తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీసాగరంలో పడిలేచిన కెరటమే ఈ నయనతార - actress Nayanthara latest news

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ నయనతార. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ దక్షిణాధిన అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటీమణి నయన్​. ఈ లేడీ సూపర్​స్టార్​ ఇవాళ మరో కొత్త వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..

Nayanthara birthday special story
సినీసాగరంలో పడిలేచిన కెరటమే ఈ నయనతార

By

Published : Nov 18, 2020, 12:44 PM IST

మూడు పదుల వయసులోనూ అందరూ మెచ్చిన తళుకు తార.. నయనతార. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేయడం ఆమె ప్రత్యేకత. అగ్ర కథానాయకులు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా.. కేవలం కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం ఆమె స్టైల్‌. చీరకట్టులో సంప్రదాయంగా కనిపించి.. స్విమ్‌ సూట్‌లో అదరహో అనిపించుకోవడం ఆమెకే సాధ్యమైంది.

తొలినాళ్లలో తెలియక తప్పటడుగులు వేసిన ఈ భామ వివాదాలు, వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకున్నారు. వాటి నుంచి తేరుకొని వరుస చిత్రాలు, విజయాలతో దూసుకుపోతూ.. లేడీ సూపర్‌స్టార్‌గా మారారు. నవంబరు 18న నయన్‌ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాల్ని ఓ సారి చూద్దాం..

నయనతార

చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కావాలని..

నయనతార బెంగళూరులో జన్మించారు. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్‌. తల్లిదండ్రులు కురియన్‌ కొడియట్టు, ఓమన్‌ కురియన్‌. వీరి స్వస్థలం కేరళ. నయన్‌ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. దీంతో నయన్‌ బాల్యం ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో గడిచింది. కేరళలో ఇంగ్లీషు లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారు. సినిమాల్లోకి రాకపోతే చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అవ్వాలనేది నయన్‌ కోరికట. కళాశాలలో చదువుతున్న రోజుల్లో నయన్‌ మోడలింగ్‌ చేశారు. ఆపై టీవీ యాంకర్‌గా కెరీర్‌ పనిచేశారు.

తల్లిదండ్రులతో నయనతార

ఒక్క చిత్రం అనుకుని..

ఈ క్రమంలో నయన్‌ను మలయాళ దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ చూశారు. 'మనస్సినక్కరే' (2003) సినిమాలో కీలకపాత్ర చేయమని అడిగారు. సినిమాలంటే ఇష్టం లేని నయన్‌ తొలుత ఆయన ఆఫర్‌ను తిరస్కరించారు. ఆపై నచ్చజెప్పడం వల్ల ఆలోచించి.. ఈ ఒక్క సినిమానే చేస్తా అని షరతు పెట్టారు. జయరాంతో కలిసి ఆమె నటించిన తొలి సినిమా విడుదలై, మంచి వసూళ్లు రాబట్టింది. ఫలితంగా వరుస ఆఫర్లు నయన్‌ వెంటపడ్డాయి. అలా కేవలం రెండేళ్లలో ఆమె ఎనిమిది సినిమాల్లో నటించారు.

నయనతార

తెలుగు తెరకు..

2005లో వచ్చిన 'చంద్రముఖి', 'గజినీ' సినిమాలు నయన్‌కు ఎంతో పేరు తీసుకువచ్చాయి. 2006లో ఆమె తెలుగుతెరకు పరిచయం అయ్యారు. విక్టరీ వెంకటేశ్​ సరసన 'లక్ష్మీ' సినిమాలో సందడి చేశారు. ఆ తర్వాత 'బాస్‌', 'యోగి', 'దుబాయ్‌ శ్రీను', 'తులసి' తదితర సినిమాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఓ హోదాను ఇవ్వలేపోయాయి.

అందాల భామ నయనతార

ఆపై దూకుడు..

