కళ్లతోనే భావాల్ని వ్యక్తీకరించే సామర్థ్యం, అసమాన ప్రతిభ ఆమె సొంతం. 'బోల్ రే పపీ హరాపపీ హరా!' అనే పాటతో అలనాటి సినీ అభిమానుల్ని కనికట్టు చేసిన 'గుడ్డి' సినిమాతో జయబాధురి తన హవా మొదలుపెట్టారు. అంతకు ముందు భారతీయ సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడు సత్యజిత్ రే 'మహానగర్ బెంగాలీ' చిత్రంతో సహాయ పాత్ర ద్వారా తన 15 ఏళ్ల వయసులో 1963లో తొలిసారి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత... 1971లో పూర్తిస్థాయి హీరోయిన్‌గా 'గుడ్డి' సినిమాతో థియేటర్లలో కనువిందు చేశారు. అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రధాన స్రవంతిలో నిర్మాణమయ్యే కమర్షియల్ సినిమాల్లో అభినయ ప్రతిభ కనబరుస్తూనే... మరో పక్క కళాభినివేశానికి ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనూ నటిస్తూ వచ్చారు.
బిగ్ బి మానస చోరి జయబాధురి
బిగ్ బి అని పొడి అక్షరాల్లో యావద్భారతం పిలుచుకునే అమితాబ్ మనసును గెలుచుకున్న తార... అనంతర కాలంలో ఆయన అర్ధాంగి జయబాధురి(జయా బచ్చన్). పుణెలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందుతున్న కాలంలోనే అమితాబ్‌ని తొలిసారి చూశారు. ఆయన కళ్లలో కనిపించని లోతుల్ని ఆనాడే ఆమె అంచనా వేశారు. సరిగ్గా ఆ క్షణంలోనే ఆయన పట్ల అభిమానం అంతర్లీనంగా ఆమెలో కలిగింది. అది...లవ్ ఎట్ ఫస్ట్ సైట్..? ఏమో... ఆ సమయంలో ఆమెకి అర్ధం కాలేదు. కానీ, డెస్టినీని ఆమె నమ్ముకున్నారు. ఆమె నమ్ముకున్న డెస్టినీ అమితాబ్ జీవన సహచారిగా మలిచింది. అమితాబ్‌తో ఆమె నటించిన తొలి చిత్రం 1972లో వచ్చిన 'బన్సీ బిర్జూ'. 'మాలి' చిత్రం అదే సంవత్సరం వచ్చిన 'ఏక్ నజర్'. ఈ రెండు చిత్రాల ప్రయాణం వారిద్దరి స్నేహాన్ని పెంచి పోషించింది. ఆ తర్వాత వరుస అపజయాలతో సతమవుతూ ఇబ్బంది పడుతున్న వేళ... అమితాబ్‌తో ఏ హీరోయిన్ ముందుకు రాకపోతే... 1973లో 'జంజీర్' సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు జయబాధురి ముందుకు వచ్చారు. అనూహ్య రీతిలో 'జంజీర్' సినిమా అఖండ విజయం చవి చూసి అమితాబ్‌కి యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ వచ్చింది. అంతే... ఈ జంటకి ఇండస్ట్రీలో తిరుగులేకపోయింది. 1973లో అమితాబ్‌తో జయబాధురి వివాహమై జయ బచ్చన్‌గా మారారు. కొన్ని సినిమాల్లో తరువాత... పిల్లల పెంపకంపై దృష్టి సారించడం వల్ల అనివార్యంగా సినిమాలకు విరామం ప్రకటించారు. లీడ్ యాక్ట్రెస్‌గా ఆమె నటించిన ఆఖరి సినిమా 'సిల్ సిలా'.
బిగ్ బి కోసం స్టోరీ రైటర్‌గా
అమితాబ్ కోసం జయాబచ్చన్ స్టోరీ రైటర్‌గా మారారు. 1988లో అమితాబ్ అగ్రస్థానంలో నిలవాలనే కోరికతో 'షాహెనాష్' చిత్ర కథ సమకూర్చారు.