థియేటర్లు తెరుచుకోవడం.. కీలకమైన సంక్రాంతి, వేసవి సీజన్లు దగ్గర పడుతుండడం వల్ల సినీ బృందాలు వేగం పెంచాయి. చివరి దశకు చేరుకున్న తమ చిత్రాల్ని పూర్తి చేసుకోవడంపై దృష్టి పెడుతున్నారు దర్శకనిర్మాతలు. కథానాయకులు కూడా కరోనా విరామంలో బోలెడన్ని కథలు విని, కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేశారు. అవన్నీ పూర్తి చేయాలంటే ఇప్పుడు వేగం పెంచాల్సిందే. కొవిడ్ జాగ్రత్తల్ని పాటిస్తూ చిత్రీకరణల్లో పాల్గొనడంపైనా ఆ బృందాలు రాటుదేలాయి. దాంతో మునుపటిలా మళ్లీ చిత్రీకరణల జోరు కనిపిస్తోంది. ఇలా పరిశ్రమంతా ఒక్కసారిగా రంగంలోకి దిగడంతో క్లాప్ చప్పుళ్లు బలంగా వినిపిస్తున్నాయి.
నగరంలోనే..
కరోనా తర్వాత ఔట్ డోర్‌లో చిత్రీకరణలు చేయడానికి మొగ్గు చూపడం లేదు సినిమా బృందాలు. ప్రయాణాలు చేయాల్సి రావడం.. అక్కడ వసతులు, వాతావరణంపై భయాలతో స్థానికంగా చిత్రీకరణలు చేసుకోవడమే మేలని భావిస్తున్నాయి. అందుకే కాస్త ఎక్కువ ఖర్చయినా ఇక్కడే సెట్స్‌ని తీర్చిదిద్ది చిత్రీకరణ చేస్తున్నారు.
- ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్' కోసం రామోజీ ఫిల్మ్‌సిటీతోపాటు, నగరంలోని మరో స్టూడియోలో సెట్స్ వేశారు. యూరప్ వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్ వేసి, అందులోనే చిత్రీకరణ చేస్తున్నారు. జనవరి తొలి వారం వరకు 'రాధేశ్యామ్' చిత్రీకరణ భాగ్యనగరంలోనే జరుగుతుందని సినీ వర్గాలు తెలిపాయి.
- చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఆచార్య' కోసం ఓ ఊరు ముస్తాబైంది. హైదరాబాద్ నగర శివార్లలో వేసిన ప్రత్యేకమైన ఆ సెట్‌లోనే మరికొన్నాళ్లపాటు షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే చిరంజీవి, కాజల్‌లపై ఓ పాటని తెరకెక్కించారు. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'వకీల్‌సాబ్' హైదరాబాద్‌లోనే జరుగుతోంది.
- అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' నగర శివార్లలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో చిత్రీకరణ జరుపుకొంటోంది.
- అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', గోపీచంద్ 'గోలీమార్', నాగశౌర్య 'వరుడు కావలెను'తోపాటు మరికొన్ని సినిమాల చిత్రీకరణలు నగరంలోనే సాగుతున్నాయి.