అందం అనే మాటకే సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రపంచ సుందరి. ర్యాంపుపై నడకతో, తన నీలికళ్లతో, సినిమాల్లో నటనతో ఎందరో అభిమానులను ఆకట్టుకున్న వయ్యారి భామ. తనదైన అభినయంతో కోట్లాది మంది కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టేసింది. ఆ అందాల రాశి ఐశ్వర్యరాయ్ బచ్చన్.. సోమవారం(నవంబరు 1), 47వ వసంతంలోకి అడుగుపెట్టింది.
కన్నడ సుందరి...
కర్నాటకలోని మంగుళూరులో 1973 నవంబర్ 1న పుట్టింది ఐశ్వర్యరాయ్. తులు మాట్లాడే కుటుంబంలో కృష్ణరాజ్‌రాయ్, బృందారాయ్కు జన్మించింది. ఈమెకు సోదరుడు ఆదిత్యరాయ్ ఉన్నారు. ఆయన మర్చెంట్ నేవీలో ఇంజినీర్. చిన్నతనం నుంచి ముంబయిలోనే పెరిగిన ఈమె... చదువుతూనే సంగీతం, సంప్రదాయ నృత్యాన్ని ఐదేళ్ల పాటు అభ్యసించింది.
మోడల్ అవ్వాలని అనుకోలేదు...
చదువులో టాపర్ అయిన ఐశ్వర్య... మాతుంగలోని ఆర్య విద్యామందిర్, జైహింద్ కాలేజ్, డి.జి.రూపరెల్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేసింది. మొదట డాక్టర్ కావాలనుకొంది. మధ్యలో లక్ష్యం మార్చుకుని ఆర్కిటెక్చర్ కావాలని నిర్ణయించుకొంది. ఆ రంగంలో కొన్నాళ్లపాటు పార్ట్‌టైమ్ జాబ్ చేసింది. కానీ ఆమె అందం మోడలింగ్ రంగంలోకి ప్రవేశించేలా చేసింది. 1991లో ఓ సంస్థ నిర్వహించిన సూపర్‌మోడల్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వతా పలు సంస్థలకు మోడల్‌గా వ్యవహరించింది.
తొలిసారే ఆమిర్‌తో...
1993లో ఆమిర్‌ఖాన్‌తో కలిసి ఓ ప్రకటనలో నటించింది ఐష్. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో ఆమె పేరు మార్మోగిపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు, కథానాయకులు ఐష్‌ను తమ సినిమాల్లో హీరోయిన్గా ఎంచుకోవాలని ప్రయత్నించారు. కానీ ఆమె మాత్రం తనకు ఇష్టమైన ఆర్కిటెక్టింగ్ రంగంలోకి వెళ్లాలని సినిమా అవకాశాల్ని తిరస్కరించిందట.
మిస్ ఇండియా నుంచి మిస్ వరల్డ్...
1994లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఐశ్వర్య... అందులో రన్నరప్‌గా నిలిచింది. బాలీవుడ్ నటి సుస్మితాసేన్ విజేతగా నిలిచింది. తర్వాత ఏడాది (1995)లో దక్షిణాఫ్రికాలో జరిగిన విశ్వ సుందరి పోటీల్లో పాల్గొంది. అందులో కిరీటం దక్కించుకొంది.
మిస్ వరల్డ్ కిరీటంతో ఐశ్వర్యరాయ్ వెండితెరపై అరంగేట్రం...
మణిరత్నం తమిళంలో తీసిన 'ఇరువర్'తో తెరంగేట్రం చేసింది. ఆ చిత్రం తెలుగులో 'ఇద్దరు'గా విడుదలైంది. అందులో ఐశ్వర్యారాయ్ పుష్పవల్లి, కల్పన పేర్లతో ద్విపాత్రాభినయం చేసింది. అదే ఏడాది 'ఔర్‌ప్యార్ హో గయా' చిత్రంతో హిందీ తెరకు పరిచయమైంది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. 1998లో శంకర్ తీసిన 'జీన్స్'లో అవకాశాన్ని అందుకుని... మధుమిత పాత్రలో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది.
అంతర్జాతీయ గుర్తింపు...
