క్రీడా నేపథ్యం ఉన్న బయోపిక్‌లు నటీనటుల క్రేజ్‌ను అమాంతంగా పెంచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సచిన్, ధోనీ, మిల్కా సింగ్ బయోపిక్‌లే ఇందుకు నిదర్శనం. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే మరిన్ని స్పోర్ట్స్ బయోపిక్‌లు తెరపై రూపొంది, అభిమానులను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా బాలీవుడ్లో ఇప్పటివరకు ప్రముఖ క్రీడాకారుల జీవితం ఆధారంగా తీసిన చిత్రాల గురించే ఈ కథనం.
భాగ్ మిల్కా భాగ్- మిల్కా సింగ్
తన పరుగుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్. భారత కీర్తి పతాకాన్ని విశ్వ వేదికపై ఎగురవేశారు. ఈయన జీవితాధారంగా 'భాగ్ మిల్కా భాగ్' రూపొందించారు. 2013లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఫర్హాన్ అక్తర్.. మిల్కా సింగ్‌గా కనిపించారు. ఇందులోని పాత్రకుగాను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నారు. ఈ చిత్రం కూడా పలు అవార్డులను అందుకుంది. రాకేష్ ఓంప్రకాశ్ దర్శకత్వం వహించారు.
దంగల్ - మహావీర్ సింగ్ ఫొగాట్
'దంగల్'.. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా. 2016లో విడుదలై ఘనవిజయం సాధించింది. ప్రముఖ కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫొగాట్, ఆయన కుమార్తెల జీవితాధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. నితీష్ తివారీ దర్శకుడు.
ధోని - మహేంద్ర సింగ్ ధోనీ
'ధోని : ది అన్‌టోల్డ్ స్టోరీ'.. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టైటిల్ రోల్ పోషించారు. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ఈ చిత్రం. 2016లో విడుదలైన ఈ సినిమా.. విశేష ప్రేక్షకాదరణ పొందింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించారు.