Actress Roja home tour: సినీ తారలు ఎలాంటి ఇంట్లో ఉంటారు? ఏఏ వస్తువుల్ని ఇష్టపడతారు? వారింట్లో ఎలాంటి ఫర్నిచర్ ఉంటుంది? అని చాలామంది అభిమానులు ఆరా తీస్తుంటారు. తమ అభిమాన నటుల వ్యక్తిగత విషయాలపై ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి అభిమానుల కోసమే తమ ఇంటి విశేషాల్ని నటులు 'హోంటూర్' పేరిట పంచుకుంటున్నారు. ఇప్పటికే ఎందరో నటులు హోంటూర్లతో అలరించారు. అయితే, ఇవి సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి. ప్రముఖ నటి రోజా హోంటూర్ మాత్రం బుల్లితెరపైకి వచ్చింది. టీవీ ఛానల్‌లో హోంటూర్ ప్రసారం కావటం ఇదే తొలిసారి.
'ఈటీవీ' వేదికగా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే కార్యక్రమం 'జబర్దస్త్'. ఈ షోకి రోజా న్యాయనిర్ణీతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్‌ల కామెడీకి మార్కులు వేయటమే కాకుండా తానూ పంచ్‌లు విసిరి నవ్విస్తుంటారు. అలాంటి ఆమెతో ఓ స్కిట్ చేస్తే? అదీ వాళ్లింట్లోనే అయితే? ఈ వినూత్న ప్రయత్నమే చేశాడు హైపర్ ఆది. తన బృంద సభ్యులతో కలిసి నగరిలోని రోజా ఇంటికి వెళ్లాడు. ఎప్పటిలానే కితకితలు పెట్టాడు. తమ ఇంటి విశేషాలు చెప్తూనే రోజా.. ఆదిపై సెటైర్లు వేశారు. మహేశ్ బాబుతో కలిసి నటించాలనుందని తన మనసులో మాట బయటపెట్టారు. తమ ఇంటి ఫర్నీచర్, డైనింగ్ హాల్, పూజగది, వంటగది, ఫొటో గ్యాలరీ, తన కూతురు రాసిన పుస్తకాన్ని ప్రేక్షకులకి పరిచయం చేశారు. ఎంతో ప్రేమతో నిర్మించుకున్న రోజా ఇల్లు చూస్తే వావ్ అనాల్సిందే మరి! బుల్లితెరపై గురువారం టెలీకాస్ట్ అయిన ఈ ఎపిసోడ్ ప్రస్తుతం నెట్టింట కనువిందు చేస్తోంది.