ఆమె అందానికే అందం. తల్లితండ్రుల నుంచి స్వీకరించిన ముగ్ధ స్నిగ్ద సౌందర్యానికి ఎత్తిన పతాక. స్వీట్ నథింగ్స్ చెప్పే నయనాలలో మిలమిల మెరిసే తళుకులు.. పెదాల్లో ఎర్రని మెరుపులు.. చెక్కిళ్లలో పూసే చామంతులు.. సన్నజాజి తీగను తలపించే సన్ననైన శరీరాకృతి.. ఏ కవి రాయని శృంగార కృతి ఆమె. మాటాడితే కీర్తనం.. నడిస్తే నర్తనం.. నటిస్తే సమ్మోహనం.. వెరసి ఆమె ట్వింకిల్ ఖన్నా.
తొలిచిత్రం 'బాబీ'తో భారతీయుల్ని వెర్రెక్కించిన అలనాటి అత్యద్భుత సౌందర్య రాశి డింపుల్ ఖన్నా గారాల పట్టి ట్వింకిల్ ఖన్నా. తన కాబోయే భర్త అచ్చం ఇలాగే ఉండాలని అప్పట్లో ఆశపడిన ఆడపిల్ల కలల రాకుమారుడు.. వరుస విజయాల హీమాన్.. రాజేశ్ ఖన్నా ట్వింకిల్‌కు తండ్రి. ప్రస్తుతం తెరకు దూరంగా ఉన్నా.. ట్వింకిల్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో కుండపోతగా కురిసే గులాబీ అత్తరే. అంతలా తన నటనతో ప్రేక్షకుల మనసులు దోచేసుకుంది. మంగళవారం (డిసెంబరు 29) ట్వింకిల్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
హీరోతో డేటింగ్
ఎవరిదైనా పుట్టినరోజు అని తెలిస్తే వారికి ప్రత్యేక బహుమతులను ఇచ్చి ఆశ్చర్యపరచాలని తమ ఆత్మీయులను భావిస్తుంటారు. అయితే బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా విషయంలో మాత్రం అది నిజంగానే అందుకు భిన్నంగా జరిగిందట. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ హీరో తనకు పేపర్ వెయిట్ గిఫ్ట్‌గా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారని ట్వింకిల్ ఖన్నా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఆ హీరో ఎవరు? ట్వింకిల్ ఖన్నాకు అతడికి సంబంధం ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం.
ట్వింకిల్ ఖన్నాకు బర్త్‌డే గిఫ్ట్‌గా పేపర్ వెయిట్ ఇచ్చింది ఎవరో కాదు! ఆమె భర్త హీరో అక్షయ్ కుమార్. ట్వింకిల్ ఖన్నాతో అక్షయ్ డేటింగ్లో ఉన్నప్పుడు.. ఆమె బర్త్‌డే అన్న సంగతి అక్షయ్‌కు గుర్తు లేదట. ఆ తర్వాత గుర్తుకువచ్చేసరికి బయటికి వెళ్లి బహుమతి కొనేంత సమయంలేక ఇంట్లోనే ఉన్న పేపర్ వెయిట్‌ను కానుకగా ఇచ్చారట. అయితే తనకు ఎప్పటికైనా తన కోసం ఓ డైమండ్ రింగ్ కొనివ్వాలని ఆమె కోరగా.. అక్షయ్ ఆమె కోరికను తీర్చారని ఓ సందర్భంగా చెప్పుకొచ్చింది.
వ్యక్తిగతం
ట్వింకిల్ ఖన్నా.. 1974 డిసెంబరు 29న ముంబయిలో జన్మించింది. రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియాల పెద్ద కుమార్తె ట్వింకిల్ ఖన్నా. ఆమెకు రింకీ ఖన్నా అనే సోదరి ఉంది. ఆమె కూడా బాలీవుడ్ నటే. విశేషమేమిటంటే ఆమె తండ్రి రాజేశ్ ఖన్నా పుట్టినరోజు కూడా డిసెంబరు 29నే.
తెరంగేట్రం
1995లో రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కిన 'బర్సాత్' అనే సినిమాతో ట్వింకిల్ ఖన్నా వెండితెరకు పరిచయమయ్యింది. ప్రముఖ నటుడు బాబీ డియోల్‌కూ ఇదే మొదటి సినిమా. ఈ సినిమా విడుదలకు ముందు ట్వింకిల్ ఖన్నా మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేశారు. 'బర్సాత్' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఆ ఏడాది ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఆరో సినిమాగా పేరుగాంచింది. ఆ మరుసటి ఏడాది 'జాన్', 'దిల్ తేరా దివానా' అనే సినిమాలలో నటించారు ట్వింకిల్ ఖన్నా. సల్మాన్‌తో సక్సెస్ 1997లో, 'ఉఫ్! యే మొహబ్బత్', 'ఇతిహాస్' చిత్రాలు విడుదల అయ్యాయి. అయితే, ఈ రెండు సినిమాలు కూడా ట్వింకిల్ ఖన్నాని నిరుత్సాహపరిచాయి. 1998లో విడుదలైన ఏకైక ట్వింకిల్ ఖన్నా సినిమా 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై'. ఈ చిత్రంలో సినిమాలో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం అందుకుంది.
టాలీవుడ్ ఎంట్రీ
విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన 'శీను' చిత్రంలో ట్వింకిల్ ఖన్నా హీరోయిన్గా టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
సొంత నిర్మాణ సంస్థ
మిసెస్ ఫన్నీ బోన్స్ మూవీస్ అనే నిర్మాణ సంస్థను సొంతంగా ప్రారంభించింది ట్వింకిల్ ఖన్నా. అసాధారణమైన సినిమాలతో పాటు కమర్షియల్ విలువలు ఉన్న సినిమాలనూ ఈ సంస్థ ద్వారా నిర్మించారు. అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్ మ్యాన్ చిత్రానికి ఈమె కూడా సహ-నిర్మాతగా వ్యవహరించింది.
తెరవెనుక