2010లో నయన్‌ సినీ జీవితం మలుపు తిరిగింది. చక్కటి కథలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. 'అదుర్స్‌', 'సింహా', 'శ్రీరామ రాజ్యం', 'అనామిక'తో పాటు పలు తమిళ సినిమాలతో హిట్లు అందుకున్నారు. 'శ్రీరామ రాజ్యం' కోసం సీతగా మారి నంది అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాదు అనేక కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనూ నటించి లేడీ సూపర్‌స్టార్‌ అనిపించుకున్నారు. 'డోరా', 'ఐరా', 'కర్తవ్యం' తదితర లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఎదిగారు. ఈ సినిమాలు హిట్లు అందుకోవడమే కాదు.. బాక్సాఫీసు వసూళ్లు కూడా రాబట్టాయి. తాజాగా ఆమె నటించిన 'అమ్మోరు తల్లి' దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది!

నయనతార ఫ్యాన్​ మేడ్​ పోస్టర్​

సక్సెస్‌ వెనుక..

దాదాపు 17 ఏళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. మీ సక్సెస్ రహస్యం ఏంటి? అని నయన్‌ను ప్రశ్నించగా.. 'పెద్ద రహస్యం అంటూ ఏమీ లేదు. అదృష్టం కలిసి వచ్చింది అంతే. అసలు నాకన్నా అందగత్తెలు, బాగా నటించేవారు చాలా మందే ఉన్నారు. వారికిలేని అదృష్టం నాకు ఉంది అంతే. దీంతోపాటు కష్టపడి పనిచేయడం నాకు కలిసి వచ్చింది. అదృష్టం ఉంది కదాని పనిచేయడం మానేస్తే సినిమాలు ఉండవు. కష్టపడితే ఫలితం దక్కుతుందని నమ్ముతా. అదే నా విజయ రహస్యం. టైమ్‌ బాగుంటే అంతా బాగుంటుంది. ప్రస్తుతం నా టైమ్‌ బాగుంది' అన్నారామె.

నయనతార

తెలిసీ తెలియక..

'మొదట్లో కొన్ని సినిమాలు మొహమాటానికి చేయవలసి వచ్చింది. కథ అంత బాగా లేదని అర్థమైనా కూడా చేశాను. అపజయాల్ని మూటకట్టుకున్నాను. ఇప్పుడు మాత్రం ఆ మొహమాటాలు పెట్టుకోదలచుకోలేదు. కథ నచ్చితే పారితోషికం తక్కువ ఇచ్చినా ఒప్పుకుంటాను. కానీ నచ్చకపోతే ఎంత ఇచ్చినా తీసుకోను' అని ఓ సందర్భంలో నయన్‌ చెప్పారు.

నయనతార

షాక్‌ ఇచ్చారు..

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నటనకు దూరం అవుతున్నానంటూ 2010లో నయన్ ప్రకటించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని.. తిరిగి నటిగా నిలదొక్కుకున్నారు. 'మనం కాదు.. సినిమా మాట్లాడాలి' అంటూ ప్రమోషన్లకూ దూరంగా ఉంటుంటారామె.

నయనతార

ప్రేమ గాయాలను తట్టుకుని..

రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని నయన్‌ స్వయంగా చెప్పి మరోసారి షాక్‌ ఇచ్చారు. 'నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఆ ఇద్దరికీ నాకూ మధ్య అపార్థాలు వచ్చాయి. వాటి కారణంగా ఒకరిమీద ఒకరికి నమ్మకం పోయింది. అలాంటి పరిస్థితుల్లో విడిగా ఉంటేనే మంచిది అనుకున్నాం. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఎంత కష్టం అయినా పడతాను. అలాంటిది నా ప్రేమ ఫెయిల్‌ అయినప్పుడు ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డా. ఆ సమయంలో సినిమాలే నన్ను తిరిగి మనిషిని చేశాయి. నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి' అని నయన్‌ అన్నారు.

నయనతార

కెరీర్‌ ఆరంభంలో నయన్‌ కథానాయకుడు శింబును ప్రేమించినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయనతో విడిపోయారు. తర్వాత ప్రభుదేవాకు దగ్గరయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకూ దూరమయ్యారు. గత కొన్నేళ్లుగా దర్శకుడు విఘ్నేశ్‌తో ఆమె ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం. కెరీర్‌ పరంగా సాధించాల్సింది చాలా ఉందని.. లక్ష్యాల్ని చేరుకున్న తర్వాత వివాహం చేసుకోవాలనుకుంటున్నామని ఇటీవల విఘ్నేశ్‌ అన్నారు. మరి నయన్‌ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారో ఆమే స్వయంగా చెప్పాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details