సినీ వినీలాకాశంలో ఉదయించిన ఈ అభినయ తారక... తనదైన నటనతో యావత్ వీక్షక లోకాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది సౌందర్య. అలా చూస్తుండగానే వంద చిత్రాలు చేసేసింది. కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషా చిత్రాల్లో కనిపిస్తూ.. ఎక్కడ చూసినా సౌందర్య మానియాతో యువ హృదయాలు ఉప్పొంగిపోయేలా చేసింది. కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్ బగల్‌లో 1976, జులై 18న జన్మించిన సౌందర్య. చిత్రసీమలో అనతి కాలంలోనే విజయతారగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత భూలోకానికి వచ్చిన పని అయిపోయిందన్నట్లు.. మరెన్నటికీ తిరిగిరాని లోకాలకు తరలిపోయింది. అందుకే ఆ అభినేత్రిని తలచుకున్నప్పుడల్లా అభిమానుల గుండెలు బాధతో బరువెక్కిపోతాయి.
హెలీకాప్టర్ రూపంలో మృత్యువు
వందకు పైగా సినిమాలు చేసి.. ఇంకా చేయవలసిన చిత్రాలు, పనులు ఎన్నో ఉన్నా.. కర్కశ మృత్యు రక్కసి విమాన ప్రమాదం ద్వారా ఆమెను పొట్టన పెట్టుకుంది. ఇలాంటి ఓ వేసవిలోనే.. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. 2004, ఏప్రిల్ 17న భాజపా కోసం ప్రచారానికి సిద్దమైన విమానం కుప్ప కూలింది. ఆ ప్రమాదంలో సౌందర్యను మృత్యువు కబళించింది.
డాక్టర్ కాబోయి నటిగా మారి...
చిత్రసీమలో చాలామంది హీరోయిన్స్ తాము డాక్టర్ కాబోయి నటీమణులయ్యామని చెప్తుంటారు. సౌందర్య కూడా వైద్య విద్య చదువుతున్నప్పుడు సినిమా అవకాశాలు రావడం వల్ల... ఆ చదువును అర్ధాంతరంగా ఆపి సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె తండ్రి కేఎస్ సత్యనారాయణ కన్నడ సినిమాలకు రచయితగా, నిర్మాతగా వ్యవహరించేవారు. స్టూడియోలు, సినీ వాతావరణం ఆమెకి కొత్త కాదు. 1992లో సౌందర్య సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. మొదటి చిత్రం మాతృభాషలోనే 'గంధర్వ'లో నటించింది. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు హంసలేఖ.
అదే ఏడాది టాలీవుడ్లోకి అడుగు పెట్టింది సౌందర్య. కృష్ణ హీరోగా తెరకెక్కిన 'రైతు భారతం' చిత్రంలో నాయికగా సందడి చేసింది. ఆ తర్వాత తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లో ఆఫర్లు వరుసకట్టాయి. 12 సంవత్సరాల కాలంలో 12 సినిమాలు చేసిందీ స్వప్న సుందరి.
వెంకీ, సౌందర్య సూపర్ జోడి
వెండితెరపై విజయవంతమైన జోడీలుగా కొందరిని మాత్రమే ప్రేక్షకలోకం ఆదరిస్తుంది. నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు మాటల్లో చెప్పాలంటే... అలాంటి సూపర్ జోడీల్లో ఎన్టీఆర్, సావిత్రి.. ఏఎన్నార్, వాణిశ్రీ.. చిరంజీవి, విజయశాంతి.. వెంకటేష్, సౌందర్య ఉన్నారు. వెంకీ, సౌందర్య కాంబినేషన్‌లో అనేక సినిమాలు వెండితెరపై సంచలనం సృష్టించాయి. వాటిలో 'రాజా', 'జయం మనదేరా', 'పెళ్లి చేసుకుందాం', 'పవిత్ర బంధం', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'దేవి పుత్రుడు' వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. కృష్ణతో 'రైతు భారతం' చిత్రం ద్వారా తెలుగులోకి ప్రవేశించిన సౌందర్య.. ఆయనతో 'అమ్మ దొంగ', 'జగదేకవీరుడు' సినిమాల్లో ఆడిపాడింది.