సినిమాల్లో అప్పుడప్పుడు ఫైట్లు, సాహసాలు చేసి అలరించే హీరోయిన్లు.. నిజ జీవితంలోనూ అడ్వెంచర్లు చేసి ఆకట్టుకుంటున్నారు. అందంతో పాటు తమ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తున్నారు. అయితే ఏయే నటీమణులకు ఎలాంటి అడ్వెంచర్లు ఇష్టమో.. మీకోసం.
వాటర్ స్పోర్ట్స్ ఇష్టం
మల్టీ టాలెంటెడ్ కథానాయికరెజీనా. తెలుగు, తమిళం రెండిట్లోనూ ఉనికిని చాటుకుంటోంది. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే రెజీనాకు సాహసాలన్నా ఇష్టమే. ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్. చెన్నైలో ఈ ఏడాది నిర్వహించిన 'స్టాండప్ పెడల్ రేస్'లో మొదటి బహుమతి గెలుచుకుంది. ఈ ఏప్రిల్‌లో పారా అథ్లెట్‌ల కోసం నిధులు సేకరించడానికి చెన్నై నుంచి పుదుచ్చేరికి 140కి.మీ. సైక్లింగ్ చేసింది. గత ఏడాది ఉత్తరాఖండ్‌లో 'వైల్డ్ వారియర్ హిమాలయన్ అడ్వెంచర్ రేస్' 30 ఫర్ 30 ఛాలెంజ్‌ను నిర్వహించారు. రెజీనా ఇందులో పాల్గొంది. హీమోఫీలియా, క్యాన్సర్‌లపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. అంతేకాదు దీని ద్వారా వచ్చిన నిధులతో 30 మంది పిల్లలకు సాయమందిస్తారు. దీనిలో భాగంగా మౌంటెన్ బైకింగ్, హైకింగ్, ఇంకా నీటిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గతంలోనూ బెంగళూరులో వరల్డ్ వారియర్ డూవాత్లాన్‌లో పాల్గొంది. ఈమెకు సర్ఫింగ్ అన్నా చాలా ఇష్టమట. కేరళలోని సర్ఫింగ్ స్కూల్లో శిక్షణ కూడా తీసుకుంటోంది.
1168 అడుగుల ఎత్తు నుంచి..
త్రిష.. తెలుగుతోపాటు తమిళంలోనూ అగ్ర కథానాయిక. టాప్ హీరోలందరితో నటించింది. ఈమెకు ప్రయాణాలంటే పిచ్చి. ఏమాత్రం ఖాళీ దొరికినా విదేశాలకు చెక్కేస్తుంది. బంగీ జంప్, స్కైడైవింగ్ వంటి సాహస క్రీడలను ప్రయత్నిస్తుంది. ఓసారి కెనడాలో 1168 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పది నిమిషాలపాటు గాల్లోనే ఉండి, కింద స్టేడియంలో జరుగుతున్న బేస్‌బాల్ మ్యాచ్‌నూ వీక్షించింది. అది తన జీవితంలో ఓ మధురానుభూతి అంటోంది. అంతేకాదు.. ఓ తమిళ సినిమా కోసం స్కూబా డైవింగ్‌నూ నేర్చుకుంది. తను ఇప్పటిదాకా చేసిన వాటిలో స్కైడైవింగ్ త్రిషకు బాగా నచ్చిన అడ్వెంచరట. ఏడాదికోసారైనా తప్పక చేస్తానని చెబుతోంది.
ఫార్ములా వన్‌లో శిక్షణ..
'మెంటల్ మదిలో' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. తర్వాత 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా' సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు ఫార్ములా వన్ రేసర్‌గా సర్టిఫికెట్ అందుకుని వార్తల్లో నిలిచింది. పాఠశాల రోజుల్లోనే స్పోర్ట్స్ కార్లపై మనసు పారేసుకున్న నివేదా.. ఎంతో ఇష్టంగా ఈ రంగంలో శిక్షణ తీసుకుంది. 2015లోనే ఓ స్పోర్ట్‌కారు కూడా కొంది. అంతేకాదు.. యూఏఈలో అప్పట్లో డాడ్జ్ ఛాలెంజర్ కారు కొన్న రెండో మహిళగానూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం లెవల్ వన్ కంప్లీట్ చేసి తర్వాత లెవల్ పూర్తి చేయడంపై దృష్టి సారించానని చెబుతోంది.
ప్రకృతితో ప్రయాణం..
కరోనా వచ్చాక జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. తనూ దీనికి మినహాయింపేం కాదంటోంది తమన్నా. లాక్‌డౌన్‌లో కుకింగ్, వర్కవుట్ల వీడియోలు చేసిన తమన్నా ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రకృతిలో విహరించాలనుకుంది. అందుకు ట్రెక్కింగ్‌ను ఎంచుకుంది. దీని గురించి చెబుతూ నేచర్‌తో ప్రేమలో పడ్డానంటూ 'తమన్నా స్పీక్స్' ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది. మహారాష్ట్రలోని థానేలో ఉన్న పాపులర్ ట్రెక్కింగ్ డెస్టినేషన్ అసంగావ్ మహులీ పోర్టుని సందర్శించింది. అక్కడి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసింది ఈ మిల్కీ బ్యూటీ. అప్పటి నుంచి వీలైనప్పుడల్లా ట్రెక్కింగ్‌కు వెళ్తోంది.