టాలీవుడ్లో బలమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో ఒకరిగా.. బలమైన అభిమాన గణమున్న హీరోల్లో ఒకరిగా సూర్య గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. శుక్రవారం(జులై 23) ఆయన 46వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక కథనం..
తండ్రి పేరు చెప్పకుండా..
ప్రముఖ నటుడు శివకుమార్, లక్ష్మీ దంపతులకు తొలి సంతానంగా 1975 జులై 23న చెన్నైలో జన్మించారు సూర్య. అసలు పేరు శరవణన్ శివకుమార్. కోయంబత్తూరులో పెరిగారు. సూర్యకు తమ్ముడు కార్తి, చెల్లెలు బృందా శివకుమార్ ఉన్నారు. మద్రాసులోని సెయింట్ బేడీ స్కూల్, లయోలా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. చదువయ్యాక ఎనిమిది నెలల పాటు దుస్తుల ఎగుమతి కంపెనీలో పనిచేశారు. అయితే ఆ కంపెనీలో తాను నటుడు శివకుమార్ తనయుడు అనే విషయాన్ని సూర్య ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత ఆ కంపెనీ ఓనరే స్వయంగా తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
తొలి అవకాశం అలా!
తొలుత సినిమాలపై అంతగా ఆసక్తి లేని సూర్యకు 'ఆశై' సినిమాలో అవకాశం వచ్చినా తిరస్కరించారు. 1997లో 'నెరుక్కు నెర్' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. మణిరత్నం నిర్మించిన చిత్రమిది. ఆ తర్వాత 'కాదలే నిమ్మది', 'సందిప్పొమ', 'పెరియన్న', 'పూవెల్లమ్ కెట్టుప్పర్' తదితర చిత్రాల్లో నటించారు. ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖ్ తెరకెక్కించిన 'ఫ్రెండ్స్'తోనూ, బాల దర్శకత్వం వహించిన 'నందా'తోనూ సూర్య సినీ ప్రయాణం మలుపు తిరిగింది.
తెలుగులోనూ మంచి డిమాండ్
గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన 'కాక్కా కాక్కా' చిత్రం సూర్యకు ఘన విజయాన్ని అందించింది. ఆ చిత్రం తెలుగులో 'ఘర్షణ'గా రీమేకై విజయం సాధించింది. బాల దర్శకత్వం వహించిన 'పితామగన్' కూడా తమిళంతో పాటు, తెలుగులోనూ అనువాదమై ఆయనకు మంచిపేరు తీసుకొచ్చింది. 2005లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గజిని'తో సూర్య సినీ ప్రయాణమే మారిపోయింది. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అప్పట్నుంచి దాదాపుగా సూర్య నటించిన ప్రతి చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'సింగమ్' సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు సూర్య.