పెళ్లి తర్వాతా తన జోరు తగ్గదని చెప్పకనే చెబుతోంది అందాల చందమామ కాజల్. ఆమె ఒక పక్క ఇంటిని చక్కబెట్టుకుంటూనే.. మరోపక్క సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవల మంచు విష్ణుతో కలిసి 'మోసగాళ్ళు' చిత్రంలో నటించింది. ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కాజల్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ..
పెళ్లి తర్వాత కథలు, పాత్రల ఎంపికలో ఏమైనా మార్పు కోరుకుంటున్నారా?
అలాంటిదేమీ లేదు. ఇది వరకు ఒప్పుకొన్న సినిమాలే చేస్తున్నా. ఇకపై మరింత ఆచితూచి సినిమాలు చేస్తానేమో. నాకు వ్యక్తిగతంగా సెన్సార్ అనే నియమం పెట్టుకున్నా. ఇకపై అందుకు తగ్గట్టే కథల్ని ఎంపిక చేసుకుంటా. అంతే కానీ..పెళ్లయ్యింది కదా అని ప్రత్యేక జాగ్రత్తలంటూ ఏమీ లేదు. నాకు ప్రేమకథలన్నా, పౌరాణిక గాథలన్నా ఇష్టం. నవ్వించడమూ ఇష్టమే కాబట్టి ఆ అవకాశం ఏ సినిమా ఇచ్చినా కాదనకుండా చేస్తా. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అయితేనే విలువ అని నమ్ముతా.
మీ భర్తలో మీకు బాగా నచ్చేవి, నచ్చని విషయాలు ఏమిటి?
నేను సినిమాలు చేయడం వరకే ఆలోచిస్తాను. తను సినిమా వెనకాల విషయాల్ని గురించి ఆలోచిస్తుంటాడు. నచ్చని విషయాలంటే నేను మార్నింగ్ పర్సన్‌ని. లేవగానే మూడు నిమిషాల్లో నా పనుల్లో నేను బిజీ అయిపోతుంటా. కానీ తను బెడ్ రూమ్ నుంచి బయటికి రావడానికి అరగంటకి పైగా సమయం పడుతుంది.
కొత్త సినిమాల కబుర్లేమిటి?
'ఆచార్య' చేస్తున్నా. నాగార్జునతో ఓ సినిమా ఒప్పుకొన్నా. తమిళంలో 'ఘోస్టీ' అనే చిత్రం చేస్తున్నా. 'ఇండియన్2' ప్రస్తుతానికి ఆగిపోయింది. నేను హోస్ట్‌గా ఓ షో కూడా ఉండొచ్చు.
పెళ్లి తర్వాత జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి?
మార్పులంటే పెద్దగా ఏమీ లేవు. ఎప్పట్లాగే సినిమాలతో బిజీగా గడుపుతున్నా. అయితే వైవాహిక జీవితం ఓ కొత్త అనుభూతినిస్తోంది. మహిళలు ఇంటిని చక్కబెట్టుకుంటూనే, ఉద్యోగాలు, ఇతరత్రా పనులు చేయడం ఎంత పెద్ద విషయమో బాగా అర్థమవుతోంది. పెళ్లి తర్వాత మా అమ్మపై మరింత గౌరవం పెరిగింది. నేనూ నా ఇంటిని నడపడంపై దృష్టిపెట్టా.
మీకూ, మీ భర్త గౌతమ్‌కు ఎప్పట్నుంచో పరిచయం ఉందట కదా, మరి అది ఎవ్వరికీ తెలియకుండా ఎలా దాచారు?
(నవ్వుతూ) అదొక సినిమా స్టోరీ అవుతుంది. నిజానికి గౌతమ్, నేను మంచి స్నేహితులం. పదేళ్లుగా ఒకరికొకరు తెలుసు. మేం ఎప్పుడూ డేటింగ్ చేయలేదు. లాక్‌డౌన్‌లోనే మా స్నేహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలనుకున్నాం. ఇలాంటి సందర్భంలో ఎవరు నీతో ఉంటే బాగుంటుందనే ప్రశ్న వేసుకున్నప్పుడు మేం ఒకరికొకరు కనిపించాం. అప్పుడే మేం కలిసి జీవించాలనే నిర్ణయానికొచ్చాం. వెంటనే గౌతమ్ మా నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడారు. గౌతమ్ అడగ్గానే మా నాన్న ఒప్పుకొన్నారు. మా పెళ్లి తర్వాత మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఒక రకంగా మాది లాక్‌డౌన్ పెళ్లి అన్నమాట.
మీ పెళ్లి తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా'మోసగాళ్ళు'గురించి ఏం చెబుతారు? కథ విన్నాక మీ స్పందనేమిటి?
చాలా ఆసక్తికరమైన కథ. అక్కాతమ్ముడి ప్రయాణం నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేస్తుంది. జెఫ్రీ ఈ కథ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. అయితే మనం ఇద్దరం అక్కాతమ్ముళ్లుగా నటిస్తే ప్రేక్షకులు స్వీకరిస్తారా? అని విష్ణుని అడిగా. తను దర్శకుడిని విజన్ నమ్మి చేద్దామని చెప్పారు. అలా 'మోసగాళ్లు' ప్రయాణం మొదలైంది. అను పాత్రలో నేను కనిపిస్తాను. మోహన్‌బాబు సర్ ఈ సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. ఆయన మాట విన్నాక చాలా సంతృప్తి కలిగింది. హాలీవుడ్ దర్శకుడైన జెఫ్రీ పెద్ద పెద్ద సన్నివేశాల్ని మాతో చేయించారు. విష్ణు సెట్లో నిర్మాతలా కాకుండా.. ఒక నటుడిలా ఆలోచిస్తూ సినిమా చేశారు.
ఇదీ చూడండి:'యువ దర్శకులను ప్రోత్సాహించేందుకే అలా!'