Saipallavi about her roles: సాయిపల్లవి.. ఓవైపు నటనా ప్రాధాన్యమున్న పాత్రలు.. మరోవైపు కమర్షియల్ కథలు.. రెండిటినీ సమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వరుస విజయాలతో కెరీర్‌ను పరుగులు పెట్టిస్తోంది ఈ మలయాళీ అందం. ఇన్నేళ్ల కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో అలరించిన ఆమె.. నటిగా తనకెలాంటి పాత్రలు ఒత్తిడిగా అనిపిస్తాయో పంచుకుంది.
"వర్తమాన సమాజంలో కనిపించే పాత్రలతో పోల్చితే.. గత కాలానికి సంబంధించిన పాత్రలే కాస్త ఎక్కువ సౌకర్యవంతంగా అనిపిస్తుంటాయి. రోజు వారీ జీవితాల్లో కనిపించే పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు.. వాటిని ఎంత విభిన్నంగా చేయాలి అని ఆలోచిస్తుంటాం. అది వ్యక్తిగతంగా మనపై ఓ తెలియని ఒత్తిడిని కలిగిస్తుంటుంది. అదే మనకు పరిచయం లేని కాలానికి సంబంధించిన పాత్రలు పోషిస్తున్నప్పుడు.. వాటిని ఎలా చేయాలన్న విషయంలో కాస్త స్వేచ్ఛ ఉంటుంది. కథలో పాత్రను తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి.. ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? ఆ సమయంలో ఆ పాత్ర ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? అన్నది ఊహించుకుంటూ దాన్ని మనదైన శైలిలో చూపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇలాంటి పాత్రలు తేలికగా అనిపిస్తాయి" అని చెప్పుకొచ్చింది.