తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తమన్నా బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? - తమన్నా బ్యూటీ టిప్స్​

మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia beauty Secret) లాంటి సౌందర్యాన్ని ఎంతో మంది యువతులు కోరుకుంటుంటారు. అలాంటి వాళ్ల కోసమే తన అపురూప లావణ్యం వెనుక రహస్యాన్ని వివరిస్తూ పలు వీడియోలను పోస్ట్​ చేసింది తమ్మూ. మరి ఆ బ్యూటీ సీక్రెట్స్​ ఏంటో ఓ సారి చూసేద్దాం..

tamannah
తమన్నా

By

Published : Jul 24, 2021, 12:01 PM IST

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia beauty Secret). ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ. తన అపురూప లావణ్యం వెనుక ఉన్నవన్నీ ఇంటి చిట్కాలే అంటోన్న ఈ చక్కనమ్మ పలు సందర్భాల్లో పంచుకున్న బ్యూటీ సీక్రెట్స్‌ ఏంటో ఈ సందర్భంగా చూసేద్దాం రండి..

ఐస్‌ వాటర్‌తో ఆ సమస్య దూరం!

రాత్రి పడుకోవడం ఆలస్యమైనా, నిద్ర సరిగ్గా లేకపోయినా, ఒత్తిడిగా అనిపించినా.. దాని ప్రభావం మరుసటి రోజు నిద్ర లేచాక ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కళ్లు వాయడం, ముఖం ఉబ్బడం.. ఇలా మన ముఖాన్ని అద్దంలో చూసుకొని డీలా పడిపోతుంటాం. కానీ ఈ సమస్యకు నేనో సింపుల్‌ చిట్కా పాటిస్తా. అదేంటంటే.. ఒక బౌల్‌లో ఐస్‌ వాటర్‌ తీసుకొని.. కొన్ని సెకన్ల పాటు ముఖాన్ని అందులో ముంచి ఉంచుతా. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకోవడంతో పాటు ఉబ్బు మాయమై తిరిగి మేకప్‌ వేసుకోవడానికి నా మోము సిద్ధపడుతుంది. స్వీయానుభవంతో చెబుతున్నా.. ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి.

నా ఫేవరెట్‌ ఫేస్ ప్యాక్‌ ఇదే!

షూటింగ్‌ ఉన్నప్పుడు తప్పదు కానీ.. నిజానికి నాకు మేకప్‌ లేకుండా ఉండడమంటేనే ఇష్టం. ఈ క్రమంలో ఎక్కువగా ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఫేస్ ప్యాక్స్‌ ట్రై చేస్తుంటా. శెనగపిండి, పసుపు, చందనం, వేపాకులతో వేసుకునే ప్యాక్‌ నా ఫేవరెట్‌. ఇది మంచి స్క్రబ్‌లా కూడా పని చేస్తుంది. ఇక ముల్తానీ మట్టి, వేపాకుల రసం.. ఈ రెండూ కలిపి తయారుచేసుకున్న ప్యాక్‌ను అప్పుడప్పుడూ ఉపయోగిస్తుంటా. ఇక చర్మానికి తేమనందించడానికి కలబంద గుజ్జు ఉండనే ఉంది. వీటితో పాటు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహిస్తుంటా. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే అవకాడో, బ్రకలీ ఎక్కువగా తీసుకుంటా. నీళ్లు బాగా తాగుతా.

తమన్నా

ఆ డైట్‌ వర్కవుటైంది!

