ఏ మనిషికీ ఇతరుల మనసును నొప్పించే హక్కు లేదని.. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి అన్నారు. కొద్దిరోజుల కిందట ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై కొంతమంది నుంచి అభ్యంతరం వ్యక్తమైన వ్యాఖ్యలపై తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఒక వీడియో పంచుకున్నారు.
నా పొరపాటుకు మన్నించండి: తనికెళ్ల భరణి - తనికెళ్ల భరణి కవితలు
గత కొన్ని రోజులుగా 'శభాష్ రా శంకరా..' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి. అయితే వాటిపై కొంతమంది నుంచి అభ్యంతరాలు వ్యక్తమవ్వడం వల్ల దానికి తనికెళ్ల భరణి క్షమాపణలు చెప్పారు.

"గత కొన్ని రోజులుగా 'శభాష్ రా శంకరా..' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టూ చేస్తూ వస్తున్నా. అయితే.. దురదృష్టవశాత్తూ కొన్ని వ్యాఖ్యలు కొంతమంది మనసును నొప్పించాయని తెలిసింది. ఇక దానికి నేను వివరణ ఇచ్చుకోదలుచుకోలేదు. చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. అలాగే ఆ పోస్టు తొలగించాను. నాకు హేతువాదులన్నా.. మానవతావాదులన్నా గౌరవమే తప్పితే వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషినీ నొప్పించే హక్కు, అధికారం ఎవరికీ లేదు. అందుకే జరిగిన పొరపాటుకు మరోసారి మన్నించమని కోరుతున్నా" అని అందులో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:జాంబీ కథతో హ్యూమా హాలీవుడ్ ఎంట్రీ