ఒకే రోజు రెండు పెద్ద సినిమాల విడుదల సినీ పరిశ్రమకు మంచిది కాదు అనేది నిర్మాతల మాట. దీనికి అనుగుణంగానే ఒకవేళ ఏ ఇద్దరు అగ్ర కథానాయకులు బాక్సాఫీస్ బరిలో పోటీకి నిలిచినా ఒక చిత్రానికి మరో చిత్రానికి కనీసం రెండు మూడు రోజుల కాల వ్యవధి అయినా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో కొంత కాలం నుంచి ఇదే పద్ధతి కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆనవాయితీని కాస్త పక్కకు పెట్టినట్లే కనిపిస్తున్నారు అల్లు అర్జున్, మహేశ్ బాబు.
త్వరలో వీరిద్దరూ సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద పందెం కోళ్లలా పోటీ పడబోతున్నారు. బన్నీ 'అల వైకుంఠపురములో', మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు సంక్రాంతి కానుకగా జనవరి 12నే విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 12 చిత్ర సీమలో చర్చనీయాంశంగా మారింది.
రెండు సినిమాలపైనా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఒకటి త్రివిక్రమ్-బన్నీల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కాగా.. మరొకటి 'ఎఫ్ 2' వంటి హిట్ తర్వాత అనిల్ రావిపూడి నుంచి రాబోతున్న సినిమా. దీనికి తోడు మహేశ్ కూడా 'మహర్షి' వంటి హిట్‌తో జోరు మీద ఉన్నాడు. రోజురోజుకూ ఇటు 'సరిలేరు నీకెవ్వరు'పైనా, అటు 'అల వైకుంఠపురములో' పైన అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ ముందుకురావడం రెండు చిత్రాలకూ మంచిది కాదనే అంటున్నారు చిత్ర సీమ వర్గాలు.
సంక్రాంతి సెలవుల సీజనే అయినప్పటికీ ఇంతటి భారీ బడ్జెట్ చిత్రాలు ఒకేరోజు రావడం వల్ల లాభాలు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఈ రెండింటిలో ఏదో ఒకటి విడుదల తేదీ మార్చుకున్నట్లైతే ఈ లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇదే సంక్రాంతి బరిలో రజనీకాంత్ 'దర్బార్', వెంకటేశ్, నాగచైతన్యల 'వెంకీమామ', కల్యాణ్ రామ్ 'ఎంతమంచివాడవురా' సినిమాలూ పోటీ పడబోతున్నాయి. వాటి విడుదల తేదీలు ఇంకా తెలియనప్పటకీ రెండు మూడు రోజుల వ్యవధిలోనే అవి కూడా ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో వీటి ప్రభావమూ ఈ రెండు పెద్ద చిత్రాల వసూళ్లపై ఉండొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇటు స్టైలిష్ స్టార్ కానీ, అటు సూపర్ స్టార్ కానీ విడుదల తేదీలు ఏమైనా మార్చుకుంటే మేలనిపిస్తుందని అంటున్నారు సినీ పండితులు.
2017లోనూ..
2017లో ఇద్దరు అగ్ర కథానాయకులకు ఇదే పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు బాలయ్యబాబు వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో వస్తే , మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెం150'తో వచ్చాడు. ఇద్దరూ మొదట జనవరి12నే తమ సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలవ్వటం వల్ల నిర్మాతలకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో చిరు ఒక రోజు ముందుగా అంటే జనవరి 11నే వచ్చేశాడు. జనవరి 12న బాలయ్య రంగ ప్రవేశం చేశాడు. అప్పుడు ప్రొడ్రూసర్ల సంక్షేమం దృష్ట్యా ఈ ఇద్దరి సినిమాలు ఒకే రోజు రీలీజ్ చేయలేదు. ఇప్పుడు 2020 సంక్రాతికి మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి విడుదల తేదీలు మారే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సినీ పండితులు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు తగ్గుతారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
ఇవీ చూడండి.. 'ప్రేమ గుణపాఠం నేర్పితే.. విస్కీ నన్ను మార్చింది'