"ముద్దు సన్నివేశాలు ఉన్నంత మాత్రాన ఏ చిత్రమూ చెడ్డది కాదు.. లేకపోతే మంచిదని చెప్పలేం. ఏదైనా కథకు అవసరమై.. కథలో భాగంగా ఉంటే ఎవరూ దాన్ని వ్యతిరేకించరు" అంటోంది ఐశ్వర్య రాజేష్. గతేడాది 'కౌసల్య కృష్ణమూర్తి', 'మిస్ మ్యాచ్' చిత్రాలతో అలరించిన ఈ భామ.. ఇప్పుడు 'వరల్డ్ ఫేమస్ లవర్'తో సందడి చేసేందుకు సిద్ధమైంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. క్రాంతిమాధవ్ దర్శకుడు. కె.ఎ.వల్లభ నిర్మించాడు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పలు విషయాలు పంచుకుంది ఐశ్వర్య.
>> తెలుగమ్మాయి మీరు. తమిళ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకొని తెలుగులోకి అడుగుపెట్టారు. ఎలా అనిపిస్తుంది ఈ ప్రయాణం?
- చాలా సంతోషంగా ఉంది. ఇదంతా అనుకొని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నిజానికి నేను పుట్టి, పెరిగిందంతా చెన్నైలో కావడం వల్లే నటిగా నా ప్రయాణం అక్కడ నుంచి మొదలైంది. తర్వాత అక్కడే బిజీ అయిపోయా. నేను నటిగా మారాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు ఓ మంచి చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టమన్నారు. అయితే టాలీవుడ్లో ఎవరిని సంప్రదించాలి అన్నది తెలియదు. అంతేకాకుండా ఇక్కడ గ్లామర్ కథానాయికలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ తరహా పాత్రకైనా సిద్ధంగా ఉండాలి. కానీ, నేనలా చెయ్యలేను. నాకంటూ కొన్ని పరిమితులున్నాయి. ఈ పరిశ్రమకు నేను సరిపోతానో లేదో అన్న భయం ఉండేది. అందుకే మాతృభాషలోకి రావడానికి కాస్త సమయం పట్టింది. ఇకపై ఏడాదికి రెండు చిత్రాలైనా ఇక్కడ చెయ్యాలనుకుంటున్నా. నేను తెలుగమ్మాయినే అని ఇక్కడి ప్రేక్షకులకు తెలియాలి.
>> 'వరల్డ్ ఫేమస్ లవర్' అవకాశమెలా వచ్చింది?
- నిజానికి నేను తెలుగులో సంతకం చేసిన తొలి చిత్రమిదే. 'కనా'లో నా నటన చూసి క్రాంతిమాధవ్ నన్ను సంప్రదించారు. రెండేళ్ల క్రితం ఓ అవార్డుల కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఈ కథ చెప్పారు. నా పాత్ర విన్నప్పుడే చాలా నచ్చేసింది. దీని కన్నా ముందు విజయ్ దేవరకొండతో సినిమా నన్ను మరింత ఆకర్షించింది. ఎందుకంటే ఆయన చిత్రాలు 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' అన్నింట్లో కథానాయికలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే నేను ఈ అవకాశం వదులుకోకూడదు అనుకున్నా. ఈ సినిమా చిత్రీకరణ నా పాత్రతోనే మొదలైంది. ఆ సమయంలో కాస్త ఒత్తిడిగా అనిపించింది.
>> ఇంతకీ ఇందులో మీరు దేవరకొండ భార్యా? ప్రేయసా?
- అది సినిమా చూసి తెలుసుకోవాలి. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. గత పదేళ్ల కాలంలో ఇలాంటి పాత్రల్ని ఏ చిత్రంలో చూడలేదు. ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీలవుతారు. నేనిందులో సువర్ణగా.. దేవరకొండ సీనయ్యగా కనిపిస్తాడు. తన పాత్రలో ఇంకా చాలా కోణాలుంటాయి. విజయ్‌ని ఇంత వరకు ఎవరు అలా చూసుండరు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.
>> విజయ్ చిత్రాలనగానే కథానాయికలతో ముద్దు సన్నివేశాలుంటాయి కదా. అలాంటివేమైనా ఉన్నాయా?
- ఇందులో ముద్దు సీన్లు ఉన్నాయా? లేదా? అన్నది నేను చెప్పను. కానీ, సినిమాకు కథకు అవసరమైనవన్నీ ఉన్నాయి. అవేంటన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అయినా కథ డిమాండ్ చేసినప్పుడు లిప్‌లాక్‌లో తప్పేంలేదు.
>> సినిమాలో చాలా మంది కథానాయికలున్నారు. మీ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది?
- నా పాత్ర నిడివి ఇంత అని కచ్చితంగా చెప్పలేను. కానీ సినిమాలోని అన్ని పాత్రలకు సమాన ప్రాధాన్యముంది. నా పాత్రలో బలమైన భావోద్వేగాలుంటాయి. నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. పోస్టర్లలో చూసి నేను డీగ్లామర్ పాత్ర చేస్తున్నా అనుకోవచ్చు. కానీ గ్లామర్ కోణమూ ఉంటుంది. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నా. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు.