తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​తో సినిమా అనగానే ఎగిరి గంతేశా: అంజలి

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ తన నటనను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని అంటోంది నటి అంజలి. పవన్​ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న 'వకీల్​సాబ్​' చిత్రంలో అంజలి కీలకపాత్ర పోషించారు. ఏప్రిల్​ 9న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను నటి అంజలి మీడియాతో పంచుకున్నారు.

Anjali interview on Vakeel Saab movie
'పవన్​తో సినిమా అనగానే ఎగిరి గంతేశా!'

By

Published : Apr 1, 2021, 10:40 PM IST

"పవన్‌ కల్యాణ్‌తో సినిమా అనగానే ఎగిరి గంతేశా" అని అన్నారు నటి అంజలి. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న 'వకీల్‌ సాబ్‌'లో కీలకపాత్ర పోషించారామె. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు అంజలి. ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది? తన పాత్ర ఎలా ఉంటుంది? ఆమె మాటల్లోనే..

చాలా మార్పులున్నాయి..

అంజలి

దర్శకుడు వేణు శ్రీరామ్‌ నన్ను కలిసి 'పింక్‌' రీమేక్‌ చేయబోతున్నాం, అయితే అందులో ఉన్నది ఉన్నట్టు కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశామని స్క్రిప్టు వినిపించారు. అలా చెప్పడం నన్ను ఆకట్టుకుంది. నా పాత్ర కూడా బాగా నచ్చింది. అందుకే కథ వినగానే ఓకే చేసేశాను. నేను 'పింక్'‌ చిత్రం చూశాను. ఆ సినిమాకు, ఈ సినిమాకు చాలా మార్పులున్నాయి. ట్రైలర్‌ చూసిన వాళ్లలో కొందరికి (పింక్‌ చూసిన వాళ్లు) ఈ విషయం అర్థమై ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఎన్ని మార్పులున్నాయో మీకే తెలుస్తుంది. నా విషయానికొస్తే 'పింక్‌', 'వకీల్‌ సాబ్‌'ను పోల్చి చెప్పలేను.

ఎగిరి గంతేశా..

ఈ సినిమాకు పవన్‌ కల్యాణ్‌ హీరో అని తెలియగానే ఆనందంలో ఎగిరి గంతేశా! నా పాత్ర విషయంలోనూ అదే ఆనందం. ఎందుకంటే పెద్ద పెద్ద చిత్రాల్లో హీరో పాత్ర తప్ప ఇతర పాత్రలు అంతగా కనిపించవు. ఇందులో అలా ఉండదు. కథానాయకుడి పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. నా పాత్రకూ అంతే ఉంటుంది. అందరికీ గుర్తిండిపోయే మంచి పాత్ర అవుతుందనే నమ్మకంతో ఉన్నాను.

'వకీల్​సాబ్​' పోస్టర్​

పవన్‌ అడుగుపెడితే అంతా సైలెంట్‌..

కొత్తలో పవన్‌కల్యాణ్‌ సర్‌తో మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉండేది. ఎందుకంటే ఆయన సెట్‌లో అడుగుపెట్టగానే అక్కడున్న వారంతా సైలెంట్‌ అయిపోతారు. నేనేమో ఎక్కువ మాట్లాడేస్తుంటా. ఆయన ఏమనుకుంటారో, ఒకే సన్నివేశం మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తే ఏమంటారో అని టెన్షన్‌‌ పడేదాన్ని. అలా ఆయన దగ్గరకి వెళ్లి మాట్లాడటానికి నాకు 15 రోజులు పట్టింది. ఆ తర్వాత అన్ని భయాలు తొలగిపోయాయి. ఆయనతో పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. ఎప్పుడూ ఎవ్వరీకీ చెప్పని పవన్‌.. 'బాగా చేశారు' అని నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ చిత్రంలో నివేదా థామస్‌, అనన్యతోనే నాకు ఎక్కువ సన్నివేశాలున్నాయి. తొలి రోజు నుంచే మేము స్నేహితుల్లా ఉండేవాళ్లం. ప్రకాశ్‌ రాజ్‌గారితో పోటీ పడి నటించే మంచి అవకాశం ఈ సినిమాతో లభించింది.

అదే చెప్పబోతున్నాం..

అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎవరికివారు ఓ వార్తలా చదివి పక్కనే పెట్టేస్తున్నారు. అదే నేరం మీ ఇంట్లో వాళ్లకు జరిగితే ఏమవుతుంది? అనే పాయింట్‌నే సినిమాలో చూపించబోతున్నాం. వ్యక్తిగతంగా నేను ఫీలై ఈ సినిమాలో నటించాను.

అంజలి

విన్నప్పుడే హిట్‌ అవుతుందనుకున్నాం..

'మగువా మగువా' పాటను విన్నప్పుడే హిట్‌ అవుతుందని అనుకున్నాం. కానీ, ఇంత పెద్ద హిట్‌ అవుతుందనుకోలేదు. మాతృక చిత్రం 'పింక్‌'లో ఈ పాట లేదు. అమ్మాయిల విలువ తెలియజేసేందుకు తెలుగులో ఈ పాటని పెట్టారు. 'వకీల్ సాబ్‌' ‌కోసం చేసిన పెద్ద మార్పు ఇదే.

గత చిత్రాలు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'గీతాంజలి', 'జర్నీ'లోని పాత్రలు నాకు బాగా పేరు తీసుకొచ్చాయి. 'వకీల్‌సాబ్​'లోని నా పాత్ర పేరు ప్రస్తుతానికి చెప్పలేను. కానీ, ఆ పాత్ర కూడా ఈ జాబితాలో చేరుతుంది.

అంజలి

ఇదీ చూడండి:దక్షిణాదిలో ఎంట్రీ.. బాలీవుడ్​లో స్టార్ హోదా!

ABOUT THE AUTHOR

...view details