'అఖండ'(akhanda balakrishna cinema) సినిమాలో బాలకృష్ణతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది నటి పూర్ణ. ఆయన తోటి వ్యక్తులను ఎంతో గౌరవిస్తారని, క్రమశిక్షణ కలిగిన వారని కొనియాడింది. బాలయ్య.. పని పట్ల ఎంతో అంకితభావంతో ఉంటారని చెప్పిన ఆమె ఆయన్ను 'సింహం'గా అభివర్ణించింది.
"ఈ చిత్రంలో బాలకృష్ణ, నాకు మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయి. ఆయన గురించి చాలా విన్నాను. చాలా ఇంటర్వ్యూలు చూశాను. మొదటిసారి కలిసినప్పుడు ఆయన వెంటనే లేచి 'పూర్ణ గారు ఎలా ఉన్నారు' అని అన్నారు. బాలయ్య గారు నాతో మాట్లాడిన విధానం, ఇచ్చిన గౌరవం చూసి ఆశ్చర్యపోయా. తోటివారిని అంతలా గౌరవించే వ్యక్తిని ఇప్పటివరకు నేను చూడలేదు. ఎవరు వచ్చిన లేచి నిలబడతారు. పని చేయడంలో ఆయన 'సింహం' లాంటి వారు. ఒకరోజు ఆయనతో మాట్లాడేటప్పుడు.. 'నా ఫోన్ వాల్‌పేపర్‌గా మీ ఫొటో పెట్టుకుంటాను' అని చెప్పా. ప్రతిరోజు లేవగానే ఆయన ఫొటోను చూసి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సింహంలా పనిచేయాలి. అసలు బాలయ్య లాంటి వ్యక్తిని ఇంత వరకు చూడలేదు. నేను కూడా 'అది బాలేదు, ఇది బాలేదు' అంటూ కంప్లెయింట్ చేస్తా. కానీ ఆయన అలా కాదు. ప్రతిరోజు సెట్‌కు వస్తారు. దర్శకుడు ఏమి చెప్పినా అలానే అంటారు. మరో మాట కూడా మాట్లాడరు. బాలయ్యతో మరిన్ని సినిమాలు చేసి, ఆయన నుంచి మరింత స్ఫూర్తిని పొందాలి."