స్టార్ హీరోలను అభిమానులు బాగా ఫాలో అవుతారు. ఈ రహాస్యం తెలుసుకున్న పలు సంస్థలు తమ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్లో సెలబ్రెటీలను ఉపయోగించుకుంటాయి. అయితే ఆ వస్తువుల వాడకం వల్ల కలిగే అనర్థాలను పట్టించుకోకుండా డబ్బుల కోసం ప్రచారానికి ఒప్పుకుంటారని చాలా మంది ప్రముఖులపై గతంలో బోలెడన్ని విమర్శలు వచ్చాయి. తాజాగా ఇవే చిక్కులు అజయ్ దేవగణ్‌కు ఎదురవుతున్నాయి. ఈ స్టార్ హీరో నటించిన ఓ పాన్ మసాలా యాడ్ చూసి... అనుకరించిన అభిమాని ప్రస్తుతం నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
పాన్ మసాలా ప్రకటనలో అజయ్ ఏమైంది..?
అజయ్ గతంలో పలు పొగాకు ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించేవారు. రాజస్థాన్‌కు చెందిన నానక్‌రామ్ అనే 40 ఏళ్ల అభిమాని.. అజయ్ ప్రచారకర్తగా వ్యవహరించే టొబాకో ఉత్పత్తులనే వాడారట. దీంతో కొంతకాలానికి అతనికి క్యాన్సర్ వచ్చిందని... అందుకే ఇలాంటి హానికలిగించే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దని అజయ్‌ను వేడుకుంటున్నాడు నానక్‌రామ్.
'అజయ్ ఓ టొబాకో ప్రకటనలో నటించడం చూసి మా నాన్న అదే ఉత్పత్తిని వాడారు. ఎందుకంటే ఆయనకు నా తండ్రి వీరాభిమాని. కానీ ఆ ప్రొడక్ట్స్ వాడటం వల్ల నా తండ్రికి క్యాన్సర్ వచ్చింది. అందుకే అజయ్ లాంటి సెలబ్రెటీలు ఇటువంటి ప్రకటనలు మానేయాలని కరపత్రాలను పంచిపెడుతున్నాను'.
-- దినేశ్, నానక్‌రామ్ కొడుకు
జైపూర్‌లోని సంగనేర్ పట్టణంలో పాల వ్యాపారి నానక్‌రామ్. ఇతడికి ఇద్దరు పిల్లలు. నానక్ వ్యాధి బారిన పడటం వల్ల కొడుకుపైనే కుటుంబ బాధ్యత పడింది. అందుకే ఇటువంటి బాధ ఎవరూ పడకూడదని తండ్రి మాటల్లో కరపత్రాలు రాసి పంపిణీ చేస్తున్నాడు అతని కొడుకు దినేశ్.
ఇతడికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. నెట్టింట ఈ విషయం వైరల్‌గా మారింది. దీనిపై హీరో అజయ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
అజయ్ దేవగణ్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన 'దే దే ప్యార్ దే' చిత్రం ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.