థితులు లేవు. ఏడాదికి ఓ మూడు చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు తీసుకొస్తే గొప్పగా చూసే పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రయత్నాన్ని కూడా యువ హీరోలు చేస్తేనే తప్ప.. స్టార్ హీరోల నుంచి ఒక చిత్రమొస్తేనే అద్భుతం అనుకునే స్థితి ఉంది. కానీ, నేటి తరం మొత్తానికీ తన స్పీడుతో సమాధానం చెప్తున్నాడు ఓ బాలీవుడ్ సీనియర్ హీరో. ఏడాదికి నాలుగు చిత్రాలను థియేటర్లలోకి తీసుకొస్తూ.. మరోవైపు కొత్తగా మరో నాలుగైదు చిత్రాలను పట్టాలెక్కిస్తూ నవతరానికీ సవాల్ విసురుతున్నాడు. అతడే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. ఈ ఏడాది ఇప్పటికే 'కేసరి', 'మిషన్ మంగళ్', 'హౌస్‌ఫుల్ 4' చిత్రాలతో సందడి చేసిన అక్కీ.. ఇప్పుడు క్రిస్మస్ కానుకతోనూ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. తన తాజా చిత్రం 'గుడ్‌న్యూస్'ను డిసెంబరు 27న థియేటర్లోకి తీసుకురాబోతున్నాడు. అయితే ఈ జోరు ఈ ఏడాదికి మాత్రమే పరిమితమైంది కాదు.. వచ్చే సంవత్సరంలోనూ ఇదే రీతిలో కొనసాగబోతుంది.
ప్రస్తుతం సినిమాల విషయంలో అక్షయ్ చూపిస్తున్న జోరు చూసి సినీప్రియులంతా అతడినొక మూవీ మిషన్‌గా అభివర్ణిస్తున్నారు. ఇదేదో అతిశయోక్తితో చెప్తున్న మాట కాదు. వచ్చే ఏడాది అక్కీ నుంచి రాబోతున్న చిత్రాల జాబితాను పరిశీలిస్తే ప్రతిఒక్కరూ ఇదే మాట చెప్తారు. అక్షయ్ వచ్చే ఏడాది ప్రతి పెద్ద పండగనూ తన చిత్రాల కోసం ఇప్పటికే బుక్ చేసేసుకున్నాడు. వీటిలో ముందుగా వచ్చేది మాత్రం 'సూర్యవంశీ'. పోలీస్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు రోహిత్ శెట్టి నుంచి రాబోతున్న మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులోనూ అక్షయ్‌ను పోలీస్ అధికారిగానే చూపించబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది సరిగ్గా ఉగాది, శ్రీరామనవమిల పండగ సీజన్.
ఈద్‌కు బాంబ్లా పేలతాడట..
ఇలా ఉగాది సంబరాలు ముగుస్తాయో లేదో.. ఆ తర్వాత వచ్చే ఈద్ సీజన్‌పైనా అక్షయ్ ఇప్పటికే గురిపెట్టేశాడు. ఇది బాలీవుడ్‌కు మంచి సెంటిమెంట్ సీజన్. సాధారణంగా ఈద్ అనగానే సల్మాన్ ఖానే గుర్తొస్తాడు. ఎందుకంటే ప్రతి రంజాన్‌కూ ఓ కొత్త చిత్రంతో థియేటర్లలోకి వస్తాడు భాయ్‌జాన్. ఈసారి కూడా ఇందు కోసం 'రాధే'ను సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఓవైపు ఈద్‌కు సల్మాన్ బరిలో ఉన్నా అక్షయ్ కూడా సై అంటూ 'లక్ష్మీబాంబ్'లా బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాడు. దక్షిణాదిలో హిట్‌గా నిలిచిన 'కాంచన 3'కి రీమేక్‌గా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అక్షయ్‌కు జోడీగా కియారా అడ్వాణీ కనిపించబోతుంది. ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటికైతే క్లారిటీ రాలేదు కానీ, ఈద్‌కు రావడం పక్కా.
దీపావళికి చరిత్రాత్మక గాథతో..