పదహారేళ్ల వయసులోనే చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన ఓ అందాల భామ అనతికాలంలోనే 'స్టార్' ఇమేజ్‌ని సంతరించుకుంది. మెరుపులా పరిశ్రమలో ప్రవేశించి అచిర కాలంలోనే అగ్రశ్రేణి నటుల సరసన చిరుదివ్వెగా వెలిగింది. కీర్తి శిఖరాలను అందుకుంది. అచ్చం తెలుగు సినిమాలో జరిగినట్లే ప్రేమలో విఫలం చెందింది. ఆత్మహత్యా ప్రయత్నానికి సాహసించింది. సినిమా అవకాశాలను దూరం చేసుకుంది. పెళ్లి చేసుకొన్న భర్తకు విడాకులిచ్చింది. ఊబకాయం తగ్గించుకుని తిరిగి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంది. ఆ ప్రయత్నంలో అనూహ్యంగా ప్రాణాలనే విడిచింది. ఇది ఆర్తి అగర్వాల్ విషాద గాథ. నేడు (జూన్ 6) ఆమె వర్థంతి సందర్భంగా ఆర్తి అగర్వాల్ జీవితంలోని కొన్ని విశేషాలివే..
పుట్టింది రాజకుమారిగా...
పుట్టింది అమెరికా దేశంలోని న్యూజెర్సీ మహానగరంలో. తండ్రి శశాంక్ అగర్వాల్ వ్యాపారంలో స్థిరపడిన శ్రీమంతుడు. పద్నాలుగేళ్ల వయసు వచ్చేదాకా న్యూజెర్సీలోనే తన చెల్లెలు ఆదితి అగర్వాల్‌తో కలిసి చదువు కొనసాగింది ఆర్తి. మోడలింగ్ అంటే ఆర్తికి ఎంతో ఇష్టం. నటుడు, నిర్మాత సునీల్‌శెట్టి అమెరికాకు వెళ్లినప్పుడు ఆర్తిని చూసి ఆమె చేత ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా నగరాల్లో నృత్య ప్రదర్శనలు ఇప్పించారు. ఆ ప్రదర్శనలకు బిగ్-బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సునీల్‌శెట్టితో పాటు బిగ్-బి కూడా ఆమె ప్రదర్శనకు ముచ్చటపడి బాలీవుడ్‌కు ఆహ్వానించారు. అలా ఆర్తికి మంచి నటిగా ఎదగాలని కలలు మొదలయ్యాయి. పదహారేళ్ల వయసులో ఇండియాకి వచ్చింది. 2001లో నిర్మాత రాజీవ్‌షా, జోయ్ అగస్టీన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పాగల్‌పన్' బాలీవుడ్ సినిమాలో.. ఐదుగురు అన్నదమ్ముల కుటుంబంలో అపురూపంగా పెరిగిన చెల్లెలు రోమాగా ఆమె నటించింది.
తెలుగు ఆడపడుచుగా..
2001లో స్రవంతి రవికిషోర్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ 'నువ్వు నాకు నచ్చావ్' పేరుతో ఒక ప్రేమకథ రాశారు. విజయభాస్కర్ దర్శకత్వంలో ఆ కథను సినిమా తీయాలని రవికిషోర్ ఒక కొత్త అమ్మాయి కోసం అన్వేషిస్తుంటే ఆర్తి కనిపించింది. అలా వెంకటేష్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దొరకబుచ్చుకుంది. సెప్టెంబరు 6, 2001న విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కోటి సంగీతం సమకూర్చిన వాన పాట 'ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని' యువతరాన్ని ఉర్రూతలూపింది. అంతే.. ఆర్తి ఒక్కసారి టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది.
