ప్రతికూలంగా కనిపించేందుకైనా సిద్ధం: శ్రుతి
లాక్‌డౌన్‌లో తన చేసిన పనుల గురించి చెప్పిన హీరోయిన్ శ్రుతిహాసన్.. ప్రతికూలంగా ఉన్న పాత్రలు పోషించేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వీటితో పాటు ఇతర విషయాలు పంచుకుంది.
హీరోయిన్ శ్రుతి హాసన్
ఆకట్టుకునే కళ్లు... చూపు తిప్పుకోనివ్వని వయ్యారం... శ్రుతిహాసన్ సొంతం. అందాన్నే చిరునామాగా చేసుకున్న శ్రుతి.. లాక్‌డౌన్‌లో ఏం చేసింది? 'క్రాక్', 'వకీల్‌సాబ్' చిత్రాల్లో తన పాత్ర ఎలా ఉండబోతోంది? సంగీత సాధన ఎలా సాగుతోంది? భవిష్యత్తు ప్రణాళికలేంటి? లాంటి విషయాలను 'ఈనాడు సినిమా'కు ఫోన్లో వివరించింది.
- ఈ లాక్‌డౌన్‌లో సృజనాత్మకంగా కొన్ని పనులు చేస్తున్నా. ఒంటరిగా ఉంటున్నా. కాబట్టి ఇంటి పని, వంట పనితో బిజీగా గడిపేస్తున్నా. సంగీతం, రచన మీద విపరీతంగా వర్కవుట్ చేస్తున్నా.
- కథానాయకుడు రవితేజ, దర్శకుడు గోపీచంద్‌తో పని చేయడం ఇది రెండోసారి. దర్శకుడు 'క్రాక్' సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఇది నా జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 'వకీల్ సాబ్'లోనూ నటిస్తున్నా. అందులో నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పను.
- నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ప్రస్తుతానికి ఏమీ లేవు. ఓ మ్యూజీషియన్ పాత్ర చేయాలని మాత్రం ఉంటుంది. ఓ బలమైన పాత్ర వస్తే తెరపై ప్రతికూలంగా కనిపించడానికీ సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు నేను వేరే కథల గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా చేతిలో ఉన్న సినిమాలకే ప్రాధాన్యమిస్తా.
- 'ఈనాడు' సినిమాకు సంగీత దర్శకురాలిగా చేశా. ఓ సినిమాకు పూర్తి స్థాయి సంగీతం చేయడానికి చాలా సమయం పడుతుంది. నేను నటించడానికే ఎక్కువ ఇష్టపడతాను. అలాగే స్వతంత్రంగా ప్లేబ్యాక్ సింగింగ్ లాంటివి చేస్తా.
- మూడు సినిమాలు చేస్తున్నా. అలాగే మ్యూజిక్ కోసం లండన్ వెళ్లాల్సి ఉంటుంది. మ్యూజిక్, సినిమాను నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తా. అలాంటప్పుడు సమయాన్ని ప్రణాళిక ప్రకారం వినియోగించుకోవడం పెద్ద కష్టం కాదు.
- పారితోషికం గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. నేనసలు దాని గురించి ఆలోచించడమే లేదు. ఇది అంత ముఖ్యమైన విషయం కాదు కూడా. ఓ సినిమా సెట్లో ఎంతో మంది పని చేస్తుంటారు. వాళ్లందరూ తిరిగి చిత్రీకరణల్లో భాగం కావడమే అన్నింటికంటే ముఖ్యమైంది.
- నేను, నాన్న కమల్ హాసన్ కలిసి 'శభాష్ నాయుడు' సినిమా చేశాం. దాన్ని ఇప్పుడు విడుదల చేయడం లేదు. నాన్న, చెల్లి అక్షర హాసన్, నేను ముగ్గురం కలిసి నటించాలని ఇప్పుడైతే ప్రణాళిక వేసుకోలేదు. అవకాశం వస్తే భవిష్యత్తులో చేస్తామేమో చెప్పలేం కదా!
- ప్రస్తుతం దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. అది చాలా పెద్ద బాధ్యత. ఎంతో కష్టమైంది. అందుకే దాని గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం సంగీతంపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాను. మ్యూజిక్ పోయెట్రీ రాస్తున్నా.