సినిమాల్లో నవరసాలు అత్యద్భుతంగా పండించిన ఎస్వీ రంగారావు చలనచిత్ర రంగ ప్రవేశం అంత సజావుగా సాగలేదు. 'పాతాళభైరవి' విడుదలయ్యే వరకు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డారు. నటన మీద మోజుతో చేతికందిన ఉద్యోగాలు వదులుకున్నారు. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు ఉన్నాయి.
కుటుంబ కథాచిత్రాలే కాదు, డిటెక్టివ్ చిత్రాల్లోనూ రాణించిన రంగారావు.. తొలి సినిమాలో నటించేందుకు అనేక ఇబ్బందులు, ఆటుపోట్లతో పాటు అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ నటసార్వభౌముడు తదనంతరకాలంలో పాత్రలను మించి ఎదిగి నటించారు. రౌద్రం, వీరం, అద్భుతం, కరుణ రసాలను అలవోకగా పండించిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
నటసార్వభౌముని తొలిరోజులు.
ఎస్వీ రంగారావుగా పిలుచుకునే సామర్ల వెంకట రంగారావు.. 1918 జూలై 3న కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఈయనకు నలుగురు అన్నదమ్ములు, ఎనిమిది మంది అక్కచెల్లెళ్లు. సంసారం పెద్దది కావడం వల్ల అందరూ తాత ఇంట్లోనే పెరిగారు. తాత డాక్టర్ కోటయ్య నాయుడు నూజివీడులో పెద్ద శస్త్రచికిత్సా నిపుణుడిగా పేరు గడించారు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, బ్రహ్మసమాజ సానుభూతిపరుడు. ప్రముఖ తెలుగు చలనచిత్ర పితామహుడుగా కీర్తించబడే రఘుపతి వెంకటరత్నం నాయుడుకు రంగారావు తాత చాలా సన్నిహితుడు. రంగారావు తల్లి లక్ష్మీనరసమ్మ గృహిణి. తండ్రి కోటేశ్వరరావు నాయుడు ఎక్సైజ్ ఇనస్పెక్టరు ఉద్యోగం చేసేవారు. ఆయన కూడా బ్రహ్మసమాజ కార్యకర్తే. దేవులపల్లి కృష్ణశాస్త్రికి రంగారావు తండ్రి సహాధ్యాయి. ఉద్యోగరీత్యా తండ్రి ఊళ్లు మారుతుండడం వల్ల రంగారావు ఆలనా పాలనా నూజివీడులో తాత ఇంటనే సాగింది. రంగారావుకు రెండేళ్ల వయసున్నప్పుడు తాత మద్రాసుకు మకాం మార్చారు.
హైస్కూలు చదువుకు రాకముందే తాత మద్రాసులో మరణించారు. నాయనమ్మ గంగారత్నం సంరక్షణలోనే రంగారావు పెరిగారు. మద్రాసు ట్రిప్లికేన్‌లోని హిందూ హైస్కూలులో చదువు సాగింది. నాయనమ్మ కట్టుదిట్టంలో పెంచడం వల్ల పిరికితనం ఆవహించి, ఆత్మవిశ్వాసం లోపించిన వ్యక్తిగా పెరిగి పెద్దవాడయ్యారు. రంగారావుకు నాటకాల మీద ఆసక్తి. ఆ నాటకాలకు వెళ్లాలంటే ఏవో సాకులు చెప్పాల్సిన పరిస్థితి. వంశమర్యాదలకు నాయనమ్మ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ సంఘర్షణలో రంగారావులో తిరుగుబాటు లక్షణం బలపడింది. 15 సంవత్సరాల వయసులో ఆయన స్కూలులో ఓ నాటకంలో మాంత్రికునికి సహాయకుడిగా నటించారు. భవిష్యత్తులో అలాంటి మాంత్రికుడి పాత్రే తనని నటుడుగా నిలబెడుతుందని ఊహించలేకపోయారు.