సినిమా విజయవంతం కావడం వల్ల 2003లో ఇదే చిత్రాన్ని సెల్వభారతి దర్శకత్వంలో విజయ్-స్నేహ జంటగా తమిళంలో 'వసీహర' పేరుతో పునర్నిర్మించారు. అదే సినిమా కన్నడంలో 'గౌరమ్మ'గా వచ్చి బాగా ఆడింది. 'నువ్వు నాకు నచ్చావ్' చిత్ర విజయంతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆర్తి హీరోయిన్‌గా 2002లో 'నువ్వు లేక నేను లేను' పేరుతో మరో ప్రేమకథను తెరకెక్కించింది. ఇందులో హీరోగా తరుణ్ నటించగా కాశీ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇదీ సూపర్ హిట్‌గా నిలిచింది. 2002లో ఎన్టీఆర్ సరసన 'అల్లరి రాముడు'లో నటించింది. అదీ బాగా ఆడటం వల్ల హిందీలోకి 'మై హూ ఖుద్దార్' పేరుతో డబ్ చేశారు.
'అల్లరి రాముడు' దర్శకుడు బి.గోపాల్ సారథ్యంలో చిరంజీవి సరసన 'ఇంద్ర' సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తే అది ఆర్తికి మంచి పేరుతెచ్చింది. ఈ సినిమా హిందీలో 'ఇంద్ర.. ది టైగర్' పేరుతో, తమిళంలో 'ఇంద్రన్' పేరుతో డబ్ చేసి విడుదల చేస్తే అక్కడా విజయాలే స్వాగతించాయి. ఇదే సినిమాను 'దాదా' పేరుతో బెంగాలీ భాషలో పునర్నిర్మించారు. అదే సంవత్సరం మరోచిత్రం 'నీ స్నేహం'లో ఉదయకిరణ్ సరసన ఆర్తి హీరోయిన్‌గా నటించింది. ఎమ్.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా బాగానే ఆడింది. దీన్ని కూడా బెంగాలీలో 'ప్రేమి' పేరుతో డబ్ చేశారు. అప్పటికే ఆర్తి పేరు టాలీవుడ్‌లో మారుమోగింది.
ఆపై మహేశ్‌బాబు సరసన 'బాబీ' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. చివరికి హీరో, హీరోయిన్లు ఇద్దరూ చనిపోయే ముగింపు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. హిందీలో ఈ సినిమాని 'డాగ్.. ది బర్నింగ్ ఫైర్' పేరుతో డబ్ చేశారు. 2003లో 'వసంతం' సినిమాలో మళ్లీ వెంకటేష్ సరసన ఆర్తి హీరోయిన్‌గా నటించింది. తమిళంలోనూ ఇదే చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించడం విశేషం. ఇది 71 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. బి.గోపాల్ మరోసారి ఆర్తి అగర్వాల్‌ను బాలకృష్ణ సరసన 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమాలో నటింపజేశాడు. ఇందులో సొనాలిబింద్రే నటించింది. ఈ సినిమా ఫ్లాప్ కావడం ఆర్తికి ఒక రకంగా దెబ్బే.
ఆ తర్వాత రాజా పినిశెట్టి దర్శకత్వంలో 'వీడే' సినిమాలో రవితేజ సరసన రీమాసేన్‌తో కలిసి ఆర్తి నటించింది. ఇదొక సగటు సినిమా. 2004లో వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో 'నేనున్నాను' చిత్రంలో నాగార్జున సరసన శ్రియ శరణ్‌కు తోడుగా ఆర్తి రెండో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విజయవంతమై 42 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. మరలా బి.గోపాల్ 'అడవి రాముడు' సినిమాలో ప్రభాస్ ప్రక్కన నటించే అవకాశం కల్పించాడు. ఈ సినిమా సాధారణంగా ఆకట్టుకుంది. ఇక 2005లో రవిబాబు దర్శకత్వంలో తరుణ్‌తో 'సోగ్గాడు' సినిమాలో ఆర్తి నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక ముప్పలనేని శివ సినిమా 'సంక్రాంతి' సూపర్ హిట్టయ్యింది. కానీ అది మల్టీసారర్ సినిమా కావడం వల్ల ఆర్తి పాత్ర అందరిలో ఒకటిగా నిలిచింది.