హిందీలో 'హమ్ దిల్ దే చుకే సనమ్' తర్వాత ఐష్‌కు అభిమానులు భారీగా పెరిగారు. ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత 'తాల్','హమ్ కిసీ సే కమ్ నహీ' లాంటి సినిమాల్లో నటించి అలరించింది. ఆమెకు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు రావడానికి 'దేవదాస్' ఓ కారణం. అందులో పారూ పాత్రలో మైమరపించింది. కేన్స్ చలన చిత్రోత్సవంలో ఆ సినిమా ప్రదర్శితమైంది. ఆ తర్వాత ఐశ్వర్యారాయ్‌కు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో అవకాశాలు కూడా లభించాయి. హాలీవుడ్‌లో 'బ్రైడ్ అండ్ ప్రెజిడ్యూస్', 'మిసెస్ ఆఫ్ స్పైసెస్','ప్రొవోక్డ్, 'ది లాస్ట్ లెజియన్' చిత్రాల్లో నటించింది.
సల్మాన్‌తో డేటింగ్..
వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడుదొడుకులనూ ఎదుర్కొంది ఐష్. 1999లో సల్మాన్‌ఖాన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి డేటింగ్ చేశారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే వీరి బంధం ఎంతో కాలం సాగలేదు. 2001లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వివేక్ ఒబెరాయ్‌తో ఈమె ప్రేమలో పడినట్టు వార్తలొచ్చాయి.
సల్మాన్‌ఖాన్‌తో ఐశ్వర్య రాయ్ 'ధూమ్2' కలిపింది..
అభిషేక్ బచ్చన్‌తో కలిసి 'ధూమ్2'లో నటిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. 2007 జనవరి 14న ఐష్-అభిషేక్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు అమితాబ్ బచ్చన్ ధ్రువీకరించారు. అదే ఏడాది ఏప్రిల్ 16న అమితాబ్ బచ్చన్ సొంతిల్లు ప్రతీక్షలో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య అంగరంగ వైభవంగా అభిషేక్-ఐష్ వివాహం జరిగింది. 2011 నవంబరు 16న ఈమె ఓ పాపకు జన్మనిచ్చింది. నాలుగు నెలల తర్వాత ఆ చిన్నారికి 'ఆరాధ్య' అని పేరు పెట్టారు.
ఆసక్తికర విషయాలు...
- కేన్స్ చలన చిత్రోత్సవం అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన తొలి భారతీయ నటి ఐశ్వర్యారాయ్.
- తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే పెన్సిల్‌కు సంబంధించిన ఓ ప్రకటనలో ఐశ్వర్యారాయ్ నటించిందట.
- ఐశ్వర్యారాయ్ కథానాయిక కాక మునుపే ప్రముఖ కథానాయిక రేఖ గుర్తుపట్టి పలకరించిందట. ప్రకటనల్లో చాలా అందంగా కనిపిస్తున్నావని భుజం తట్టి ప్రోత్సహించిందట.
- దుబాయ్‌లో ఒక రోజంతా ట్రాఫిక్ జామ్ కావడానికి ఐశ్వర్యారాయ్ కారణమైందట. ఓ ప్రకటనలో నటించడానికని దుబాయ్ వెళ్లిందట. ఆ సమయంలో అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా రావడం వల్ల అక్కడ రోజంతా ట్రాఫిక్ జామ్ అయ్యిందట.
- పెళ్లయిన తర్వాత చాలా తక్కువ చిత్రాల్లో నటించింది. వాటిల్లో 'సర్బజిత్', 'ఏ దిల్ ముష్కిల్ హై', 'ఫన్నేఖాన్'. అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనల్లో మెరుస్తుంది.
- ఐశ్వర్యారాయ్ గర్భవతి అని తెలిసిన సమయంలో బాలీవుడ్‌లో ఓ వివాదం సాగింది. అప్పటికే ఆమె 'హీరోయిన్' అనే సినిమాలో నటించేందుకు సంతకం చేసింది. చిత్రం సెట్స్‌పైకి వెళ్లే సమయంలో ఐశ్వర్య ప్రాజెక్టు నుంచి బయటికొచ్చింది. ఆమె ఐదు నెలల గర్భవతినని చెప్పడం వల్ల నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భవతి అన్న విషయాన్ని ఐష్ దాచిపెట్టిందని, సినిమా ఆలస్యానికి కారణమైందని వాళ్లు ఆరోపించారు.
- మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఐశ్వర్యరాయ్ నటిస్తోంది.