తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటన నుంచి నిర్మాణంలోకి ఎదిగిన ఛార్మింగ్​ బ్యూటీ - ఛార్మి న్యూస్​

"సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, చంటిగాడు ఇక్కడే ఉంటాడు లోకల్​" అనే డైలాగ్​ పూరిజగన్నాథ్​ సినిమాలోనిది. ఈ డైలాగ్​ ఓ హీరోయిన్​కు కచ్చితంగా నప్పుతుంది. ఆమె ఎవరో కాదు నటి ఛార్మి. ఎందుకంటే టాలీవుడ్​కు ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు..వెళ్లారు. కానీ, ఛార్మి ఇక్కడే నటిగా నిర్మాతగా స్థానం సంపాదించుకుంది. నేడు (మే 17) ఛార్మి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Actress Charmy kaur birthday special story
నటన నుంచి నిర్మాణంలోకి ఎదిగిన ఛార్మింగ్​ బ్యూటీ

By

Published : May 17, 2020, 5:31 AM IST

చిత్రసీమలో వందల మంది కథానాయికలు తెలుగు తెరపై సందడి చేస్తుంటారు. అందులో స్థిరమైన స్థానం సంపాదించుకొని, స్టార్‌లుగా మెరిసే ముద్దుగుమ్మలు కొద్దిమందే. అందులోనూ నాయికా ప్రాధాన్యంతో కూడిన కథలకి కేరాఫ్‌గా నిలుస్తూ, నటనపరంగానూ శభాష్‌ అనిపించుకొనేవాళ్లు ఇంకా అతి కొద్దిమందే ఉంటారు. కమర్షియల్‌ కథానాయికగానే కాకుండా... నటిగానూ గుర్తింపు తెచ్చుకొన్న తక్కువమంది కథానాయికల్లో 'ఛార్మి' ఒకరు.

ఛార్మి కౌర్​

'మంత్ర', 'అనుకోకుండా ఒక రోజు', 'మనోరమ', 'మంగళ', 'సై ఆట', 'కావ్యాస్‌ డైరీ', 'మంత్ర2', 'నగరం నిద్రపోతున్నవేళ', 'ప్రతిఘటన', 'జ్యోతిలక్ష్మి'... ఇలా నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలు ఆమె కెరీర్‌లో చాలానే ఉన్నాయి. కమర్షియల్‌ చిత్రాల్లోనూ ఆమె బలమైన పాత్రలే చేసింది. కథానాయికగానే కాకుండా, నిర్మాతగానూ తనదైన ముద్ర వేసింది.

ముంబయిలో పుట్టి పెరిగిన పంజాబీ పడుచు ఛార్మి. మే 17, 1987న సిక్కు కుటుంబంలో ఆమె జన్మించింది. కార్మెలైట్‌ కాన్వెంట్‌ హైస్కూల్‌లో చదువుకొంది. పాఠశాల విద్య చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు అందుకుంది ఛార్మి. తెలుగు తెరపై తొలినాళ్లల్లో పాల బుగ్గలతో, కాస్త బొద్దైన ఆకారంతో దర్శనమిచ్చిందీ ముద్దుగుమ్మ. 'నీతోడు కావాలి' ఛార్మి తొలి చిత్రం. ఆ తర్వాత తమిళం, మలయాళం నుంచి అవకాశాలు అందుకొంది.

ఛార్మి కౌర్​

కెరీర్​ మలుపు తిప్పిన సినిమా

2003లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'శ్రీ ఆంజనేయం'లో నటించడం ఛార్మి కెరీర్‌కి ఓ పెద్ద మలుపు. ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసినా ఆమెకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత 'గౌరి', 'చంటి', 'మాస్‌', 'చక్రం', 'అనుకోకుండా ఒకరోజు', 'పొలికల్‌ రౌడీ', 'అల్లరి పిడుగు', 'చుక్కల్లో చంద్రుడు', 'లక్ష్మి', 'స్టైల్‌', 'పౌర్ణమి', 'చిన్నోడు', 'రాఖి', 'లవకుశ', 'మంత్ర', 'సుందరకాండ', 'భలే దొంగలు', 'మైఖైల్‌ మదనకామరాజు'... ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసింది.

ఛార్మి కౌర్​

తెలుగులో పలువురు అగ్ర కథానాయకులతో కలిసి ఆడిపాడింది. దక్షిణాదిలోని నాలుగు భాషల్లో నటించి పేరు తెచ్చుకొంది. హిందీలోనూ 'బుడ్డా హోగా తేరా బాప్‌', 'జిల్లా గజియాబాద్‌', 'రాంబో రాజ్‌కుమార్‌' తదితర చిత్రాలు చేసి మెరిపించింది. 'మంగళ' చిత్రంలో నటనకిగానూ ఉత్తమ నటిగా జ్యూరీ, 'మంత్ర'కిగానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాలు అందుకొంది.

నిర్మాతగా మారి

పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన 'జ్యోతిలక్ష్మి'తో ఆమె నిర్మాతగా మారింది. పూరి కనెక్ట్స్‌ సంస్థ బాధ్యతలు చూసుకుంటూనే, ఇటీవల పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్​ శంకర్​' చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం యువకథానాయకుడు విజయ్​ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్​ దర్శకత్వం వహిస్తున్న పాన్​-ఇండియా చిత్రానికి సహనిర్మాతగా ఉంది.

విజయ్​ దేవరకొండ, పూరి జగన్నాథ్​ పాన్​ ఇండియా మూవీ పూజా కార్యక్రమంలోని దృశ్యం

ఇదీ చూడండి.. బాలీవుడ్​ నటి ప్రియాంక ఖరీదైన ఇంటిని చూశారా?

ABOUT THE AUTHOR

...view details