తన జీవితం ప్రమాదంలో ఉందని బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ అన్నారు. తనకు 'వై' లెవల్ సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని పాయల్ ఇటీవలే ఆరోపణలు చేశారు. చాలా ఏళ్ల క్రితం ఆయన్ను కలిసినప్పుడు అసౌకర్యానికి గురైనట్లు చెప్పిన ఆమె వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. "అనురాగ్ అలాంటి వ్యక్తి కాదంటూ.." అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల అనురాగ్‌పై పాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తానని హెచ్చరించారు.
'నా ప్రాణాలకు హాని ఉంది.. భద్రత కల్పించండి' - భద్రత కోరిన పాయల్ ఘోష్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఇటీవలే లైంగిక ఆరోపణలు చేసిన నటి పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. తన ప్రాణాలకు ప్రమాదముందని.. తనకు 'వై' స్థాయి భద్రతను కల్పించమని గవర్నర్‌ను ఆమె కోరారు.
ఈ నేపథ్యంలో మంగళవారం పాయల్ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిసి, భద్రత కల్పించమని కోరారు. తన తరఫు న్యాయవాది నితిన్, రాజ్యసభ సభ్యుడు రామ్‌దాస్ అత్‌వాలేతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన జీవితానికి ప్రమాదం ఉందని వివరిస్తూ.. పాయల్ గవర్నర్‌కు లేఖ అందించారు. ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోల్ని ట్విటర్‌లో షేర్ చేస్తూ.. "గౌరవనీయులైన భగత్ సింగ్ కోశ్యారీని కలిశా. ఆయన నాకు మద్దతు తెలిపారు. ఇది సాధ్యం కాదని కొందరు అన్నారు.. కానీ నన్ను ఎవరూ ఆపలేరు" అని ట్వీట్ చేశారు పాయల్ ఘోష్.
పాయల్ కేసు నేపథ్యంలో ముంబయి పోలీసులు ఇటీవల అనురాగ్‌కు సమన్లు జారీ చేశారు. త్వరలోనే ఆయన కేసు విచారణకు హాజరు కాబోతున్నారు. మరోవైపు అనురాగ్‌ను ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదని పాయల్ ముంబయి పోలీసుల్ని ప్రశ్నించారు.