తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తెలుగు నేర్చుకోవడం అంత సులువేం కాదు' - ఆనంద్ దేవరకొండ వర్ష బొల్లమ్మ

'చూసీ చూడంగానే' చిత్రంతో టాలీవుడ్​కు పరిచయమై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది యువ కథానాయిక వర్ష బొల్లమ్మ. ఇటీవలే ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'మిడిల్​క్లాస్​ మెలోడీస్'​ చిత్రంలో మెరిసింది. ఈనెల 20 అమెజాన్​ప్రైమ్​ వేదికగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ ప్రత్యేకంగా ముచ్చటించింది.

Actress Varsha Bollamma Special Interview
'తెలుగు నేర్చుకోవడం అంత సులువేం కాదు'

By

Published : Nov 18, 2020, 7:59 AM IST

వర్ష బొల్లమ్మ... పేరే కాదు, ఈమె చూడటానికి కూడా తెలుగమ్మాయిలానే ఉంటుంది. పక్కింటి అమ్మాయిల్ని గుర్తు చేస్తుంది. 'చూసీ చూడంగానే' చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. 'విజిల్‌' సినిమాలోనూ మెరిసింది. ఇటీవల ఆనంద్‌ దేవరకొండతో కలిసి 'మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌' చిత్రంలో నటించింది. భవ్య క్రియేషన్స్‌ నిర్మించిన ఆ చిత్రం ఈ నెల 20న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ ప్రత్యేకంగా ముచ్చటించింది.

'మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌' అంటున్నారు. మరి మీరు మిడిల్‌ క్లాస్‌ అమ్మాయేనా?

దాదాపుగా మధ్య తరగతి జీవితమే నాది. ఇందులో నేను పోషించిన సంధ్య పాత్రకీ, నా వ్యక్తిగత జీవితానికి కొన్ని పోలికలు ఉంటాయి. సంధ్య తన మనసులోని భావాలన్నింటినీ లోపలే దాచుకుంటుంది. కొన్నిసార్లు నేనూ అంతే. అయితే ఈ సినిమాలో కనిపించే కుటుంబానికీ, నా కుటుంబానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సంధ్య తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్‌. అలాంటి వాళ్ల పిల్లలు కొంచెం భిన్నంగా ఉంటారు. నిజ జీవితంలో నా తల్లిదండ్రులు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.

మీ పాత్రలో మీకు బాగా నచ్చిన విషయాలేంటి?

తన తండ్రి ఏం చెప్పారో అదే చేస్తుంటుంది సంధ్య. గుంటూరులో పుట్టి పెరిగిన ఓ సాధారణ అమ్మాయి. అప్పుడే కాలేజీ పూర్తి చేసి, ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అమ్మాయి. డబ్బింగ్‌ కూడా నేనే చెప్పుకున్నా. గుంటూరు యాసపై పట్టు పెంచుకుని మరీ నటించా. దర్శకుడు వినోద్‌ సొంతూరూ గుంటూరే. దాంతో మేం వర్క్‌ షాప్‌ మొదలు పెట్టినప్పట్నుంచే అదే యాసలో మాట్లాడటం అలవాటు చేసుకున్నాం. అది మాకు మేలు చేసింది. ఆనంద్‌ దేవరకొండతో కలిసి నటించడం, భవ్య క్రియేషన్స్‌లో పనిచేయడం ఒక మంచి అనుభవం.

తెలుగుపై తొందరగానే పట్టు సాధించినట్టున్నారు?

నా తొలి సినిమా 'చూసీ చూడంగానే' కూడా నేనే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నా. నాది కొంచెం భిన్నమైన గాత్రం. నా మొహానికి వేరే వాయిస్‌ని వినడం నాకు అంత ఇష్టం ఉండదు. తెరపై ఎంత బాగా భావోద్వేగాలు పండించినా, వేరే గాత్రంతో నన్ను నేను చూసుకున్నానంటే అది సంతృప్తి ఇవ్వదు. అందుకే తొలి సినిమా సమయంలోనే డబ్బింగ్‌ నేనే చెప్పుకోవాలని నిర్ణయించుకున్నా. కన్నడ అమ్మాయే కాబట్టి తెలుగు సులభంగా వచ్చేస్తుందిలే అని మొదట్లో అందరూ అనేవాళ్లు. అలా చెప్తారు కానీ...అంత సులభమేమీ కాదు. తెలుగు నేర్చుకోవడం కష్టంగానే అనిపించింది.

సినిమా రంగంవైపు ఎలా వచ్చారు?

కర్ణాటకలోని కూర్గ్‌ మా ఊరు. బెంగళూరులో పెరిగాను. మా నాన్న ఎస్టేట్స్‌ చూసుకుంటారు. అమ్మ నాతోపాటే వస్తుంటారు. కాలేజీలో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు చేసిన ఓ ఆడిషన్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది.

తెలుగులో వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. ఇక ఇక్కడ స్థిరపడినట్టేనా?

తెలుగుతోపాటు తమిళంలోనూ చేస్తున్నా. అక్కడ జీవీ ప్రకాశ్​తో కలిసి ఓ సినిమా చేస్తున్నా. రాజ్‌తరుణ్‌తో కలిసి 'స్టాండప్‌ రాహుల్‌' అనే సినిమాలో నటిస్తున్నా.

ABOUT THE AUTHOR

...view details