'బిగిల్' చిత్ర ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు శనివారంతో ముగిశాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో హీరో విజయ్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ ఇళ్లు, కార్యాలయాలతోపాటు ప్రదర్శన హక్కులు దక్కించుకున్న స్క్రీన్ సీన్ సంస్థల్లో ఈ సోదాలు చేపట్టారు.
నైవేలిలో షూటింగ్ స్పాట్ నుంచి విజయ్‌ను చెన్నైలోని పణయూర్‌లో ఉన్న ఆయన నివాసానికి తీసుకొచ్చి మరీ విచారించారు. ఆయన నివాసాల్లో సోదాలు గురువారంతో ముగియగా... ఏజీఎస్ సంస్థ, అన్బుచెళియన్ నివాసాలు, కార్యాలయాల్లో కొనసాగాయి. ఇవి శనివారం ఉదయం ముగిశాయి. అన్బుచెళియన్ వద్ద లెక్కచూపని కరెన్సీ రూ.77 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఏజీఎస్, అన్బుచెళియన్ నివాసాల్లో అధిక సంఖ్యలో దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం తదుపరి దర్యాప్తు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.