అప్పుడే బలమైన కాంక్ష
1936లో ఆంధ్ర నాటక కళాపరిషత్ వారు ప్రదర్శించిన పోటీ నాటకాల్లో ఆనాటి సూపర్ స్టార్లు అనదగిన బళ్లారి రాఘవ, గోవిందరాజుల సుబ్బారావు, స్థానం నరసింహారావు వంటి నిష్ణాతులు నటించడం చూశాక రంగారావువుకు నటుడు కావాలని బలమైన ఆకాంక్ష పెరిగింది. అప్పుడే టాకీ సినిమాలు రావడం వల్ల మద్రాసులో ఆడుతున్న తమిళ, తెలుగు, హిందీ సినిమాలు చూడడం అలవాటైంది. రంగారావు చూసిన తొలి తెలుగు సినిమా 'లవకుశ' (1934), తొలి హిందీ సినిమా 'అచ్యుత్ కన్య' (1936), తొలి తమిళ సినిమా 'అంబికా పతి' (1937). సినిమాల్లో, నాటకాల్లో నటించాలంటే వాచకం చాలా అవసరమని భావించి, రంగారావు వక్తృత్వ పోటీల్లో ఎక్కువగా పాల్గొనడం ప్రారంభించారు. శరీర సౌష్టవం కోసం ఆటల్లో పాల్గొనేవారు. ఏలూరులో రంగారావు మేనత్త భర్త, గంగారత్నం అల్లుడుగారైన బడేటి వెంకట్రామయ్య నాయుడు మరణించడం వల్ల, మేనత్త వద్దకు మకాం మార్చడం వల్ల రంగారావు హైస్కూల్ చదువు ఏలూరుకు మారింది.
బడేటి వెంకట్రామయ్య నాయుడు ఆరోజుల్లో గోదావరి జిల్లా బోర్డు అధ్యక్షుడుగా ఉంటూ జస్టిస్ పార్టీలో అగ్రనాయకుడుగా ఎదిగారు. ఏలూరులో చదువు పూర్తయ్యాక రంగారావు ఇంటర్మీడియట్ చదువుకోసం విశాఖపట్నం వెళ్లి ఎ.వి.ఎన్ కాలేజిలో చేరారు. ఆ కాలేజి ప్రిన్సిపాలు సుంకర పార్థసారథి, రంగారావు తండ్రి మంచి మిత్రులు. రంగారావు వ్యక్తిత్వానికి మెరుగుపెట్టి ఓ స్వరూపాన్ని కలిగించిన వ్యక్తి పార్థసారథి. కాలేజి విద్యార్థి సంఘాల్లో రంగారావుకు ఎన్నో పదవులు కల్పించారు. తండ్రికన్నా రంగారావుకు ఎంతో సన్నిహితులయ్యారు. నియమాలు నేర్పారు. మంచి పౌరునిగా తీర్చిదిద్దారు. తరువాత బి.ఎస్.సి చదవడానికి కాకినాడ వెళ్లారు. పిఠాపురం రాజావారి కళాశాలలో బి.ఎస్.సి.లో చేరారు. 1943లో పట్టా పుచ్చుకున్నారు. అక్కడ చదువుకుంటూనే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్‌లో నాటకాలు వేయడం మొదలెట్టారు. ఆ క్లబ్‌కు దంటు సూర్యారావు అధ్యక్షుడుగా ఉండేవారు.
