చిన్నప్పటి నుంచీ హీరోయిన్ కావాలని కల కనేదాన్ని. కానీ నాన్న చార్టెడ్ అకౌంటెంట్, అమ్మ ప్రొఫెసర్ కావడంతో చదువై పోయాకే సినిమాలని చెప్పారు. దాంతో ఇంజినీరింగ్ చదువుతూనే మోడలింగ్ చేసేదాన్ని. తరవాత ముంబయి వెళ్లి సినిమా ప్రయత్నాలు చేయాలనులకున్నా. అప్పుడు కూడా ఇంట్లోవాళ్లు జీమ్యాట్ పరీక్ష రాయమంటూ షరతు పెట్టారు. ఎందుకంటే... అందులో మంచి మార్కులు వస్తే అయిదేళ్లలోపు ఎప్పుడైనా చదువుకోచ్చనేది వాళ్ల ఆలోచన. సరేనని ముంబయి వచ్చి నా లక్కును పరీక్షించుకున్నా. అప్పుడే ‘1-నేనొక్కడినే’లో అవకాశం వచ్చింది. అదయ్యాక హిందీ సినిమా. ఆ రెండింటి తరువాత దొరికిన విరామంలో అమ్మానాన్నలకు మాటిచ్చినట్లుగా ఆ పరీక్ష రాశా. మంచి స్కోరు వచ్చింది. అయినా నాకు ఆ తరువాత చదువుకునే అవకాశం రాలేదనుకోండీ.
మహేష్‌బాబుకి ఎంత సహనమో!
నా మొదటి సినిమా మొదటి సీన్‌ని గోవాలో తీశారు. షూటింగ్ ప్రారంభించిన రోజే నేను సెట్‌కి ఆలస్యంగా వెళ్లా. అప్పటికే మహేష్‌బాబు వచ్చేసి సీన్‌పేపర్లను చూసుకుంటున్నాడు. నాకు ఏదో తప్పు చేసినట్లుగా అనిపించింది. ఆ టెన్షన్‌లో నేను ఎక్కువ టేకులు తీసుకున్నా... మషేష్ ఏమాత్రం చిరాకు పడకుండా నాతో ఆ సీన్లను మళ్లీమళ్లీ చేయించాడు. ఈ సూపర్‌స్టార్‌కు ఎంత సహనమో అనుకున్నా.
ఒంటరితనం భరించలేకపోయా!
మా నాన్న ఉద్యోగరీత్యా కొన్నిరోజులు ముంబయిలోనూ పనిచేశారు. సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆయనతోనే ఉండేదాన్ని. అయితే కొన్నాళ్లకు ఆయన ఇంటికెళ్లిపోవడంతో నేను ఒంటరిని అయిపోయాననే భావన మొదలైంది. దాంతో అమ్మకి తరచూ ఫోన్ చేసి ఏడ్చేదాన్ని.
చాక్లెట్లు చేయగలను..
ముందు నుంచీ నేను ఫుడీనే. నాకు ఎక్కువగా చాక్లెట్లూ, చీజ్‌కేకులూ, కస్టర్డ్, మూంగ్‌దాల్ హల్వా అంటే ఇష్టం. అవి ఎదురుగా ఉన్నాయంటే డైటింగ్ విషయాన్ని పక్కన పెట్టేస్తా. ‘రాబ్తా’ అనే హిందీ సినిమాలో చాక్లెట్‌షాప్ ఓనర్‌గా నటించా. అందులో సహజంగా కనిపించేందుకు చాక్లెట్ల తయారీలో శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు ఎన్నిరకాల చాక్లెట్లనయినా సులువుగా చేయగలను.
కొన్నిసార్లు బాధపడతా..
ఎలాంటి విమర్శల్నీ పట్టించుకోను కానీ కొన్నిసార్లు నాకు సంబంధం లేని విషయాలను సామాజిక మాధ్యమాల్లో చదివినప్పుడు మనసు చివుక్కుమంటుంది. కాకపోతే, కాసేపటికే మామూలైపోతా. ట్రోల్స్ లాంటివాటిని మాత్రం అసలు పట్టించుకోను.