"ఫలానా పాత్రలే చేయాలి అని ప్రత్యేకంగా పరిమితులేం పెట్టుకోలేదు. మంచి కథల్లో భాగమవ్వాలి.. నటిగా ప్రేక్షకుల మదిలో కలకాలం గుర్తుండిపోవాలి. అదే నా లక్ష్యం" అంటోంది హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్. 'టాక్సీవాలా' చిత్రంతో సినీప్రియుల హృదయాల్ని కొల్లగొట్టిన తెలుగు సోయగం ఆమె. కాస్త విరామం తర్వాత ఇప్పుడు వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే 'ఈనాడు సినిమా' ఆమెను పలకరించగా ఆసక్తికర విషయాలు చెప్పింది.
'టాక్సీవాలా' హిట్‌తో తెలుగు తెరపైకి దూసుకొచ్చారు. తర్వాత వేగం పెంచలేకపోయారెందుకు?
మూడేళ్లుగా తెరపై కనిపించకపోవచ్చు కానీ.. నేను ఏరోజు ఖాళీగా లేను. ఏదోక సినిమాతో సెట్స్‌పై బిజీగానే ఉంటున్నా. 'టాక్సీవాలా' విడుదలకాక ముందు నుంచే చాలా ఆఫర్లు వచ్చాయి. పాతికకు పైగా స్క్రిప్ట్‌లు విన్నా. వాటిలో 'గమనం' కథ నచ్చడం వల్ల దానికి ఓకే చెప్పా. ఆ సినిమా 2019లోనే సెట్స్‌పైకి వెళ్లింది. వెంటనే 'ఎస్.ఆర్.కల్యాణమండపం' చేశా. ఈ రెండు గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా.. కొవిడ్ పరిస్థితుల వల్ల ఆలస్యమయ్యాయి. ఈలోపు 'తిమ్మరుసు' చిత్రం పూర్తి చేశా. ఇవన్నీ ఈ ఏడాదిలో వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తాయి. నాకు తెలిసి ఇకపై గ్యాప్ కనిపించకపోవచ్చనే అనుకుంటున్నా.
మునుపటితో పోల్చితే చాలా నాజుగ్గా తయారయ్యారు. ఏదైనా పాత్ర కోసమా?
వ్యక్తిగత ఆరోగ్యాన్ని.. సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రయత్నించా. 'టాక్సీవాలా' తర్వాత నేను చాలా లావై పోయా. థైరాయిడ్ సమస్యతో పాటు హార్మోన్ల అసమతౌల్యం వల్ల నేను అనారోగ్యానికి గురయ్యా అన్న సంగతి గుర్తించలేకపోయా. ఒకానొక సమయంలో ముఖమంతా మొటిమలు విపరీతంగా వచ్చేశాయి. దాంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే.. నాకున్న సమస్యలన్నీ బయటకొచ్చాయి. అప్పుడు చాలా భయపడ్డా. తర్వాత నా జీవన శైలిని పూర్తిగా మార్చుకోవాలని బలంగా నిర్ణయించుకున్నా. వ్యాయామాలు, యోగా చేయడం ప్రారంభించా. ప్రత్యేక డైట్ తీసుకోవడం మొదలు పెట్టా. ఇంట్లోనే రకరకాల కసరత్తులు చేసి మళ్లీ ఇలా ఫిట్‌గా మారా.
త్వరలో 'తిమ్మరుసు'తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కథేంటి? మీ పాత్ర ఎలా ఉండనుంది?