అందమనేది మనం వాడే సౌందర్య ఉత్పత్తుల్లోనే కాదు.. మనం తీసుకునే ఆహారం పైనా ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే వివిధ రకాల డైట్‌ ట్రెండ్స్‌ ఫాలో అవడం చాలామందికి అలవాటే! నేను కూడా గతంలో వివిధ రకాల డైట్స్‌ని పాటించా. కానీ ఏదీ వర్కవుట్‌ కాలేదు. ఎప్పుడైతే ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ను అలవాటు చేసుకున్నానో దానివల్ల కలిగే ఫలితాలు నాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఈ డైట్‌లో భాగంగా ప్రస్తుతం భోజనానికి భోజనానికి మధ్య 12 గంటల గ్యాప్‌ ఇస్తున్నా. అంటే ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఆహారం తీసుకుంటే.. మరుసటి రోజు ఉదయం 6 దాకా ఏదీ తిననన్నమాట! దీనివల్ల నా అందం ద్విగుణీకృతం అవడమే కాదు.. శరీరం కూడా ఉత్తేజకరంగా తయారైంది. ఒకవేళ ఈ డైట్‌ ట్రెండ్‌ ఫాలో అవ్వాలనుకునే వారు ముందు నిపుణుల సలహా తీసుకోండి.. ఆ తర్వాత సరేననుకుంటే మీ శక్తిసామర్థ్యాలను బట్టి మీల్స్‌ మధ్య గ్యాప్‌ను పెంచుకుంటూ పోవచ్చు.

తమన్నా

పట్టు లాంటి జుట్టు కోసం..!

కొబ్బరినూనె, ఉల్లిపాయ రసం.. ఈ రెండూ కలిపి తయారుచేసుకున్న హెయిర్‌ ఆయిల్‌ ఎప్పుడూ నా దగ్గర స్టాక్‌ ఉంటుంది. వారానికోసారి ఈ నూనెతో జుట్టును, కుదుళ్లను మర్దన చేసుకుంటా. ఆ తర్వాత శీకాకాయ, బొప్పాయి, ఉసిరి.. వంటి పదార్థాలతో తయారుచేసిన హెయిర్‌వాష్‌తో జుట్టును శుభ్రం చేసుకుంటా. ఈ రొటీనే నా జుట్టును సిల్కీగా, పట్టులా మెరిసేలా చేస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్‌ కుదుళ్ల చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

తమన్నా

మేకప్‌ తొలగించాల్సిందే!

అందాన్ని సంరక్షించుకోవడంలో భాగంగా మనం వేసుకున్న మేకప్‌ను తొలగించుకోవడం కూడా ముఖ్యమే! అలా చేయకపోతే ఏమవుతుందో నాకు అనుభవమే. ఎందుకంటే ఓరోజు మేకప్‌ తొలగించకుండానే నిద్రపోవడం వల్ల మరుసటి రోజుకు చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా తయారైంది. ఇక అప్పట్నుంచి రాత్రి ఎంత ఆలస్యమైనా మేకప్‌ తీసేశాకే నిద్రకు ఉపక్రమిస్తున్నా. దీనివల్ల పిగ్మెంటేషన్‌ సమస్య కూడా ఎదురుకాదు. ఇక మేకప్‌ వల్ల చర్మం కోల్పోయిన తేమను తిరిగి అందించడానికి టోనర్‌, మాయిశ్చరైజర్‌ ఉపయోగిస్తుంటా. అలాగే పడుకునే ముందు నైట్‌ క్రీమ్‌, ఐ క్రీమ్‌ రాసుకోవడం మాత్రం మర్చిపోను.

తమన్నా

బ్రషింగ్‌ ఎలాగో వ్యాాయమం అలాగే!

దంత సంరక్షణ కోసం మనం రోజూ ఎలాగైతే బ్రష్‌ చేసుకుంటామో.. అలాగే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం ముఖ్యమని నా నమ్మకం. రోజూ ఎన్నో విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటాం. వ్యాయామం కూడా అందులో ఒకటి. ఇదే నన్ను రోజంతా పాజిటివ్‌గా ఉండేలా చేస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. మంచి ఆలోచనలతో ముందుకెళ్లేలా చేస్తోంది. అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలంటే కావాల్సింది ఇలాంటి పాజిటివిటీనే!

ఇదీ చూడండి: వయ్యారాల తమన్నా.. వానలో అలా!

ABOUT THE AUTHOR

...view details