పెనుపాత్రుని ఆదినారాయణరావు (అంజలీదేవి భర్త ఆదినారాయణరావు) ఆ నాటక సమాజానికి కార్యనిర్వాహకుడు, శిక్షకుడు, సంగీత దర్శకుడుగా వ్యవహరించేవారు. రంగారావు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ తరఫున 'లోభి' అనే నాటకంలో హీరోగా, 'పీష్వా నారాయణరావు వధ' అనే నాటకంలో అరవై ఏళ్ళ వృద్ధ రఘునాథరావు పాత్రలోను నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదినారాయణరావు రచించి దర్శకత్వం వహించిన 'వీధి గాయకులు' అనే నాటకంలో రంగారావు అంజలీదేవితో కలిసి నటించారు. అంజలీదేవి ఆ సమాజం ప్రదర్శించే అన్ని నాటకాల్లోనూ నృత్యం చేస్తూ, స్త్రీపాత్రలు పోషిస్తూవుండేవారు. అప్పట్లో రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ వుద్యోగం చేస్తున్న దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావు కూడా రంగారావుతోబాటు నాటకాల్లో నటిస్తుండేవారు. రంగస్థలనటుడుగా రాణిస్తున్న రోజుల్లో ‘పోతన’ చిత్ర శతదినోత్సవ సభకు దర్శకుడు కె.వి.రెడ్డి కాకినాడ రావడం జరిగింది. అప్పుడే రంగారావు కె.వి.రెడ్డికి పరిచయం అయ్యారు. ఇంతెందుకు... ప్రముఖ దర్శక నిర్మాత, నటులు ఎల్.వి.ప్రసాద్ రంగారావు కుటుంబానికి సన్నిహిత మిత్రులు.
ఏలూరులో రంగారావు ఇల్లు, ప్రసాద్ ఇల్లు ఎదురెదురుగా ఉండేవి. ఇన్ని ప్రాపకాలు వుండి కూడా రంగారావుకు సినిమాలలో నటించే అవకాశం రాలేదు. అయితే అతని రంగస్థల నటన ఒక మంచి ఉద్యోగం సంపాదించి పెట్టేందుకు ఉపకరించింది. సైనికుల వినోదార్ధం కాకినాడలో ‘వీధిగాయకులు’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ హ్యాన్డింగ్ హ్యామ్ హాజరవడం జరిగింది. రంగారావు నటనకు ముగ్ధుడైన ఆ డైరెక్టర్ రంగారావు బి.ఎస్.సి పట్టభద్రుడని తెలుసుకొని అగ్నిమాపక శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అలా రంగారావుకు ఫైర్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఖాయమైంది. దాంతో రంగారావు మద్రాసు వెళ్లి మూడు నెలల శిక్షణ పూర్తిచేశారు. మొదటి పోస్టింగ్ బందరులో. అయితే అక్కడ కొన్ని నెలలు మాత్రమే పనిచేశారు. తరువాత విజయనగరం బదలీ కావడం వల్ల కళలకు పుట్టిల్లైన ఆ వూర్లో నాటకాలు వెయ్యడం మొదలెట్టారు.
కలిసొచ్చిన అవకాశం...కలిసిరాని కాలం...
1946 ఆరంభంలో తలవని తలంపుగా రంగారావు జీవితం ఒక మలుపు తిరిగింది. రంగారావు సమీప బంధువు బి.వి.రామానందం 'వరూధిని' అనే సినిమా నిర్మించాలచి, ప్రవరాఖ్యుడు పాత్రకోసం నటుల అన్వేషణలో పడ్డారు. అతడు రంగారావు విషయం తెలుసుకొని, ఆ పాత్రను పోషించేందుకు మద్రాసు రమ్మని కబురెట్టారు. రంగారావు తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి మద్రాసు చేరుకున్నారు. ఆరోజుల్లో సినిమాలు మద్రాసుతోబాటు కొల్హాపూర్, సేలం, కలకత్తా నగరాల్లో ఎక్కువగా నిర్మించబడుతుండేవి. ‘వరూధిని’ సినిమాను సేలంలోని మోడరన్ థియేటర్స్ స్టూడియోలో ప్రారంభించారు. రంగారావుకు నెలకు ముట్టిన జీతం 250 రూపాయలు. అందులో దాసరి తిలకం (నటి గిరిజ తల్లి) వరూధినిగా నటించింది. ఆ సినిమా 1947 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైంది. అందులో రంగారావు పేరును ఎస్.వి.ఆర్.రావ్, బి.ఎస్సీ అని టైటిల్స్‌లో వేశారు. కానీ రంగారావుకు ఆ పాత్ర అంతబాగా నప్పలేదు.
