కథానాయికల అందంలో చాలా మార్పులొస్తుంటాయి. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో ఒకలా ఉంటారు. ఐదారేళ్ల తర్వాత చూస్తే మరోలా కనిపిస్తారు. ఇంకొన్నేళ్లు పోతే గుర్తుపట్టలేనంతగా తయారవుతారు. అందాల తార శిల్పాశెట్టి మాత్రం తొలి రోజుల్లో ఎలా కనిపించిందో... ఇప్పటికీ అదే రూపంతో కట్టిపడేస్తోంది. అమ్మ అయినా ఆమె అందంలో ఏ మాత్రం మార్పులేదు. నవతరం హీరోయిన్లకు సైతం పోటీనిచ్చేలా తన అందాన్ని కాపాడుకుంటోంది. 'సాహసవీరుడు సాగరకన్య'తో తొలిసారి తెలుగు తెరపై కనిపించి, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో నిర్మాతగా, టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ జీవితాన్ని బిజీ బిజీగా గడుపుతోంది. ఈరోజు 46వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శిల్పాశెట్టి ప్రస్థానం గురించి కొన్ని విషయాలు.
కన్నడ కస్తూరి..
మంగళూరులోని సంప్రదాయ కుటుంబంలో 1974 జూన్ 8న జన్మించింది శిల్పాశెట్టి. సురేంద్ర, సునంద శెట్టి తల్లిదండ్రులు. ఔషదాల తయారీ కంపెనీ ఉండటం వల్ల కుటుంబమంతా ముంబయికి వచ్చి స్థిరపడ్డారు. అక్కడి సెయింట్ ఆంథోనీ గర్ల్స్ హైస్కూల్, పోడార్ కళాశాలలో చదువులు పూర్తి చేసింది. చిన్నప్పుడే భరతనాట్యంపై పట్టు పెంచుకోవడం సహా కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించింది. దీనితో పాటే పాఠశాలలో వాలీబాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. నటి షమితాశెట్టి శిల్పాకి స్వయానా చెల్లెలు. ఇద్దరూ కలిసి 'ఫారేబ్'లో నటించారు.
పదహారేళ్లకే..
కళాశాలలో చదువుకొంటున్నప్పుడు మోడలింగ్‌పై దృష్టిపెట్టిన శిల్పాశెట్టి... పదహారేళ్ల వయసులో ప్రముఖ వాణిజ్య సంస్థ కోసం కొన్ని ప్రకటనల్లో నటించింది. రెండేళ్ల తర్వాత 'బాజీఘర్'లో అవకాశాన్ని దక్కించుకుంది. అందులోని కీలక పాత్రలో కనిపించిన శిల్పాశెట్టికి చక్కటి గుర్తింపు లభించింది. ఉత్తమ సహాయనటిగా పలు అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'ఆగ్'లో పూర్తిస్థాయి కథానాయికగా నటించి పేరు తెచ్చుకుంది. 'మై ఖలాడీ తు అనారి' చిత్రంలో అక్షయ్‌కుమార్ సరసన నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. 'ఆవో ప్యార్ కరే', 'హత్‌కడి' తదితర చిత్రాల్లో నటించి హీరోయిన్గా తన స్థానం సుస్థిరం చేసుకుంది.
బిగ్ బ్రదర్‌తో..
ఇంగ్లాండ్‌లో బిగ్ బ్రదర్ సెలబ్రిటీ రియాలిటీ షోలో పాల్గొనడం వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులో గెలుపొంది భారీ మొత్తంలో నగదు బహుమతిని సొంతం చేసుకుందీ భామ. అయితే ఆ షోలో ఆమెపై జేడ్‌గూడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ ఎపిసోడ్‌లో ప్రపంచం మొత్తం శిల్పకు అండగా నిలిచింది. దీంతో షోలో 63 శాతం ఓట్లతో ఆమె గెలుపొందింది.
నటనలోనూ...
అందంతో తొలి అడుగుల్లోనే అందరినీ కట్టిపడేసింది శిల్పాశెట్టి. అయితే ఆ అందంపై ఎంతోకాలం ఆధారపడలేదు. మధ్యలో నటిగానూ ప్రతిభను చూపించే ప్రయత్నం చేసింది. 'థడ్‌కన్', 'రిస్తే', 'ఫిర్ మిలింగే', 'గర్వ్', 'లైఫ్ ఇన్ మెట్రో' తదితర చిత్రాల్లో చక్కటి నటనను కనబరిచింది. 'ఫిర్ మిలింగే'లో ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన యువతిగా నటించి ప్రశంసలు దక్కించుకుంది. హిందీలోనే కాకుండా... దక్షిణాది చిత్రల్లోనూ అవకాశాల్ని అందిపుచ్చుకుంది. తెలుగులో 'సాహసవీరుడు సాగరకన్య', 'వీడెవడండి బాబూ', 'భలేవాడివి బాసూ', 'ఆజాద్' తదితర చిత్రాల్లో నటించింది. తమిళంలో చేసిన 'మిస్టర్ రోమియో' శిల్పకు మంచి పేరు తీసుకొచ్చింది. అన్ని భాషల్లో కలిపి మొత్తం 40 చిత్రాలు చేసింది.