భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉత్తమ ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రవేశపెట్టింది. ఈ అవార్డుల్లో 28 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ప్రకటించిన పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది కీర్తి. ఉత్తరాది నటీమణులే ఎక్కువగా ఈ విభాగంలో పురస్కారాలు అందుకోగా.. 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 'మహానటి' చిత్రానికిగాను కథానాయిక కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డులు ప్రకటించినప్పటి నుంచి జాతీయ ఉత్తమ నటి విభాగంలో ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే తెలుగువాళ్లు ఆ పురస్కారాలు అందుకోగా.. కీర్తి సురేష్ నాలుగో కథానాయిక కావడం విశేషం.
'మహానటి' సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అఖిలాంధ్ర ప్రేక్షకుల చేత నీరాజనాలందుకుంది కీర్తి. చేసింది తక్కువ చిత్రాలే అయినా దర్శకుడు నాగ్ అశ్విన్ తనలో సావిత్రి పోలికలను చూసి ఆ పాత్రకు ఎంపిక చేశాడు. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు శ్రమించిందీ నటి. స్వయంగా డబ్బింగ్ చెప్పి మహానటి సావిత్రినే మైమరిచిపోయేలా చేసింది. స్వల్ప వ్యవధిలోనే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది కీర్తి సురేష్.
'మహానటి' చిత్రానికి మూడు విభాగాల్లో పురస్కారాలు దక్కగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం రావడం యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చింది. 1967లో ఈ పురస్కారాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 41 మంది కథానాయికలు 52 సార్లు జాతీయ ఉత్తమ నటి విభాగంలో పురస్కారాలు అందుకున్నారు. వారిలో 1967లో బాలీవుడ్ చిత్రం 'రాత్ ఔర్ దిన్' చిత్రానికి తొలిసారిగా నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకోగా.. ఆ తర్వాత షబానా అజ్మీ ఐదు సార్లు ఈ గౌరవాన్ని పొందింది.