లాక్డౌన్ కారణంగా ఏడాదికిపైగా థియేటర్లు మూతబడ్డాయి. ఆ తర్వాత 'జాతిరత్నాలు' చిత్రంతో థియేటర్లకు పాతరోజులు వచ్చినట్లు కనిపించినా.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినిమాహాళ్లు మరోసారి మూతబడ్డాయి.
అయితే.. ఇటీవల విడుదలైన 'లవ్‌స్టోరి' చిత్రం విజయవంతం కావటం వల్ల ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దసరాకు కొన్నిరోజుల ముందునుంచి స్టార్ల చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'మహాసముద్రం', 'వరుడుకావలెను' రెండు రోజుల వ్యవధిలో రానుండగా.. వీటికంటే ముందు సాయిధరమ్ తేజ్ 'రిపబ్లిక్' అక్టోబరు1న, వైష్ణవ్ తేజ్ 'కొండపొలం' అక్టోబరు 8న విడుదల కానున్నాయి.
పండగరోజే..
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(Most Eligible Bachelor Release Date) చిత్రం.. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అక్టోబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కానీ దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబరు 15న విడుదల చేయనున్నట్లు కొత్తగా ప్రకటించారు.