షూటింగ్ సమయంలో హీరోయిన్లకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. స్టార్ కథానాయిక అయితే, వాటి జాబితా ఇంకాస్త పెరుగుతుంది. తినే ఆహారం నుంచి నిద్రపోయే మంచం వరకూ అన్నీ నాణ్యమైన వాటినే అందించాల్సి ఉంటుంది. అలా కొన్నిసార్లు నిర్మాతకు అదనపు భారం తప్పదు.
అలనాటి నటి శ్రీ విద్య అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె ప్రసిద్ధ గాయని ఎం.ఎల్. వసంతకుమారి కుమార్తె. ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఔట్ డోర్ షూటింగ్‌కు రాజమండ్రి దగ్గరలోని గ్రామానికి వెళ్లారు. ఉండటానికి ఏర్పాట్లు బాగానే ఉన్నా, స్నానాలు మాత్రం పక్కనే ఉన్న గోదావరి నీళ్లతో చేయాల్సి వచ్చింది. వరదల కారణంగా నీరు బురదగా ఉండటం వల్ల ఒక రకమైన కాయను అరగదీసి కలిపితే బురద కిందకు పోయి, స్వచ్ఛమైన నీరు పైకి తేలేది. నిర్మాణశాఖలోని సహాయకులు ఆ నీరే పట్టి నటీనటులకి స్నానానికి అందించేవారు.