ఎన్నో హృదయాల్లో నిదురించిన చెలి. ఎందరో కలలలో కవ్వించిన సఖి. బాలనటిగా ప్రవేశించి అందాల భామగా సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన రాజశ్రీ ఆరోజుల్లో ఎంతో పాపులర్. ఆమె అభినయం అమోఘం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు 300 పైగా సినిమాల్లో నటించిన గొప్ప నటి. ఒక్కరోజు కూడా షూటింగ్‌కు సెలవు పెట్టని మేటి నటి ఆమె అని చెబుతారు. ఆనాటినుంచి ఈనాటి వరకూ రాజశ్రీని మించిన అందమైన డాన్సర్ లేదని సినిమా వర్గాలు చెప్పుకుంటాయి. నృత్యం అంటే పిచ్చి ప్రేమ. అదే ఆమెకు సినిమా అవకాశాలను మోసుకొచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో డ్రామా వేస్తే కృష్ణుడిగా, మేనకగా ద్విపాత్రాభినయం చేశారు.
అది 1956వ సంవత్సరం. ఆరోజు తన జీవితాన్ని మలుపుతిప్పే రోజు అని తెలియదు. చెన్నైలో ఉంటున్న రాజశ్రీ ఇంటికి వాళ్ల ఊరి నుంచి బంధువులొస్తే ఏవీఎం స్టూడియోలో సినిమా షూటింగ్ చూడటం కోసం వెళ్లారు. అపుడు తన వయసు పదేళ్లు. తలబిరుసు పాత్రలకు తలకట్టు లాంటి అగ్రనటి జమున అక్కడ కూర్చుని ఉన్నారు. పక‌్కనే సెలక్షన్స్ జరుగుతున్నాయి. దండాయుధపాణి అనే డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు చెట్టియార్ కూర్చుని పిల్లల చేత డ్యాన్స్ చేయిస్తూ సెలెక్షన్స్ చేస్తున్నారు. సెలక్షన్స్ కోసం అని అక్కడికి రాకపోయినా ఊరికే స్టూడియో చూట్టానికి వచ్చిన రాజశ్రీని నటి జమున గమనించి ఈ పిల్ల బాగుంటుంది అని అక్కడ స్టాఫ్‌కు చూపించారు. అంతే అలా సెట్‌లోకి తొలిసారి అడుగు పెట్టారు. శివాలయం సెట్‌లో శివలింగం ముందు డ్యాన్స్ చేయడం రాజశ్రీ తొలి పాత్ర. ఆ సినిమా పేరు 'నాగదేవతై'. మొదట ఇంట్లో ఆమె తల్లి ఒప్పుకోకపోయినా "కేవలం 'చిన్న బిట్.. శివుడి దగ్గర డ్యాన్స్' అని చెబితే ఒప్పుకొన్నారు. ఆ తర్వాత పర్మినెంట్ ఆర్టిస్ట్‌గా బుక్ చేశారు. అలా ఏవీఎం సంస్థ మూడేళ్లు అగ్రిమెంట్ తీసుకుని ఆమెకు అవకాశం కల్పించారు. అప్పట్లో ఏవీఎం సంస్థలో అవకాశం రావటం గొప్పగా చెప్పుకునేవారు.
నాగుల చవితి తర్వాత భక్త అంబరీష, మాంగల్యం తదితర చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా రాణించారు. 1960లో విడుదలైన నిత్య కళ్యాణం పచ్చ తోరణం సమాజంలో ఉన్న కులవ్యవస్థపై సంధించిన సందేశాత్మక చిత్రం. ఈ సినిమా ద్వారా రామకృష్ణ నటుడిగా పరిచయమయ్యారు. ఆయన సరసన హీరోయిన్‌గా షీలా పాత్రలో రాజశ్రీ నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎల్వీ ప్రసాద్.. తన ప్రసాద్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మించారు. ఇదే చిత్రాన్ని 'దాదీమా'గా హిందీలో నిర్మించారు. అలనాటి బాలీవుడ్ దిగ్గజాలు అశోక్‌కుమార్, బీనారాయ్, రెహమాన్, తనూజ నటీనటులుగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. నిజం చెప్పాలంటే 1962 రాజశ్రీకి ఎంతో అచ్చొచ్చిన సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఏడాదే.. భార్య అనే మళయాళ మూవీతో హీరోయిన్‌గా మెరిశారు. ఆ సినిమాలో ఆమె పేరు గ్రేసీ కావడం, అది హిట్ అవ్వడం వల్ల మళయాళ ప్రేక్షకులకు గ్రేసీగానే రాజశ్రీ గుర్తుండిపోయారు.
కానిస్టేబుల్ కూతురు మూవీతో తెలుగులో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇదే 1962లో రాజశ్రీకి తన అభిమాన నటుడు, విశ్వవిఖ్యాతుడు ఎన్టీఆర్ సినిమాలో తొలిసారి నటించే అవకాశం రావటంతో ఆనందానికి అవధుల్లేవు. ఎన్టీఆర్ శివుడు పాత్రలో కైలాసంలో ప్రళయ తాండవం చేసినప్పుడు ఆయనను తొలిసారి చూసిన దృశ్యం ఇంకా మరిచిపోలేను అని, శివుడు వచ్చి నాట్యం చేస్తున్న భావన కలిగిందని రాజశ్రీ అందరితో అనేవారు.
ప్రపంచంలో అత్యధికంగా జానపద చిత్రాల్లో కథానాయకునిగా నటించిన ఘనత ఎన్టీఆర్‌దే. చిన్నప్పటి నుంచి చందమామ కథలు చదువుతూ జానపద చిత్రాలను అమితంగా ఇష్టపడిన రాజశ్రీ అనుకోకుండా నటిగా మారి అనేక జానపదాల్లో ప్రేక్షకులను మురిపించారు. అదే 1962లో అదృష్టం ఆరాధన సినిమా రూపంలో అక్కినేని సరసన నటించే అవకాశానికి తలుపులు తీసింది. వి ఫర్ విక్టరీగా పిలుచుకునే వి.మధుసూదనరావు దర్శకత్వంలో వి.బి. రాజేంద్రప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం బెంగాలీ నవల సాగరిక ఆధారంగా రూపొందింది. సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పన చేసిన "నా హృదయంలో నిదురించే చెలీ కలలోనే కవ్వించే సఖీ" పాట తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆల్‌టైమ్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. శ్రీశ్రీ రాసిన ఈ పాటకు ఘంటశాల గాత్రం అందించారు. ఏఎన్‌ఆర్ సంగీత వాయిద్యాన్ని మీటుతూ పాడుతుంటే ఆకాశం నుంచి అందాల తార ఒకటి నెమ్మదిగా కిందకి జారుతున్నట్టు మేడపై నుంచి ఒక్కో మెట్టు దిగుతూ రాజశ్రీ కేవలం అభినయంతోనే ఆకట్టుకుంది.