"సినిమాల సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వను. ఎన్ని గొప్ప పాత్రలు పోషించానన్నదే నాకు ముఖ్యం" అంటోంది కథానాయిక సురభి. 'బీరువా', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'ఒక్క క్షణం', 'ఎటాక్', 'జెంటిల్మన్', 'ఓటర్' లాంటి చిత్రాలతో అలరించిందామె. నేడు(జూన్ 5) ఆమె పుట్టినరోజు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ అందాల భామ.. కొన్ని విషయాలు ముచ్చటించింది.
"నేనిప్పుడు ముంబయిలో మా ఇంట్లోనే సురక్షితంగా ఉన్నా. నటిగా మారాక నాకెప్పుడూ ఇంతటి విరామ సమయం దొరకలేదు. వంట గదిలో దూరి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నా. నాకెంతో ఇష్టమైన పియానో వాయిస్తూ సేద తీరుతున్నా" అని చెప్పింది. ప్రేమ, పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది.
"నా దృష్టిలో ప్రేమ గొప్పది. నాకిప్పటి వరకు ఒక్క ప్రేమ లేఖా అందలేదు. కాలేజీ రోజుల్లో చాలా మంది అబ్బాయిలు నేరుగా వచ్చి తమ ప్రేమను వ్యక్తపరచడం, ఫోన్‌లలో సందేశాలు పంపడం లాంటివి చేశారు. నేను ప్రేమ వివాహానికే ఓటేస్తా. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే ఉంది. నాకు కాబోయే భాగస్వామి నన్ను బాగా చూసుకోవాలి. కుటుంబాన్ని ప్రేమించగలగాలి. మంచి హాస్యచతురత కలిగిన వాడై ఉండాలి" అని చెప్పింది సురభి.
తన కొత్త చిత్రాల సంగతులు చెబుతూ.."ప్రస్తుతం 'భీమవరం బుల్లోడు', ఆదితో 'శశి' చిత్రాల్లో నటిస్తున్నా. కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్‌తో ఓ సినిమా చేస్తున్నా. నటనకు ఆస్కారం ఉన్మ మంచి కథ దొరికితే వెబ్‌సిరీస్‌లకూ సిద్ధమే" అంది సురభి.
ఇదీ చూడండి: కన్ను కుట్టేనా కోరికకైనా నిన్ను చూడగానే...