అదితీరావు హైదరీ.. దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. అయితే వీటిపై వస్తున్న విమర్శల గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. వారిని చూస్తే తనకు జాలేస్తుందని, వారికున్న సమస్య నుంచి త్వరగా కోలుకోవాలని వ్యంగస్త్రాలు వేసింది.
"విమర్శలు చేసేవారు ఏదో సమస్యతో బాధపడుతున్నారనుకుంటా. ఏదో విషయంపై వారికి కోపం ఉండి ఉంటుంది. లేకపోతే వారి జీవితం మీద వారికే విరక్తి కలిగి ఉండొచ్చు. దానిని సోషల్ మీడియాలో విమర్శల ద్వారా తీర్చుకుంటున్నారు. అలాంటి వారికి మనం ఒక్కటే చేయగలం. వారిని చూసి జాలి పడటమే. వారు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఏంటో? త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా" -అదితీరావు హైదరీ, హీరోయిన్