కాకినాడ ఎల్ఫిన్ టాకీసులో, ఏలూరు, రాజమండ్రి సినిమా హాళ్లలో తొలిసారి ఈ సినిమా విడుదలైంది. తరువాత బెజవాడ, గుంటూరులో విడుదలైంది. తొలిరోజు నుంచే ఈ సినిమాకు ఫ్లాప్ ముద్రపడింది. దాంతో రంగారావుకు సినిమా అవకాశాలు రాలేదు. మరలా ఉద్యోగం వెదుక్కుంటూ జంషెడ్పూర్ వెళ్లి టాటా స్టీల్ ఫ్యాక్టరీలో గుమాస్తా ఉద్యోగంలో చేరారు. రెండేళ్లపాటు అక్కడే వుండిపోయారు. 1947 డిసెంబరు 27న తన మేనమామ బడేటి వెంకట్రామయ్య కూతురు లీలావతిని వివాహమాడి రంగారావు ఒక ఇంటివాడయ్యారు. అక్కడి ఆంధ్రా కల్చరల్ క్లబ్ వారు నిర్వహించి నాటకాల్లో, ముఖ్యంగా పౌరాణిక నాటకాల్లో రంగారావు వేషాలు వేస్తుండేవారు. అక్కడి ఆంధ్ర సంఘం వారు ప్రదర్శించే 'వీరాభిమన్యు', 'వెన్నెల', 'ఊర్వశి' వంటి నాటకాల్లో ముఖ్యపాత్రలు రంగారావే పోషించేవారు. అప్పుడే సినీ నిర్మాతగా అవతారమెత్తుతున్న బి.ఎ.సుబ్బారావు 'పల్లెటూరిపిల్ల' చిత్రాన్ని నిర్మిస్తూ అందులో ప్రతినాయకుడు కంపనదొరగా నటించేందుకు రావలసిందిగా రంగారావుకు టెలిగ్రాం ఇచ్చారు.
కానీ, అదే సమయంలో రంగారావు తండ్రి చనిపోయారు. ధవళేశ్వరం నుంచి టెలిగ్రాం రావడం వల్ల రంగారావు ధవళేశ్వరం వెళ్లారు. మరణశయ్యపై వున్న తండ్రి రంగారావుతో 'నువ్వు ప్రపంచంలో ఎవరికీ భయపడవద్దు. నువ్వు మంచిదని తోచిన పనిని ఎవరు ఆమోదించక పోయినా ఆచరించు' అంటూ హితబోధ చేశారు. తండ్రి అంత్యక్రియలు వగైరా పూర్తి చేసుకొని రంగారావు మద్రాసు వెళ్లేసరికి, అప్పటికే ఆలస్యమైందని దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావు ఆ కంపనదొర పాత్రను ఎ.వి.సుబ్బారావుకు ఇచ్చేశారు.
ఓ చిన్న పాత్ర
అయితే అంత దూరం నుంచి తనని నమ్ముకొని, ఉద్యోగం వదలుకొని వచ్చారని బాధపడి అందులో ఒక చిన్న పాత్రను రంగారావుకు ఇచ్చారు. అది అంజలీదేవి తండ్రి పాత్ర! సమాంతరంగా రంగారావును బి.ఎ. సుబ్బారావు ఎల్.వి.ప్రసాద్‌కు పరిచయం చేశారు. అప్పుడు ప్రసాద్ 'మనదేశం' సినిమాకు దర్శకత్వం వహిస్తునారు. అందులో ఎన్.టి.రామారావుతోబాటు రంగారావుకు కూడా పోలీసు ఇన్స్పెక్టర్ పాత్రను ఇచ్చారు. ప్రసాద్ సిఫారసు మీదే పి.పుల్లయ్య రంగారావుకు ‘తిరుగుబాటు’ అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. అలాగే హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ‘నిర్దోషి’ చిత్రంలో ప్రాత్రకోసం సిఫార్సు చేస్తే, అది అంతకు ముందే ముక్కామలకు వెళ్ళింది.
విజయా సంస్థతో అంబరానికి...