పరిచయం లేని రంగంలో సర్దుకోవడానికి ఎవరికైనా సరే కొంతకాలం పడుతుంది. ఆ పని అలవాటు అయ్యేంత వరకు ఇబ్బందిగానే ఉంటుంది. ఆ సమయంలో పక్కవారి నుంచి విమర్శ ఎదురైతే? కోపమొచ్చేస్తుంది. గోవా బ్యూటీ ఇలియానాకు గతంలో సరిగ్గా టాలీవుడ్లో ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఇలియానా నటించిన ఓ ప్రకటన చూసి 'దేవదాసు'లో అవకాశం ఇచ్చారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. షూటింగ్ అంతా భారంగా అనిపించినా సరే ఏదో విధంగా పూర్తి చేసింది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి విజయం అందుకోవడం వల్ల 'పోకిరి'లో సదవకాశం కొట్టేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఒకదాని కోసం ఈమె నిర్విరామంగా 20 గంటలు పనిచేసిందట. ఆ సమయంలో ఓ సహాయ దర్శకుడు తన నటనను విమర్శించాడని ఇలియానా చెప్పింది. అప్పుడు చాలా బాధేసిందని, అమ్మకు చెప్పి ఏడ్చానని తెలిపింది. ఒక్క క్షణం ఇక్కడ ఉండొద్దని, వెంటనే వెళ్లిపోదాం అన్నానని చెప్పింది. అమ్మే తనకు ధైర్యం చెప్పిందని, ఒప్పందం ప్రకారం సినిమా పూర్తి చేయాలని తెలిపినట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.