తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​ను చూస్తే గర్వంగా ఉంది: కాజల్ అగర్వాల్ - kajal marriage

త్వరలో వివాహం చేసుకోనున్న ముద్దుగుమ్మ కాజల్.. మన అగ్రహీరోల గురించి చెప్పింది. మహేశ్​ నుంచి ఓ విషయం నేర్చుకున్నానని, ప్రభాస్​ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపింది.

kajal agarwal about tollywood heros
ప్రభాస్​ను చూస్తే గర్వంగా ఉంది: కాజల్ అగర్వాల్

By

Published : Oct 18, 2020, 8:58 AM IST

ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్.. పెళ్లయ్యాక కూడా నటిస్తానంటూ ముద్దుముద్దుగా చెప్పేసింది. ఈ క్రమంలోనే తన రీల్‌లైఫ్‌లోని పలువురు తెలుగు హీరోల గురించి చెబుతోందిలా.

హీరోయిన్ కాజల్ అగర్వాల్

తారక్ డ్యాన్స్‌కు ఫిదా

తారక్‌.. నటనలోనే కాదు, డ్యాన్స్‌లోనూ అద్భుతమే. నాకు తన డ్యాన్సంటే ఎంతిష్టమో.. అతనితో కలిసి డ్యాన్స్‌ చేయడమూ అంతే కష్టం. ఈ విషయాన్ని అతడికి ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. అంత ఎనర్జీ ఎలా వస్తుందనేది నాకు అస్సలు అర్థంకాదు. వీటన్నింటికీ మించి ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం. తన మనసులో ఏముందో దాన్నే బయటకు చెప్తాడు.

జూ. ఎన్టీఆర్

పవన్​కు పెద్ద అభిమానిని

పవన్‌కల్యాణ్‌.. చాలామంది హీరోయిన్లలా నాకు కూడా ఒకప్పుడు తనతో నటించే అవకాశం వస్తే బాగుండని అనిపించేది. అది 'సర్దార్‌'తో తీరింది. అంతకు ముందు చాలాసార్లు ఆయన్ని కలిశా కానీ మేం కలిసి నటిస్తామని అనుకోలేదు. తన పాత్ర విషయంలోనే కాదు సహనటులూ అంతే బాగా చేయాలనే తపన పవన్‌లో కనిపిస్తుంది. సెట్‌లో నేను ఎప్పుడైనా హైపర్‌గా ఉండి కాస్త హడావుడి చేస్తే 'బీ కామ్‌... ముందు దీర్ఘంగా శ్వాస తీసుకో..' అంటూ నన్ను కూల్‌ చేసేందుకు ప్రయత్నించేవాడు.

పవర్​స్టార్ పవన్​కల్యాణ్

చరణ్ నిజమైన స్నేహితుడు

రామ్‌చరణ్‌.. నాకు కోస్టార్‌ మాత్రమే కాదు, నిజమైన స్నేహితుడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి ముందుండే మంచి మనసున్న నటుడు. ఒకప్పుడు నాతో నటించి క్రమంగా నిర్మాతగానూ మారాడని తెలిసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. అతనితోనే కాదు... వాళ్ల నాన్నతోనూ కలిసి నటించడం నా కెరీర్‌లో ఎప్పటికీ మధుర జ్ఞాపకంగానే మిగిలిపోతుంది.

హీరో రామ్​చరణ్

మహేశ్ నుంచి అదే నేర్చుకున్నా

మహేశ్​బాబు... పర్‌ఫెక్షనిస్ట్‌. ఏదయినా సీను సరిగ్గా రాకపోతే మళ్లీమళ్లీ చేస్తాడే తప్పరాజీ పడడు. సినిమాల్లో కుటుంబ విలువలకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో జీవితంలోనూ అంతే. వీటన్నింటికీ మించి అతను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. వ్యాయామాలు, పోషకాహారం లాంటి విషయాలపైన మహేశ్​కు మంచి అవగాహన ఉంటుంది. అది నాకెంతో నచ్చుతుంది.

సూపర్​స్టార్ మహేశ్​బాబు

ప్రభాస్​ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది

ప్రభాస్‌.. బాహుబలితో తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన నటుడు. అతడు కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగిన తీరు చూస్తే.. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటి నటుడితో నేనూ కలిసి నటించినందుకు గర్వంగానూ ఉంటుంది. మొదటినుంచీ అతడిది కష్టపడే తత్వమే. దర్శకులు తన నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని... తన పాత్రకు 100 శాతం న్యాయం చేస్తాడు. ప్రభాస్‌ ఇంకా ఉన్నతికి చేరుకోవాలని ఎప్పుడూ కోరుకుంటాను.

డార్లింగ్ ప్రభాస్

ABOUT THE AUTHOR

...view details