కేఎస్ రామారావు సమర్పణలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ చిత్రం ప్రేమికులు రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిినిమాకు క్రాంతిమాధవ్ దర్శకుడు. కె.ఎ.వల్లభ నిర్మాత. విజయ్ దేవరకొండ శైలి ప్రేమకథ ఇది. యువతరం జీవితాలకు అద్దం పడుతూ సాగుతుంది. "అందరి జీవితం ఎక్కడో ఒక చోట ప్రేమతో ముడిపడి ఉంటుంది. నలుగురు కథానాయికలున్నా, కథానాయకుడు భిన్నమైన వేషధారణలో కనిపిస్తున్నా.. అదంతా కూడా కథలో భాగంగానే" అంటున్నారు నిర్మాత రామారావు. మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే..
"కాలానుగుణంగా వచ్చిన మార్పులకి తగ్గట్టే సినిమా మారుతూ వచ్చింది. కథాలోచనలతోపాటు.. సాంకేతికతలోనూ ఆధునికత కనిపిస్తోంది. డిజిటల్ వేదికల వల్ల భవిష్యత్తులో పెను మార్పులు రాబోతున్నాయి."
'పెళ్లి చూపులు' చూడగానే విజయ్‌తో చేయాలనుకున్నా.. "చిత్రసీమలో ప్రత్యేకమైన నటులు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటారు. 'పెళ్లిచూపులు' సినిమా చూశాక విజయ్ దేవరకొండ ఆ తరహా నటుడే అనిపించింది. అప్పుడే విజయ్‌తో సినిమా చేయాలని సంప్రదించా. క్రాంతిమాధవ్ కొత్త తరహా ఆలోచనలతో సినిమా తీసే దర్శకుడు. తొలి చిత్రం 'ఓనమాలు', ఆ తర్వాత మా సంస్థలో చేసిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' చిత్రాలతోనే ఆయన ప్రత్యేకతని చాటారు. రకరకాల ప్రదేశాల్లో, సందర్భాల్లో తీయాల్సిన కథ ఇది. అందుకే ఇంత ఆలస్యమైంది. ప్రేమికుల రోజున విడుదల చేయాలని నిర్ణయించాం."
"నవతరంతో సినిమా అంటే వాళ్ల ఆలోచనలకి దగ్గరగా వెళ్లి సినిమాలు చేయాలి. నాలాంటి నిర్మాతలకి అది కష్టమే అయినా ప్రయత్నిస్తున్నా. నాలుగు తరాల కథానాయకుల్ని చూసినవాణ్ని కాబట్టి, కొన్నిసార్లు నా ఆలోచనలు యువతరం కంటే వేగంగా అనిపిస్తుంటాయి. 51 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 47 చిత్రాలు చేశా. నలభయ్యేళ్ల లోపు ప్రేక్షకులు డిజిటల్ మీడియాకి అలవాటుపడ్డారు. అలాగని వాళ్లు థియేటర్లకి దూరం కాలేదు. వెండితెరపై ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటారో అలాంటి సినిమాల్ని చూస్తూ, ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. అందుకే డిజిటల్ వేదికల్లో దొరికే వినోదాన్ని మించి సినిమాలు చేయాల్సిన అవసరముంది."
"నిర్మాత లేకపోతే చిత్ర పరిశ్రమలో ఏదీ లేదు. కానీ నిర్మాత కన్నా, దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్న సంస్థలే ఎక్కువ సంపాదిస్తున్నాయి. మా సినిమా ట్రైలర్‌ని, మరో సినిమా ఆడుతున్న థియేటర్లో ప్రదర్శించాలంటే డిజిటల్ ప్రొవైడర్లకి డబ్బు చెల్లించాలి. అది ప్రదర్శించింది థియేటర్‌లో కాబట్టి ఆ యాజమాన్యానికో లేదంటే, ఆ సినిమా నిర్మాతకో వెళ్లాలి. కానీ డిజిటల్ ప్రొవైడర్‌కి వెళుతోంది. ఇలా చాలా లోపాలున్నాయి. నిర్మాతలంతా ఆలోచించాల్సిన సమయమిది. పంపిణీ వ్యవస్థ గుత్తాధిపత్యం దిశగా, ఇద్దరు ముగ్గురు చేతుల్లోకి వెళుతోంది. దాంతో కొంతమందికే మేలు జరుగుతోంది. ఇతరులకు అన్యాయం జరుగుతోంది. తదుపరి మాసంస్థలో నాని - మారుతి కలయికలో సినిమా చేస్తున్నాం."
ఇదీ చదవండి: పవన్ సినిమాల వార్తల్లో నిజమేంత..?