మనల్ని వేరొకరితో పోల్చడం లేదా ఎక్కువగా విమర్శించడం అనేవి ప్రతిఒక్కరి జీవితంలో జరిగేదే అని అంటోంది కథానాయిక అదితీరావు హైదరీ. ఆ పరిస్థితుల్లో మనసుకు కొంచెం బాధగా అనిపించినా.. తాను అక్కడితో ఆగిపోకుండా ముందుకు సాగుతానని చెబుతోంది. జీవితంలోని కొన్ని విషయాల గురించి అదితీరావు స్పందిస్తూ..
"ఒక్కోసారి ప్రజలు మనల్ని బాగా విమర్శిస్తారు. వేరొకరితో పోలుస్తూ ఉంటారు. అలాంటప్పుడు నా మనసుకు కొంచెం బాధగా ఉంటుంది. అయినా ప్రతి విషయాన్ని స్వీకరిస్తాను. అనుభూతి చెందుతాను. బిగ్గరగా నవ్వుతాను. దాంతో అక్కడితో ఆగిపోతా. ఓ నటిగా సున్నితంగా ఉండగలను. అంతేకాదు కష్టతరమైన రోజుల్లో కఠినంగానే ఉంటాను. అప్పుడూ వేరొక మార్గాన్ని అనురిస్తూ పాజిటివ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తా. కొన్ని సందర్భాల్లో మన నటన నచ్చకపోవచ్చు. అప్పుడు తిరస్కరిస్తారు. ఇలాంటి సమయంలో కొంచెం బాధగా ఉంటుంది. మీరు నన్ను ఏ చీకటి ప్రదేశంలోనైనా ఉంచినా.. నేను మాత్రం సూర్య కిరణాల కోసం ఎదురు చూస్తుంటా. చాలా వరకూ తక్కువగా బాధపడుతుంటా. నిత్యం సరదాగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటా. ఊరికే ఒంటరిగా కూర్చుని బాధపడడం నాకు ఇష్టం ఉండదు. నేను ఆ రకం వ్యక్తిని కాదు"
- అదితీరావు హైదరీ, కథానాయిక