పదిహేనేళ్లకే తెరంగేట్రం చేసి, ప్రముఖ హీరోల సరసన జోడీ కట్టి... ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరుచుకున్న నటి సింధీ సుందరి తమన్నా. త్వరలో 'ఎఫ్3', 'మ్యాస్ట్రో', 'సీటీమార్', 'దటీజ్ మహాలక్ష్మి' వంటి సినిమాల్లో కనిపించబోతున్న ఈ మిల్కీబ్యూటీ తన ఇష్టాయిష్టాల గురించి చెబుతోందిలా..
దేవతగా ఆరాధిస్తా
నాకు ముందు నుంచీ మాధురిదీక్షిత్, ప్రీతీజింటా అంటే చెప్పలేనంత ఇష్టమైనా.. శ్రీదేవిని మాత్రం ఓ దేవతలా భావిస్తా. ఆమె నటనను చూసి ఎన్నో మెలకువలు నేర్చుకున్నా. చాలా విషయాల్లో నన్ను నేను మెరుగుపరుచుకున్నా.
మూడు సినిమాలు చేసినా...
ఒకప్పుడు నాకు 'మిస్టర్ పర్‌ఫెక్ట్'లో నటించే అవకాశం వచ్చినా చివరి నిమిషంలో పోయింది. అప్పుడు ప్రభాస్‌తో నటించే ఛాన్స్ పోయినందుకు కాస్త బాధనిపించింది కానీ... తరవాత మేమిద్దరం కలిసి 'రెబల్', 'బాహుబలి1, 2' చేశాం. ప్రభాస్ వ్యక్తిగతంగా ఎంత సింపుల్‌గా ఉంటాడో సినిమాలోనూ అంతే సరదాగా నటిస్తాడు. తనతో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే ప్రభాస్‌తో కలిసి మరోసారి తెర పంచుకోవాలని ఉంది.
ఆ పుకారు నిజమవ్వాలనుకున్నా
కొన్నాళ్ల క్రితం ఓ పత్రిక నేను 'అవతార్ 2'లో నటిస్తున్నానని రాయడమే కాదు, నా ముఖానికి నీలం రంగు వేసిన ఫొటోను కూడా ప్రచురించింది. దాన్ని చూసి మొదట ఆశ్చర్యపోయినా.. తరువాత అది నిజమైతే ఎంత బాగుంటుందో అనిపించింది.
మర్చిపోకుండా చేసేవి..
పొద్దున నిద్రలేవగానే ఆయిల్‌పుల్లింగ్‌తోపాటూ రాత్రి పడుకునేముందు నా ఫోన్‌ను తప్పకుండా చూడటం. నిజానికి పడుకునేముందు ఫోన్ చూడకూడదని అంటారు కానీ ఆ అలవాటు నుంచి ఇంకా బయటపడలేకపోతున్నా.