ఏదో అవ్వాలనుకొని అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన కథానాయకులెంతమందో. ప్రముఖ నటి రేణూ దేశాయ్ కూడా తాను కలలు కన్న ప్రపంచం విడిచి.. రంగుల లోకంలోకి అలాగే అడుగుపెట్టారు. శాస్త్రవేత్త, న్యూరోసర్జన్ కావాలనేది రేణూ చిన్నప్పటి లక్ష్యం. కానీ పలు కారణాల వల్ల ఆమె తన 16వ ఏటనే నటించడం మొదలుపెట్టారు.
1995 సెప్టెంబరు 9న తొలిసారి కెమెరా ముందుకొచ్చారు రేణూ దేశాయ్. పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా.. బుధవారం తన మనసులో మాట అభిమానులతో పంచుకున్నారామె.
"నాసాలో శాస్త్రవేత్త అవ్వాలనుకున్న లక్ష్యం వదులుకొని పదహారేళ్లకే ఇటువైపు అడుగులు వేశాను. చాలా కాలం బాధపడ్డాను. షూటింగ్స్ ఆ బాధని పోగొట్టాయి. ఫిల్మ్ మేకింగ్‌ని ఇష్టపడ్డాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. మీ మనసుని నమ్మండి, నిజాయతీగా కష్టపడి పనిచేయండి. కచ్చితంగా విజయం సాధిస్తారు"
-- రేణూ దేశాయ్, సినీ నటి.