Sarvanand Rashmika Adavallu meeku joharlu: "కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్.. ఇలా అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది" అన్నారు నటి ఊర్వశి. ఆమె.. రాధిక, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించిన చిత్రమిది. శర్వానంద్, రష్మిక నాయకానాయికలుగా నటించారు. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలను పంచుకున్నారామె.
"ఈ సినిమాలో హీరోకి ఐదుగురు తల్లులు ఉంటారు. అందులో ఓ తల్లితో కొంచెం ఎక్కువ అనుబంధం, ప్రేమ ఉంటాయి. అది ఎందుకు? ఆ తల్లి ఎవరు? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి. ఐదుగురు తల్లుల్ని ఒప్పించి.. హీరో తన ప్రేయసిని ఎలా పెళ్లి చేసుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. టైటిల్‌కు తగ్గట్లుగానే ఆడవారికి ప్రాధాన్యమున్న చిత్రమిది. వారి గొప్పతనాన్ని చాటే విధంగా ఉంటుంది. ఐదుగురు మహిళలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి స్క్రిప్ట్ రావడం చాలా అరుదు".