చూడగానే మన పక్కింటి అమ్మాయిలా, తనదైన అల్లరితో సందడి చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది సాయిపల్లవి. ఆకట్టుకొనే అందం, అందుకు తగ్గ అభినయమున్న ఇలాంటి అమ్మాయి చిత్రపరిశ్రమలో ఒక్కటే పీస్ అన్నంతగా కుర్రకారుకు మనసులను దోచేసింది. ఈ ముద్దుగుమ్మ 2015లో మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో అరంగేట్రం చేసింది. టాలీవుడ్లోకి 'ఫిధా'తో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఆ తర్వాత 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'కణం', 'పడి పడి లేచే మనసు'తో వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నేడు(మే 9) సాయిపల్లవి పుట్టినరోజు ఈ సందర్భంగా.. మిలియన్ వ్యూస్ సాధించిన సాయిపల్లవి పాటల విశేషాలు మీకోసం.
నటనలోనే కాదు డ్యాన్స్‌లోనూ
దక్షిణాది హీరోయిన్లలో నటనతోనే కాకుండా డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంటుంది సాయిపల్లవి. నెట్టింట్లో ఆమె పాటలు, ఫొటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఆమె పాటలు యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్నాయి.
'మలర్' సూపర్!
సాయిపల్లవి నటించిన తొలి సినిమా 'ప్రేమమ్'. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. అందులో 'మలరే..' అంటూ సాగే గీతంతో సాయిపల్లవి పాపులర్ అయిపోయింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు.
మెల్లగా వచ్చింది.. రికార్డు బద్దలు కొట్టింది
'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి మరోసారి ఆకట్టుకుంది. నటనతో పాటు చిత్రంలోని 'వచ్చిండే.. మెల్ల మెల్లగా వచ్చిండే..' అనే గీతంతో యూట్యూబ్ రికార్డులను సృష్టించింది. దక్షిణాదిలో అత్యధికులు చూసిన పాటగా రికార్డు సాధించింది. ప్రస్తుతం ఇది 300 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది.
'రౌడీ బేబీ' క్రేజ్
ధనుష్‌తో కలిసి 'మారి-2'లో నటించింది సాయిపల్లవి. ఇందులోని 'రౌడీ బేబీ' పాటతో కుర్రకారును కుదురుగా కూర్చోనివ్వకుండా చేసింది. మరోసారి తన రికార్డును తానే తిరగరాసింది. కేవలం 16 రోజుల్లోనే 100 మిలియన్ వీక్షణలు దాటిందీ గీతం. ప్రస్తుతం 1 బిలియన్(114 కోట్ల)కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.
'సారంగదరియా' సంచలనం
సాయిపల్లవి 'సారంగ దరియా' పాట అరుదైన ఘనత సాధించింది. టాలీవుడ్లో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ అందుకున్న తొలి గీతంగా నిలిచింది. విడుదలైన 14 రోజుల్లోనే ఈ మార్క్‌ను చేరింది. ప్రస్తుతం ఈ పాటకు యూట్యూబ్‌లో 177 మిలియన్ వ్యూస్ దక్కాయి.
సాయిపల్లవి.. ప్రస్తుతం 'లవ్‌స్టోరి', 'విరాటపర్వం' అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో థియేటర్లు మూసేసిన కారణంగా ఈ సినిమాల విడుదలలు ఆగిపోయాయి.
ఇదీ చూడండి:అమ్మ కోసం అక్షరాలే అలంకారాలైతే!